Aam Aadmi Party : నన్ను అరెస్ట్ చేయాలి, లేదంటే మోదీ క్షమాపణ చెప్పాలి : మనీశ్ సిసోడియా

ABN , First Publish Date - 2022-09-16T00:56:03+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి

Aam Aadmi Party : నన్ను అరెస్ట్ చేయాలి, లేదంటే మోదీ క్షమాపణ చెప్పాలి : మనీశ్ సిసోడియా

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) గట్టి సవాల్ విసిరారు. తనను ఈ నెల 19 సోమవారం నాటికి అరెస్ట్ చేయాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) స్పందిస్తూ కేవలం ధైర్యవంతులు మాత్రమే ఇలాంటి సవాల్ విసరగలరని ప్రశంసించారు. 


సిసోడియా గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, తన నివాసంలో సీబీఐ సోదాలు చేసిందని, దానికి ఏమీ దొరకలేదని చెప్పారు. బ్యాంకు లాకర్లో వెతికినా ఏమీ దొరకలేదన్నారు. సీబీఐ, ఈడీ రెండూ కలిసి దర్యాప్తు చేసినా దొరికిందేమీ లేదన్నారు. ఇక బీజేపీ ఓ స్టింగ్ ఆపరేషన్ చేశామంటూ ముందుకొచ్చిందన్నారు. ఈ స్టింగ్‌పై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలన్నారు. ఆ ఆరోపణలు నిజమైతే తనను సోమవారం నాటికి అరెస్టు చేయాలన్నారు. లేనిపక్షంలో ఇలాంటి తప్పుడు స్టింగ్ ఆపరేషన్ చేసినందుకు సోమవారంనాటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు క్షమాపణ చెప్పాలన్నారు. 


దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందిస్తూ, కేవలం ధైర్యవంతులు మాత్రమే ఇలాంటి సవాల్ విసరగలరన్నారు. బీజేపీ ఈ సవాలును స్వీకరిస్తుందన్నారు. సిసోడియా కృషి, నిజాయితీ గర్వకారణమని యావత్తు దేశం భావిస్తోందన్నారు. సిసోడియా విద్యా రంగానికి చేసిన సేవలను చూసి బీజేపీ భయపడుతోందని, దానిని ఆపాలని కోరుకుంటోందని అన్నారు. ‘‘అయినప్పటికీ మీ పని మీరు చేయండి’’ అని సిసోడియాను ప్రోత్సహించారు. 


ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిసోడియా సహా దాదాపు 15 మంది నిందితులు ఉన్నారు. అయితే ఈ ఆరోపణలను కేజ్రీవాల్, సిసోడియా ఖండించారు. 


ఇదిలావుండగా, బీజేపీ గురువారం ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో అవినీతి జరిగినట్లు ఓ లిక్కర్ ట్రేడర్ చెప్తున్నట్లు ఈ వీడియోలో ఉందని తెలిపింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా మాట్లాడుతూ, ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని బయటపెట్టారన్నారు. దీనిని తివాచీ క్రింద కప్పిపుచ్చడం సాధ్యం కాదన్నారు. 


బీజేపీ నేత సుధాంశు త్రివేదీ మాట్లాడుతూ, రాజకీయాల్లో మార్పు తెస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు తనంతట తానే బయటపడిందన్నారు. గతంలో బయటపడిన స్టింగ్ ఆపరేషన్‌పై కేజ్రీవాల్ ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కంపెనీలు ఏ విధంగా డబ్బులు చెల్లించినదీ తాజా స్టింగ్ వీడియోలో బయటపడిందన్నారు. 


Updated Date - 2022-09-16T00:56:03+05:30 IST