ఆరోగ్యశ్రీ.. అవినీతి మయం!

Published: Wed, 01 Jun 2022 04:01:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆరోగ్యశ్రీ..  అవినీతి మయం!

ఆరోగ్యశ్రీ వ్యవస్థను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇటు ప్రజారోగ్య పరంగా సేవలు అందించడంతోపాటు, ఇటు రాజకీయంగా కూడా తమకు కలిసి వస్తుందని వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెబుతోంది. కానీ, ఈ పథకం అమల్లో మేడిపండును తలపిస్తోంది. పైకి అంతా బాగుందని ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ.. వాస్తవం చూస్తే ఆరోగ్యశ్రీలో అవినీతి కంపు తీవ్ర అనారోగ్యంగా మారింది!


ఆరోగ్య శ్రీ అమలు కోసం ప్రైవేటు ఆసుపత్రులతో చేసుకునే ఒప్పందాలను ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారులు అవినీతిమయం చేశారు. ఎక్కడికక్కడ రేటు పెట్టి మరీ రూ.కోట్ల కొద్దీ కాసులు కురిపించుకుంటున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా పట్టించుకునే నాథుడు కనిపించకపోవడం గమనార్హం.


ఎంవోయూల పేరుతో వసూళ్ల పర్వం

ప్రత్యేక రేట్లు పెట్టిన జిల్లాల కో-ఆర్డినేటర్లు

వంద పడకల ఆస్పత్రి నుంచి రూ.80 వేలు

50 పడకల ఆస్పత్రి నుంచి రూ.50 వేలు 

డాక్టర్లు, నర్సులు లేరంటూ భారీగా ముడుపులు

ట్రస్ట్‌కు ఫిర్యాదులొచ్చినా పట్టించుకోని వైనం


 (అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకమని చెబుతున్న ఆరోగ్య శ్రీ పథకం.. అవినీతి మయంగా మారింది. జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిధిలో 2,290 వరకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులున్నాయి. వీటిలో 874 వరకూ ప్రైవేటు ఆస్పత్రులే. ఏడాదికి ఒకసారి ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకోవాలి. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రక్రియ నడుస్తోంది. ఏడాదికి ఒకసారి ఎంవోయూ చేసుకుంటేనే ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలకు ట్రస్ట్‌ అనుమతిస్తుంది. అయితే.. ఈ ఏడాది ఎంవోయూ ప్రక్రియను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు అవినీతిమయం చేశారు. ఎంవోయూల పేరుతో ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ల అవినీతికి అంతు లేకుండాపోయింది. 100 పడకల ఆస్పత్రికి ఒక రేటు, 50 పడకల ఆస్పత్రికి ఒక రేటు, డెంటల్‌ ఆస్పత్రికి ఒక రేటు నిర్ణయించారు. ఎంవోయూ ప్రక్రియ సక్రమంగా పూర్తి కావాలంటే కో- ఆర్డినేటర్లు అడిగిన మొత్తాన్ని ఇవ్వాల్సిందేననే గుసుగుస వినిపిస్తోంది. లేదంటే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నిబంధనలు అమలులో లేవని అడ్డుపుల్లలు వేస్తున్నారట.


కో-ఆర్డినేటర్లకు కాసుల వర్షమే..

ఆరోగ్యశ్రీలోని ఓ కీలకమైన నిబంధన కో-ఆర్డినేటర్లకు కాసుల వర్షం కురిపించింది. నిబంధనల ప్రకారం 100 పడకల ఆస్పత్రిలో 16 మంది డ్యూటీ డాక్టర్లు, 36 మంది నర్సులు విధులు నిర్వహించాలి. 50 పడకల ఆస్పత్రిలో 8 మంది డ్యూటీ డాక్టర్లు, 18 మంది నర్సులను నియమించాలి. వీరందరినీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవల కోసం ఉపయోగించాలి. రాష్ట్రంలోని చాలా ఆస్పత్రుల్లో ఆ ప్రకారం డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు అందుబాటులో లేరు. సాధారణ రోజుల్లో జిల్లా కో-ఆర్డినేటర్లు చూసీచూడనట్లు వదిలేస్తారు. కానీ, ఎంవోయూ సమయంలో మాత్రం ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కో-ఆర్డినేటర్లు భారీగా దండుకున్నారని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు బహిరంగంగానే చెబుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రారంభమైన ఈ వ్యవహారం రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ప్రధాన కార్యాలయానికి ఈ విషయంపై సృష్టమైన సమాచారం ఉంది. నాలుగు జిల్లాల కో-ఆర్డినేటర్లపై అనేక ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ ట్రస్ట్‌ అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు. దీంతో కో-ఆర్డినేటర్ల అడగాలు మరింత పెరుగుతున్నాయి. 


డీఎంహెచ్‌వోలు కుమ్మక్కు!

కొన్ని జిల్లాల్లో కో-ఆర్డినేటర్లు, డీఎంహెచ్‌వోలు కుమ్మక్కై నెట్‌వర్క్‌ ఆస్పత్రులను పిండేస్తున్నారు. రాయలసీమలో ఈ తరహా వ్యవహారాలు ఎక్కువగా నడుస్తున్నాయని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అయినా.. స్పందించేవారు కరువవడం గమనార్హం.


ఇప్పటికీ 13 మంది జిల్లా కో-ఆర్డినేటర్లే..

ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించింది. దీనికి అనుగుణంగా అన్ని విభాగాలూ వారి ఉద్యోగులను విఽభజించాలని, కొత్త జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులను నియమించాలని సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ మాత్రం ఇప్పటి వరకు ఈ ప్రక్రియను ప్రారంభించలేదు.  కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు, పాత జిల్లాల కో-ఆర్డినేటర్లనే ఇన్‌చార్జులుగా నియమించింది. దీంతో కో-ఆర్డినేటర్లు పండగ చేసుకున్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్లుగా ప్రభుత్వ వైద్యులను నియమించడం పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసుకునే వైద్యులను కో-ఆర్డినేటర్లుగా నియమిస్తున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో పేద రోగులకు మేలు జరగడం లేదు. ఆ కో-ఆర్టినేటర్లకే ఎక్కువగా మేలు జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


ఏదో విధంగా వారు ప్రైవేటు ఆస్పత్రులకు అనుకూలంగా మారిపోతున్నారు. ఈ నిర్ణయంపై ట్రస్ట్‌ మరోసారి పునఃపరిశీలన చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నిర్లక్ష్యంతో జిల్లాల్లో కో-ఆర్డినేటర్ల వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిపోయింది. దీనిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం వచ్చే పరిస్థితి, ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలే చెబుతున్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.