సైన్యానికీ పాకిన సంస్కరణల సెగ!

Published: Sat, 25 Jun 2022 03:21:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఆకర్షణీయమైన నినాదాలివ్వడం, ప్రజలను బోల్తా కొట్టించడంలో సిద్ధహస్తులైన కేంద్ర పాలకులు తమ గత అన్ని చర్యలను తలదన్నేలా ఏకంగా దేశ రక్షణకే సంబంధించిన సరికొత్త పథకం ప్రకటించారు. త్రివిధ దళాలలో నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిన సైనికులను నియమించే ఈ పథకానికి కూడా అగ్నిపథ్‌ అనే ఒక ఆకర్షణీయ నినాదమిచ్చింది ప్రభుత్వం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌ దేశంలోని యువత సైన్యంలో పని చేయడానికి గర్వంగా భావిస్తారని, జీవితకాలంలో సైనిక యూనిఫారం వేసుకోవాలని ఆశపడతారని, వారి ఆశలు తీర్చడానికే ఈ పథకమని గొప్పగా చెప్పారు. అయితే ఆ పక్కనే ఉన్న సైనికాధికారి రక్షణ వ్యయంలో అధిక భాగం వేతనాలు, పెన్షన్లకే పోతోందని, ఆ వ్యయాన్ని తగ్గించుకోవడానికే ఇది ఉద్దేశించబడిందని అసలు విషయాన్ని సెలవిచ్చారు.


మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలలో కార్మిక సంస్కరణలు కూడా ఒక భాగం. ఇందులో ఎటువంటి ఉద్యోగ భద్రత లేని పరిమితకాల ఉపాధి ఒక ప్రధాన అంశం. దీనిని ఇప్పుడు రక్షణ రంగానికి కూడా వర్తింపచేస్తున్నారు. అలాగే, నూతన పెన్షన్‌ స్కీం రద్దు చేసి, దాని స్థానంలో పాత పెన్షన్‌ పునరుద్ధరించాలనేది దేశవ్యాప్తంగా ఉద్యోగుల డిమాండు. 2004లో అమలులోకి వచ్చిన ఈ ముదనష్టపు స్కీం అందరికీ వర్తించినా, సైనికులను మాత్రం దీని నుంచి మినహాయించారు. ఇప్పుడు ఈ పథకం ద్వారా మూడోవంతు మంది సైనికులకు ఇక ఏ పెన్షనూ లేకుండా పోతుంది. ఎటువంటి రక్షణాలేని, తక్కువ వేతనాలకు పని చేయించుకునే సైన్యాన్ని తయారుచేయడానికే ఈ పథకం ఉద్దేశించబడింది. సంపద సృష్టిస్తున్న శ్రామికులను బానిసలుగా మార్చేస్తున్న మోదీ ప్రభుత్వ విధానాల క్రమానికి కొనసాగింపే ఇది. నాలుగేళ్ల తరువాత ఇంటికొచ్చేసిన ఈ అగ్నివీరులు ఏం చేస్తారనేది ప్రశ్న. వీరికి మహా అయితే ఇంటర్మీడియట్‌ వరకే చదువు ఉంటుంది. ఆ చదువుతో ఒకవేళ ఏదైనా ఉపాధి దొరికినా పది వేలకు మించి జీతం ఉండే అవకాశమే లేదు.


ఒకేసారి 40 వేల నుంచి 10 వేల రూపాయలకు ఆదాయం పడిపోతే ఎలా? అందువల్ల వీరు తక్కువ జీతం వచ్చే ఉపాధిని ఎంచుకోలేరు. అయితే వీరికి యుద్ధ విద్యలలో కొద్దిగానైనా నైపుణ్యం వచ్చి ఉంటుంది. ఇక దానిని వాడుకోవడమే ఉపాధిగా ఎంచుకుంటే ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి? ఏవో ఉద్యోగాలిచ్చేస్తున్నట్లు భ్రమలు కల్పించడానికి మోదీ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. కార్మిక సంస్కరణల పేరుతో కాంట్రాక్టు ఉద్యోగాలు, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్‌ మెంటు, పెన్షన్‌, గ్రాట్యుటి వంటి పదవీ విరమణ సదుపాయాలు లేకుండా చేయడం రెండో లక్ష్యం. ఇప్పుడు నాలుగేళ్లతో ప్రారంభించి ఇవన్నీ ఎగ్గొట్టిన తరువాత రేపు పదేళ్ళు, తరువాత మొత్తానికే పాకుతుంది. అందువల్ల ఈ స్కీం ఏ రకంగా చూసినా క్షేమకరం కాదు సరికదా ప్రమాదకరం కూడా. దీనిలో ఉండే డొల్లతనాన్ని అర్థం చేసుకునే యువత ఆందోళనలకు దిగుతున్నది.


– ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.