పకడ్బందీగా ఆన్‌లైన్‌ తరగతులు

ABN , First Publish Date - 2021-06-14T03:47:05+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ, అనుబంధ పీజీ, డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు ఆదేశించారు.

పకడ్బందీగా ఆన్‌లైన్‌ తరగతులు
ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు, వీసీ

- వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు 

ఎచ్చెర్ల, జూన్‌ 13 : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ, అనుబంధ పీజీ, డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు ఆదేశించారు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై ఆదివారం వర్చువల్‌ విధానంలో వర్సిటీ, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో  సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాం. వర్సిటీ సూచనలు, ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలి. బోధనలో అలసత్వం ప్రదర్శించొద్దు. విద్యార్థుల హాజరు శాతం సరిగా ఉండేలా చూడాలి. పీజీ ప్రథమ సంవత్సరంలోని 1వ సెమిస్టర్‌కు ఈ నెల 20వ తేదీలోగా సిలబస్‌ను పూర్తిచేసి, పరీక్షలకు సిద్ధం చేయాలి. రెండో సెమిస్టర్‌ సిలబస్‌ను ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో బోఽధించాలి. ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనల సడలింపు మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాం. డిగ్రీ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులకు రీసెర్చ్‌ గైడెన్స్‌కు వర్సిటీ అనుమతి ఇస్తుంది. ఆసక్తి గల అధ్యాపకులు కళాశాలల ద్వారా వర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో రీసెర్చ్‌ అడ్మిషన్లు జరుగుతాయి. రీసెర్చ్‌ గైడెన్స్‌ కోసం అధ్యాపకుల వివరాలు త్వరితగతిన వర్సిటీకి అందజేయాలి. డిగ్రీ 3, 5 సెమిస్టర్‌ పరీక్షా పేపర్ల మూల్యాంకనాకి ఇప్పటికే 7 కేంద్రాలను ఎంపిక చేశాం. కొవిడ్‌ నిబంధనల మేరకు అదనంగా మరో 3 కేంద్రాల్లో మూల్యాంకనం నిర్వహిస్తాం. ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాల్లో కన్వీనరు కోటా, సెల్ప్‌ ఫైనాన్స్‌, మేనేజ్‌మెంటు కోటాలో ఏఏ కోర్సుల్లో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయో వర్సిటీకి సమాచారాన్ని అందజేయాలి. డిగ్రీ ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలు జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదు చేయాలి. దీనిపై కొద్ది రోజుల్లో కళాశాలల ప్రిన్సిపాల్స్‌, డేటా ఎంట్రీ ఆపరేట్లరకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు’ అని తెలిపారు.  కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ తమ్మినేని కామరాజు, సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-14T03:47:05+05:30 IST