మహా సందడి

ABN , First Publish Date - 2022-07-03T16:56:55+05:30 IST

ఇప్పుడు ఏ ఎన్నికలూ లేవు. సమీప కాలంలోనూ జరిగే అవకాశం లేదు. అయినా మహా నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా

మహా సందడి

 నగరానికి అగ్ర నేతల రాక

 పోటాపోటీగా ఏర్పాట్లు

 ఫ్లెక్సీల నుంచి సమావేశాల నిర్వహణ వరకు..

 హెచ్‌ఐసీసీ వద్ద కోలాహలం.. భారీ భద్రత


హైదరాబాద్‌ సిటీ: ఇప్పుడు ఏ ఎన్నికలూ లేవు. సమీప కాలంలోనూ జరిగే అవకాశం లేదు. అయినా మహా నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. కాలనీ, బస్తీ అన్న తేడా లేకుండా అంతటా రాజకీయ కళే. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుగా టీఆర్‌ ఎస్‌ ర్యాలీలు, సమావేశం నేపథ్యంలో అంతటా ఉత్కంఠ ఏర్పడింది. వేర్వేరు పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలు, కటౌట్లతో నగరం కొత్తగా కనిపించింది. శనివారం అగ్రనేతల రాకకు వేదికైంది. ఉదయం యశ్వంత్‌సిన్హా.. మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి సమావేశాల నిర్వహణ వరకు తగ్గేదిలే.. అన్నట్టుగా ఇరు పార్టీలు వ్యవహరిస్తుండడంతో సమావేశాల నిర్వహణపై మరింత ఆసక్తి పెరిగింది. యశ్వంత్‌సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది.


బీజేపీ సమావేశాల నేపథ్యంలో హెచ్‌ఐసీసీ వద్ద సందడి నెలకొంది.  మోదీ సహా పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అగ్రనేతల రాకతో హెచ్‌ఐసీసీ వద్ద పండుగ వాతావరణం కనిపించింది. కీలక వ్యక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెచ్‌ఐసీసీ చుట్టూ దాదాపు అర కిలోమీటర్‌ మేర పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీల పోరు  కొనసాగింది.  నెక్లెస్‌రోడ్‌ చౌరస్తాలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌, బీజేపీ ఏర్పాటు చేసిన తోరణాలను కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. 


ట్రాఫిక్‌ ఇక్కట్లు

రెండు ప్రధాన పార్టీల కార్యక్రమాలు.. అగ్రనేతల రాక నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల వాహనాల హడావిడితో నగరం హోరెత్తింది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి. రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు హైదరాబాద్‌ వేదిక కావడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. చాలా చోట్ల అధికారులు ట్రాఫిక్‌ దారిమళ్లించారు.

Updated Date - 2022-07-03T16:56:55+05:30 IST