అగ్నిపథ్‌పై ఆగ్రహ జ్వాల

ABN , First Publish Date - 2022-06-18T08:17:15+05:30 IST

పగిలిన బోగీల అద్దాలు.. పట్టాలపై కుప్పలుగా రకరకాల వస్తువులు, ఫ్లాట్‌ఫాంలపై ధ్వంసమైన తినుబండారాల స్టాళ్లు.. ముక్కలైన టీవీలు.. మంటలకు ఆహుతైన రైల్వే ఇంజన్లు.. పార్సిల్‌ వ్యాన్లు.. పోలీసుల ఉరుకులు, పరుగులు...

అగ్నిపథ్‌పై ఆగ్రహ జ్వాల

అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్న ఆర్మీ అభ్యర్థులు..

 రణరంగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

ఆర్పీఎఫ్‌ జవాన్ల కాల్పులు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

9 గంటల సేపు తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో 24 మంది

సాధారణ ప్రయాణికుల్లాగా రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశం

కర్రలు, రాడ్లతో రైళ్లపై దాడి.. ఇంజన్లు, అద్దాలు ధ్వంసం

ఆరు బోగీలకు నిప్పు.. స్టేషన్‌ను చుట్టుముట్టిన పొగలు

దాడులతో భీతిల్లిన ప్రయాణికులు.. బయటకు పరుగులు

రైల్వే భద్రతా దళం హెచ్చరించినా తగ్గని ఆందోళనకారులు

అడ్డుకోబోయిన పోలీసులపై యువకుల దాడులు

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డీజీ ఆదేశాలతో

నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు

యువకుడి ఛాతీలో దిగిన బుల్లెట్‌.. ఆస్పత్రిలో మృతి

రైల్వే ఆస్తులకు దాదాపు రూ.7 కోట్ల మేర నష్టం: డీఆర్‌ఎం

ఆందోళనకారులపై 14 సెక్షన్ల కింద కేసులు నమోదు


సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్‌’పై.. ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు! ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో మండిపడ్డారు!! పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల దాకా.. జరిగిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు, ఆర్పీఎఫ్‌ సిబ్బందికి గాయాలయ్యాయి.



హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట/సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌,  హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): పగిలిన బోగీల అద్దాలు.. పట్టాలపై కుప్పలుగా రకరకాల వస్తువులు, ఫ్లాట్‌ఫాంలపై ధ్వంసమైన తినుబండారాల స్టాళ్లు.. ముక్కలైన టీవీలు.. మంటలకు ఆహుతైన రైల్వే ఇంజన్లు.. పార్సిల్‌ వ్యాన్లు.. పోలీసుల ఉరుకులు, పరుగులు... ప్రయాణికుల అరుపులు.. ఆందోళనకారుల నినాదాలు.. పోలీసులు, ఆర్పీఎఫ్‌ సిబ్బందిపై రాళ్ల వర్షం.. వారిపై ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్ల కాల్పులతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ శుక్రవారం దద్దరిల్లింది. ఆ కాల్పుల్లో ఒక యువకుడి ఛాతీలోకి తూటా దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరింటిదాకా రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. పలు దఫాలుగా నిరసనకారులతో చర్చలు జరిపినా ఫలించకపోవడంతో.. ప్రత్యేక బలగాల సాయంతో సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆందోళనకారులను అక్కణ్నుంచీ బలవంతంగా తరలించారు.


ఇదీ నేపథ్యం..

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తెలంగాణలోని కరీంనగర్‌లో 2019లో, 2021లో హకీంపేట్‌లో ఆర్మీ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఆయా ర్యాలీలకు హాజరయ్యారు. వారిలో 3500 మంది ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించారు. మెడికల్‌ పరీక్షలు పూర్తి చేసు కున్నారు. కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (సీఈఈ) కోసం తమ జిల్లాల పరిధిలోని కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. అసలే వయసు మీరిపోతోంది.. ప్రభుత్వం సీఈఈ నిర్వహించట్లేదని వారంతా ఆందోళన చెందుతున్న వేళ కేంద్రం ఉన్నట్టుండి ‘అగ్నిపథ్‌’ పథకాన్ని ప్రకటించడంతో వారంతా ఆగ్రహంతో ఉడికిపోయారు. సీఈఈ నిర్వహించాలంటూ గతంలో పలుమార్లు హకీంపేట ఏఆర్‌వో అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేసినా పట్టించుకోకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వానికి తమ వాణిని వినిపించాలంటే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరసన తెలపడమే ఏకైక మార్గమని వారు నిర్ణయించుకున్నారు. 


వాట్సాప్‌ గ్రూపులతో..

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిరసన కాండను నిర్వహించాలని ముందుగానే ప్రణాళిక రచించుకున్న ఆర్మీ అభ్యర్థులు ఆ దిశగా పకడ్బందీగా ముందుకుసాగారు. రైల్వే స్టేషన్‌ బ్లాక్‌, ఆర్మీ 17/6.. ఇలా పలు పేర్లతో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చేపట్టే ఆందోళనలో పాల్గొనాలంటూ అందులో పోస్టులు పెట్టారు. దీంతో మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, సిద్ధిపేట్‌, కరీంనగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, తదితర జిల్లాల్లోని అకాడమీల్లో చదువుతున్న వందలాది మంది యువకులు గురువారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారిలో 20 మంది వరకు ఫ్లాట్‌ఫాం-1పై రాత్రి 8.30 గంటల సమయంలో అటూఇటూ తిరిగి నిరసన ఎలా తెలియజేయాలో చర్చించుకున్నారు. పోలీసులు ఎదురుదాడికి దిగినా ఎక్కడికి వెళ్లకుండా కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. స్టేషన్‌ బయట కొందరు, ఆవరణలో మరికొందరు సాధారణ ప్రయాణికుల మాదిరిగా నిద్రించారు. కొందరు తమ స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద రాత్రి నిద్రపోయి ఉదయమే స్టేషన్‌కు చేరుకున్నారు. షిరిడీ నుంచి నిజామాబాద్‌ మీదుగా వచ్చిన అజంతా ఎక్స్‌ప్రె్‌సలో కూడా వందలాది మంది యువకులు సికింద్రాబాద్‌ చేరుకున్నారు.


ఒక్కొక్కరుగా వచ్చి..

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రాత్రివచ్చిన వారితోపాటు శుక్రవారం తెల్లవారు జామున మరికొందరు బస్సులు, రైళ్లలో స్టేషన్‌లో దిగారు. సరిగ్గా ఉదయం 8.45 గంటలకు స్టేషన్‌ లోపలికి ప్రవేశించి.. సాధారణ ప్రయాణికుల మాదిరిగా ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫాంపైన ఒలిఫెంట బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడ అందరూ పెద్దపెట్టున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుడ్డుకర్రలు, ఇనుపరాడ్లతో దాడులు ప్రారంభించారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం పై ఉన్న సికింద్రాబాద్‌-దానాపూర్‌ రైలు ఇంజన్‌ డ్రైవర్లను దించేశారు. ఇంజన్‌, బోగీల అద్దాలు ధ్వంసం చేశారు. తర్వాత అన్ని ఫ్లాట్‌ఫాంలపై ఉన్న రైళ్లపై దాడులను కొనసాగించారు. ఫ్లాట్‌ఫాం-2పై నిలిచి ఉన్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌, అద్దాలను తుక్కుతుక్కు చేశారు. స్లీపర్‌ కోచ్‌ల్లోని దుప్పట్లను తగలబెట్టారు. ఆ దుప్పట్లను తీసుకెళ్లి.. ఇంజన్‌ వెనకాల ఉన్న పార్శిల్‌ వ్యాన్‌లో వేయడంతో దానికి నిప్పంటుకుని, అందులో ఉన్న చేపలు, విగ్గుల తయారీలో ఉపయోగించే వెంట్రుకలు కాలిబూడిదయ్యాయి. ఈ రైలులోని విద్యుత్‌ వ్యవస్థకు సంబంధించిన బోగీకి కూడా తగులబెట్టేందుకు ప్రయత్నించారుగానీ.. అందులోని సిబ్బంది ప్రాధేయపడడంతో వెనక్కితగ్గారు.


తర్వాత, శబరి ఎక్స్‌ప్రెస్‌ బోగీ అద్దాలు పగులకొట్టారు. అజంతా, రాజ్‌కోట్‌ రైళ్ల బోగీలను ధ్వంసం చేశారు. ప్లాట్‌ఫాంలపై ఉన్న తినుబండరాల స్టాళ్లను, కుర్చీలు, టీవీలను, డిస్‌ప్లేలను, లిఫ్టులను, నల్లాలను ధ్వంసం చేశారు. బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న రైళ్లలో ఎక్కి కూర్చున్న ప్రయాణికులు ఆందోళనకారుల దాడులతో వణికిపోయారు. భయంతో అరుస్తూ బయటకు పరుగెత్తారు. 








అందుకే కాల్పులు?

ఈస్ట్‌కోస్‌ ఎక్స్‌ప్రె్‌సకు ఇంజన్‌ కింద నాలుగు వేల లీటర్లు ఉన్న ఆయిల్‌ ట్యాంక్‌ ఉంది. ఒకవేళ ఈ ఆయిల్‌ ట్యాంక్‌ పేలితే పక్కనే ఉన్న పదవ నెంబరు ప్లాట్‌ఫాం సమీపంలో ఉన్న ఆయిల్‌ డిపోకి మంటలంటుకునే ప్రమాదం ఉంది. అదే జరిగితే రైల్వేస్టేషన్‌లోని ప్రతి ఒక్కరికీ పెనుముప్పు సంభవిస్తుందన్న ఆందోళనతోనే కాల్పులకు ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.


నిద్దరోతున్న నిఘా?

‘అగ్నిపథ్‌’ ఆందోళనకారుల విధ్వంసం విషయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌, ఠాణాల స్థాయిలో స్పెషల్‌ బ్రాంచ్‌(ఎ్‌సబీ) పూర్తిగా విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆందోళనకారులు పకడ్బందీగా రెండు రోజులుగా వాట్సాప్‌ గ్రూపుల్లో చాటింగ్‌ చేసుకుంటున్నా.. అధునాతన టెక్నాలజీతో నిషేధిత ‘కీవర్డ్స్‌’ను కనుగొనే అవకాశాలున్నా.. నిఘావర్గాలు ఆ దిశలో దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే పోలీసులు గురువారం రాత్రే అనుమానాలు వ్యక్తం చేస్తూ.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా.. వారు కనీసం ఎస్‌బీ సిబ్బందిని పంపి, విచారించి ఉంటే.. ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


బలవంతంగా తరలింపు

ఆందోళనకారులను శాంతింపజేసేందుకు రైల్వే డీజీ సందీప్‌ శాండిల్య,  రైల్వే ఎస్పీ అనురాధ, హైదరాబాద్‌ అడిషనల్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మధ్యాహ్నం ఒంటిగంటకు నిరసనకారుల వద్దకు వెళ్లి మాట్లాడారు. తమకు తిరుమలగిరి ఆర్మీ అధికారుల నుంచి సరైన హామీ రావాలని, టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీవోడీ)ని రద్దు చేయాలని, పాత అభ్యర్థులకు కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ వెంటనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. వీటిపై స్పష్టత వచ్చేవరకు అక్కడి నుంచి కదిలేదని బీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అధికారులు  ప్రత్యేక బలగాలతో వారిని చుట్టుముట్టి.. సాయంత్రం 5.59 గంటలకు పట్టాలపై నుంచి వారిని బలవంతంగా లేపారు. 6.10 గంటలకు అందరినీ సమీపంలోని పోలీ్‌సస్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. కాగా.. రైల్వేస్టేషన్‌లో ఒకవైపు యుద్ధవాతావరణం నెలకొని ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు ఆదం సృజన్‌ కుమార్‌ అక్కడికి చేరుకుని పోలీసులపై ఫైర్‌ అయ్యారు. దాంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడి పాత్ర ఉందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక.. ఆందోళనకారుల దాడిలో ఈస్ట్‌కోస్ట్‌, హౌరా, అజంతా, రాజ్‌కోట్‌, గరీబ్‌రథ్‌, శబరి, రాయ్‌పూర్‌ ఎక్స్‌ప్రె్‌సలతోపాటు లోకో ఇంజన్లు, మెడికల్‌ రిలీఫ్‌ వ్యాన్‌ ధ్వంసమయ్యాయని, రైల్వేకు రూ.7 కోట్ల ఆస్తినష్టం విటిల్లిందని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ గుప్తా తెలిపారు. 




గాయపడ్డవారి వివరాలు..

ఆర్పీఎఫ్‌ పోలీసులు జరిపిన కాల్పులో కర్నూల్‌ జిల్లా మంత్రాలయానికి చెందిన జగన్నాథ్‌ రంగస్వామి (20), కరీంనగర్‌ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన కె.రాకేశ్‌ (20), మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ (20), వరంగల్‌ జిల్లాకు చెందిన ఎ.కుమార్‌ ( 21), కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌కు చెందిన పరశురాం (22), ఖమ్మం జిల్లాకు చెందిన నాగేందర్‌ బాబు (21), ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన విద్యాసాగర్‌ (20), మిర్యాలగూడ జిల్లాకు చెందిన లక్ష్మణ్‌రెడ్డి (20), వికారాబాద్‌ కులకచెర్ల గ్రామానికి చెందిన డి.మహేష్‌ (21), నిర్మల్‌ జిల్లాకు చెందిన భరత్‌ కుమార్‌ (21), మహబూబాబాద్‌ జిల్లా మద్దివంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్‌, మోహన్‌ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో లక్కం వినయ్‌కు ఛాతీలో రబ్బర్‌ బులెట్‌ దిగడంతో సర్జరీ నిర్వహించారు. కొమరంభీం, ఆసిఫాబాద్‌కు చెందిన ఇద్దరు యువకుల తలకు గాయమైంది.


మిగిలిన వారందరికి చిన్న గాయాలు అయ్యాయని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు చెప్పారు. ఆందోళనకారుల దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. వారి వివరాలు..  బి.వెంకట్రాములు, ఐఆర్‌పీ, హైదరాబాద్‌, ఎ.శ్రీనివాస్‌, ఐఆర్‌పీ, హైదరాబాద్‌,  ఎం.సాంబమూర్తి, ఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, నీల్‌కమల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌, గిరిరాజ్‌ ప్రసాద్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌, ఎన్‌.సుధీర్‌కుమార్‌, ఏసీపీ గోపాలపురం, చంద్రు, టీఎ్‌సఎ్‌సపీ కానిస్టేబుల్‌. ఇక.. ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సలో లోకోపైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామ్మూర్తి ఆందోళనకారుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.


కాల్పుల మోత..

 ఆందోళనకారులను అడ్డుకునేందుకు.. ఆర్పీఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ సిబ్బంది, స్పెషల్‌ఫోర్స్‌తోపాటు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు ప్రయత్నించారు. అయితే, వారు పట్టాలపై కూర్చుని భీతావహ వాతావరణం సృష్టించడమే కాక.. పట్టాలపై ఉన్న రాళ్లతో వారిపై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఉదయం 11 గంటల సమయంలో.. రైల్వే డీజీ సందీప్‌ శాండిల్య ఆదేశాల మేరకు ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్‌లతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేశ్‌ (22) ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. పోలీసులు అతణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేశ్‌ మరణించాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. అలాగే, ఇద్దరికి తలకు, ఇంకొకరి వీపు భాగంలో తూటాలు తగిలాయి.  గాయపడిన పలువురు యువకులను గాంధీకి తరలించారు. వారిలో ఒక ఆందోళనకారుడికి వెన్నెముక విరిగింది.  

Updated Date - 2022-06-18T08:17:15+05:30 IST