బాలికను ట్రాప్‌ చేసిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2021-07-22T06:35:45+05:30 IST

బాలికను ట్రాప్‌ చేసిన వ్యక్తి అరెస్టు

బాలికను ట్రాప్‌ చేసిన వ్యక్తి అరెస్టు
నిందితుడి అరెస్టును చూపుతున్న ఏసీపీ

ప్రేమ పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయం

వివరాలు వెల్లడించిన మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌

పర్వతగిరి, జూలై 21: ఫేస్‌బుక్‌లో ఓ బాలికను ట్రాప్‌ చేసిన పైడి రాజశేఖర్‌ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌ తెలిపారు. పర్వతగిరిలోని పోలీస్‌ స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి బాలికకు ఆన్‌లైన్‌ తరగతుల కోసం తండ్రి సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ క్రియేటివ్‌ చేసుకున్న బాలిక మిత్రులతో చాటింగ్‌ చేసేది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన పైడి రాజశేఖర్‌(28) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పటంతో నమ్మిన బాలిక ఇంట్లో నుంచి ఈ నెల 7న తిరుపతికి వెళ్లిపోయింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో 8న ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు బాలిక ఆచూకీ తెలియక పోవడంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 16న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనను మరింత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరంగా చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడి భద్రాచలం ఏరియాకు చెందిన ఒకరిని, ఆజంనగర్‌కు చెందిన మరో అబ్బాయిని విచారించారు. వారి ప్రమేయం లేదని తేలడంతో వదిలివేశారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి బాలిక తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. బాలికతో పాటు రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ నరేష్‌కుమార్‌ వివరించారు. బాలికను చైల్డ్‌హోమ్‌కు పంపినట్లు తెలిపారు. సెల్‌ఫోన్‌ మాయలో పడి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని ఏసీపీ సూచించారు. కేసు విచారణలో క్రియాశీలకంగా పాల్గొన్న పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్‌, ఎస్సై నవీన్‌కుమార్‌లను ఏసీపీ అభినందించారు.

Updated Date - 2021-07-22T06:35:45+05:30 IST