అమెరికా చరిత్రలోనే ట్రంప్.. ఓ చెత్త ప్రెసిడెంట్: ఆర్నాల్డ్

ABN , First Publish Date - 2021-01-12T18:51:17+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ కేపిటల్ భవనంపై దాడి ఘటన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్ర విమర్శల పాలు చేస్తోంది.

అమెరికా చరిత్రలోనే ట్రంప్.. ఓ చెత్త ప్రెసిడెంట్: ఆర్నాల్డ్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ కేపిటల్ భవనంపై దాడి ఘటన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో గద్దె దిగబోతున్న ట్రంప్.. తన మద్దతుదారులతో కేపిటల్ భవనాన్ని ముట్టడింపజేయడం అనేది అమెరికా రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చలా మిగిలిపోనుంది. ఈ హింసాత్మక ఘటన ట్రంప్‌ను మరింత అభాసుపాలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ట్రంప్ చర్యపై వివిధ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించగా.. తాజాగా హాలీవుడ్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ కూడా తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ ఓ విఫల నేత అని, అమెరికా చరిత్రలోనే ఆయనో చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోతారని అన్నారు. కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి ఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆర్నాల్డ్.. ఆందోళనకారులను నాజీలతో పోల్చారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 




"అగ్రరాజ్యంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల గురించి తోటి అమెరికన్లకు, మిత్రులకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఆస్ట్రియాలో పుట్టిపెరిగాను. దీంతో అక్కడ 1938లో జరిగిన క్రిస్టాల్నాచ్ట్ లేదా 'నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్' గురించి నాకు బాగా తెలుసు. క్రిస్టాల్నాచ్ట్ సమయంలో జర్మనీలోని నాజీలు ఆస్ట్రియాలోని యూధుల ఇళ్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో యూధుల ఇళ్ల గ్లాసులను నాజీలు పగలగొడితే.. ఇప్పుడు ప్రౌడ్ బాయ్స్(కేపిటల్ భవనంపై దాడికి పాల్పడిన ట్రంప్ మద్దతుదారుల గ్రూపు పేరు) కేపిటల్ భవనం అద్దాలు బద్దలుగొట్టారు. కనుక వీరు కూడా నాజీలే.. బుధవారం చేసుకున్న ఘటన అమెరికా 'డే ఆఫ్ బ్రోకెన్ గ్లాస్'. తాజా ఘటనలో నిరసనకారులు పగలగొట్టింది కేవలం కేపిటల్ భవనం అద్దాలే కాదు.. కాంగ్రెస్ చట్టసభ్యుల ఆలోచనలతో పాటు ప్రజాస్వామ్య విలులను, విధానాలను ధ్వంసం చేశారు" అని ఆర్నాల్డ్ చెప్పుకొచ్చారు. 


అలాగే ట్రంప్‌పై కూడా ఆర్నాల్డ్ మండిపడ్డారు. ట్రంప్ విఫల నేత అని, అమెరికా చరిత్రలోనే ఆయన ఓ చెత్త ప్రెసిడెంట్‌గా మిగిలిపోతారని దుయ్యబట్టారు. అమెరికా రాజ్యాంగాన్ని తిరగరాయాలనుకునేవారు ఎప్పటికీ గెలవలేరని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు మద్దతు ఇవ్వాలని ఆర్నాల్డ్ పిలుపునిచ్చారు. కాగా, రిపబ్లికన్ పార్టీకే చెందిన ఆర్నాల్డ్ 2003లో కాలిఫోర్నియా గవర్నర్‌గా పని చేశారు.    

Updated Date - 2021-01-12T18:51:17+05:30 IST