గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-21T07:01:39+05:30 IST

జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీలో కదలిక వచ్చింది. జిల్లాలో ఎంపిక చేసి డీడీలు చెల్లించిన వారందరికీ వారంలోపు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులను, లబ్ధిదారులను కొనుగోలు కోసం పంపించారు. అక్కడ నుంచి గొర్రెల యూనిట్లు రాగానే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపిక చేసిన వారందరికీ విడతల వారీగా అందించేందుకు చర్యలు చేపట్టారు.

గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు

జిల్లాలో డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు మంజూరు

వారం రోజుల్లో యూనిట్లను అందించేందుకు అధికారుల ఏర్పాట్లు

ఏపీలోని అనంతపూర్‌ జిల్లాకు కొనుగోలు కోసం వెళ్లిన అధికారులు

త్వరలోనే లబ్ధిదారులకు విడతల వారీగా యూనిట్ల పంపిణీ

నిజామాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీలో కదలిక వచ్చింది. జిల్లాలో ఎంపిక చేసి డీడీలు చెల్లించిన వారందరికీ వారంలోపు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులను, లబ్ధిదారులను కొనుగోలు కోసం పంపించారు. అక్కడ నుంచి గొర్రెల యూనిట్లు రాగానే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపిక చేసిన వారందరికీ విడతల వారీగా అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం గొర్రెల పంపిణీకి అనుమతి ఇవ్వడంతో పాటు నిధులను మంజూరు చేయడంతో ప్రత్యేక బృందాల ద్వారా వీటిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని లబ్ధిదారులందరికీ అందించేందుకు సిద్ధమవుతున్నారు. 

డీడీలు చెల్లించిన వారందరికీ..

జిల్లాలో రెండో విడత కింద డీడీలు చెల్లించిన లబ్ధిదారులందరికీ అందించేందుకు పశుసంవర్ధకశాఖ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీకి అనుమతులు ఇవ్వడంతో.. ఎంపికచేసిన గొల్లకుర్మ లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో 2017-18సంవత్సరంలో మొదటి విడత కింద 8,522 మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్‌ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేల్‌ అందించారు. 2018-19 సంవత్సరం కింద 9475 మందిని లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 1218 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలు రావడంతో నిలిపివేశారు. వరుస ఎన్నికలు, ఇతర కారణాల వల్ల నిలిపివేసిన గొర్రెల పంపిణీ తిరిగి చేపట్టారు. రెండో విడత కింద ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో గొర్రెల ధరలుబాగా పెరగడంతో యూనిట్‌ ధరను కూడా లక్షా 25వేల నుంచి లక్షా 75 వేలకు పెంచారు.

రెండో విడతలో 1218 మందికి..

జిల్లాలో రెండో విడత కింద ఎంపిక చేసిన వారిలో 1218 మందికి పంపిణీ చేయగా మిగతా వారికి 2018-19 సంవత్సరంలో ఇవ్వలేదు. వీరిలో అప్పటి వరకు డీడీ చెల్లించిన వారిలో 1072 మంది ఉన్నారు. వీరందరికీ ఈవిడత కింద మొదట ఈ గొర్రెలను పంపిణీ చేసిన తర్వాత మిగతా వారికి విడతల వారిగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. గొర్రెల యూనిట్‌ కాస్ట్‌ పెంచినందున లబ్ధిదారుల డీడీల్లో కూడా 25శాతం కింద 42వేల 500 రూపాయలను తీసుకుని గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌ కింద 20 గొర్రెలు, ఒక పొట్టెల్‌ అందిస్తున్నారు. 

అనంతపూర్‌కు జిల్లా బృందం

జిల్లాకు చెందిన ఒక బృందం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లాకు వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో గొర్రెలను పరిశీలిస్తూ కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల్లో డీడీలు చెల్లించిన వారందరికీ ఈ యూనిట్లను అందించేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని యూనిట్లను గడిచిన ఆరు నెలల్లో అందించగా మిగలిన డీడీలు కట్టిన వారందరికీ అందించే ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో మిగిలిన లబ్ధిదారులు 7185 మందికి విడతల వారీగా అందించనున్నారు. ఆయా మండలాల పరిధిలో బడ్జెట్‌ అప్రూవల్‌ బట్టి ప్రభుత్వ అనుమతులు రాగానే డీడీలు తీసుకుని ఈ యూనిట్లను మంజూరు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు రెండో విడత కింద ఎంపికైన వారందరికీ యూనిట్లను అందించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలుకు అనంతపూర్‌లో గొర్రెలు దొరకకుంటే గుంటూర్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి అందించేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. గతంలో డీడీలు కట్టిన వారికి అనుమతులు ఇవ్వడంతో కొనుగోలు చేసి అందించేందుకు ఏర్పాట్లను చేశామని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ భరత్‌, ఏడీ డాక్టర్‌ బాలిక్‌అహ్మద్‌లు తెలిపారు. వారం రోజుల్లోపు కొంతమంది లబ్ధిదారులకు కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్లను అందిస్తామని వారు తెలిపారు. జిల్లా నుంచి ఒక టీంతో పాటు రాష్ట్రస్థాయి మరో టీం అనంతపూర్‌లో పర్యటిస్తున్నారని అక్కడ కొనుగోలు చేస్తున్నారని అక్కడ నుంచి జిల్లాకు గొర్రెలు రాగానే పంపిణీ చేపడతామని వారు తెలిపారు. విడతల వారీగా లబ్ధిదారులందరికీ  గొర్రెల యూనిట్లు అందించే ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. 

Updated Date - 2022-05-21T07:01:39+05:30 IST