అహంకార ఎమ్మెల్యే సైదిరెడ్డి

ABN , First Publish Date - 2022-07-07T05:28:51+05:30 IST

హుజూర్‌నగర్‌ నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యే సైదిరెడ్డి వంటి అహంకారపూరిత ఎమ్మెల్యేను ఎన్నడూ చూడలేదని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

అహంకార ఎమ్మెల్యే సైదిరెడ్డి
కల్మలచెర్వు గ్రామసభలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

 వైఎస్సాఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల

హుజూర్‌నగర్‌  రూరల్‌ /  మఠంపల్లి / గరిడేపల్లి, జూలై 6: హుజూర్‌నగర్‌ నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యే సైదిరెడ్డి వంటి అహంకారపూరిత ఎమ్మెల్యేను ఎన్నడూ చూడలేదని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. భూకబ్జాలు, అక్రమాలు, ధనార్జనే ధ్యేయ ంగా పాలిస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి గూండాయిజం పరాకాష్టకు చేరిందన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 116వ రోజైన బుధవారం హుజూర్‌నగర్‌, మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లో 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. హుజూర్‌నగర్‌ మండలం శ్రీనివాసపురం క్యాంపు నుంచి ప్రారంభమైన పాదయాత్ర అమరవరం మీదుగా మఠంపల్లి మండలం హనుమంతులగూడెం నుంచి గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చేరుకోగా అక్కడే మాటముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపూరి సోమన్నపై దాడికి చేసిన వారంత ఎమ్మెల్యే సొంత మండలమైన మఠంపల్లి మండలానికి చెందిన వారేనని అన్నారు. అందులో ఆయన బంధువులు సైతం ఉన్నారని ఆరోపించారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ పార్టీకి రక్షణదళలుగా పనిచేస్తున్నారని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షకుల పాత్ర వహించడం విడ్డూరమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోలీసులను కూలీలుగా వాడుకుంటుందని అన్నారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి పోలీసులను అడ్డంపెట్టుకుని పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నా రని అన్నారు. హామీలు నెరవేర్చని కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌ కేబీనెట్‌లో అవినీతిపరులే ఎక్కువగా ఉన్నారన్నారు.ఆమె వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు జల్లేపల్లి వెంకటేశ్వర్లు, సుతారి శ్రీనివాసరావు, కామిశెట్టి రవి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, పిట్ట రామిరెడ్డి, నీలం రమేష్‌, చైతన్యరెడ్డి, శాంతకుమార్‌, రాధారెడ్డి పాల్గొన్నారు 

మూడు రోజుల విరామం

ప్రజాప్రస్థానం పాదయాత్రకు మూడురోజులు విరామం ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లా ఇడుపులపాయలో జరిగే కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7,8, 9 తేదీల్లో పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. తిరిగి 10వతేదీన గరిడేపల్లి మండలం కల్మలచెర్వు నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. 



Updated Date - 2022-07-07T05:28:51+05:30 IST