సీఎం రాకకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-06-20T05:45:32+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం కామారెడ్డికి రానుండడంతో జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులతో భారీ ఏర్పాట్లను పూర్తి చేశారు.

సీఎం రాకకు ఏర్పాట్లు పూర్తి
కలెక్టరేట్‌ను పూలతో అలంకరించిన దృశ్యం

కామారెడ్డి, జూన్‌ 19: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం కామారెడ్డికి రానుండడంతో జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులతో భారీ ఏర్పాట్లను పూర్తి చేశారు. నూతన కలెక్టరేట్‌ భవనంతో పాటు ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి చేతు ల మీదుగా ప్రారంభించనుండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టర్‌ శరత్‌తో పాటు ఉన్నతాధికారులు, ఉమ్మడి జిల్లా పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఏర్పాట్లను పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో స్వాగత ఏర్పా ట్లను పూర్తి చేశారు. 1500 మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలతో పాటు సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించనున్నారు. అడ్లూర్‌ రోడ్డులో వాహనాలను పార్కింగ్‌ చేయడానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహమూద్‌ అలీ, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ దామోదర్‌లు వస్తుండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించి పోలీసు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భిక్కనూర్‌ మండలం జంగంపల్లి వద్ద అత్యాధునిక హంగులతో నిర్మించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభు త్వ విప్‌ గంప గోవర్ధన్‌ జంగంపల్లి వద్ద తిష్ట వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాత్రి వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు భోజన ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. రూట్‌మ్యాప్‌ వచ్చిన తర్వాత కంటే ముందుగానే సిద్ధమయ్యారు.
కలెక్టరేట్‌ భవనం పువ్వులతో అందంగా ముస్తాబు
కలెక్టరేట్‌ భవనం రంగురంగుల విద్యుత్‌ దీపాలతో పాటు పూలతో అందంగా ముస్తా బు చేశారు. కలెక్టరేట్‌లోని ప్రతీ కార్యాలయాన్ని పూలతో అలంకరించారు. 60 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయడంతో పాటు అన్ని హంగులతో తీర్చిదిద్దారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ముఖ్యమంత్రి చేత ప్రశంసలు పొందేందుకు కలెక్టర్‌ శరత్‌తో పాటు, జిల్లా అధికారులు గత వారం రోజులుగా కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Updated Date - 2021-06-20T05:45:32+05:30 IST