ఐఎస్ఐ గూఢచర్యం.. ఆర్మీ జవాను అరెస్టు

ABN , First Publish Date - 2021-10-24T01:57:08+05:30 IST

అత్యంత కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్లకు లీక్ చేస్తున్న ఆరోపణలపై ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌లో పనిచేస్తున్న ఇండియన్..

ఐఎస్ఐ గూఢచర్యం.. ఆర్మీ జవాను అరెస్టు

అమృత్‌సర్: అత్యంత కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్లకు లీక్ చేస్తున్న ఆరోపణలపై ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌లో పనిచేస్తున్న ఇండియన్ ఆర్మీ జవాన్ క్రునల్ కుమార్ బరియాను అమృత్‌సర్ స్పెషల్ ఆపరేషన్ సెల్ శనివారంనాడు అరెస్టు చేసింది. సోషల్ మీడియా యాప్‌ల ద్వారా వివిధ ఐఎస్ఐ ఏజెంట్లతో బరియా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవాడని అధికారులు గుర్తించారు. అరెస్టయిన బరియాను గుజరాత్‌లోని థమ్నాడ్ టౌన్‌ నివాసిగా గుర్తించారు.


''ఐటీ సెల్‌లో తన విధులను స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఆర్మీకి సంబంధించిన అత్యంత కీలకమైన, క్లాసిఫైడ్ సమాచారాన్ని పాక్‌కు చెందిన ఏజెంట్లకు బరియా చేరవేసేవాడు. అందుకు ప్రతిగా పాక్ ఏజెన్సీలు అతనికి డబ్బులు చెల్లిస్తుండేవారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, 2020లో ఫేస్‌బుక్ ద్వారా సిద్రా ఖాన్ అనే మహిళా పాక్ ఇంటెలిజెన్స్ అధికారి (పీఐఏ)తో పరిచయం పెంచుకున్నాడు. ఫేస్‌బుక్, మెసెంజర్ అనుసంధానం తర్వాత వాట్సాప్‌కు, ప్రైవేట్ మెసేజింగ్, కాలింగ్ యాప్స్‌కు ఇద్దరూ షిఫ్ట్ అయ్యారు'' అని ఒక ప్రెస్‌నోట్‌లో అధికారులు తెలిపారు. కాగా, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌లోని 3,4,5,9 సెక్షన్లు, ఐపీసీలోని సెక్షన్ 120(బి)కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. బరియా చేరవేస్తున్న సమాచారంతో ఏ మేరకు నష్టం జరిగిందో అంచనా వేసేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఒక్కడే ఈ పనికి పాల్పడ్డాడా, అతనికి ఎవరైనా సహకరించారనే అనే దానిపై కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితుడిని లాంఛనంగా అరెస్టు చేసిన అధికారులు అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు.

Updated Date - 2021-10-24T01:57:08+05:30 IST