ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2021-03-07T04:16:22+05:30 IST

ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే భౌరాపూర్‌ జాతరకు కావల్సిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ లైన్‌డిపార్ట్‌మెంట్‌ అధికారులను ఆదేశించారు.

ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

భౌరాపూర్‌ జాతరపై అధికారులతో సమీక్ష

నాగర్‌కర్నూల్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే భౌరాపూర్‌ జాతరకు కావల్సిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ లైన్‌డిపార్ట్‌మెంట్‌ అధికారులను ఆదేశించారు. మార్చి 11న లింగాల మండలం భౌరాపూర్‌ మల్లికార్జునస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచుల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి వాటిని కాపాడడానికి ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి చెంచులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తూ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేపట్టాలన్నారు. భక్తులకు ఉచిత భోజనాలు కల్పించాలని ఐటీడీఏ అధికారి అశోక్‌ను ఆదేశించారు. తాగునీరుకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. జాతరలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్‌ పారవేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక వాహనాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, బారికేడింగ్‌, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, ట్రైనీ కలెక్టర్‌ చిత్రమిశ్రా, ఐటీడీఏ అధికారి అశోక్‌, అటవీశాఖ అధికారి కిష్టగౌడ్‌, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌, అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-07T04:16:22+05:30 IST