సేవా శిఖరం..

May 8 2021 @ 00:32AM

చెన్నైలో గురువారం గుత్తా మునిరత్నం కన్నుమూయడంతో తెలుగు నాట ఒక సేవా శిఖరం నేలకొరిగింది. భారతదేశంలో ఒక అత్యున్నత సేవా సంస్థగా రాష్ర్టీయ సేవా సమితిని ఆయన తీర్చిదిద్దారు. 1981లో రాయలసీమ సేవా సమితిని పార్లమెంటు సభ్యులు పి. రాజగోపాలనాయుడు అధ్యక్షతన ప్రారంభించి తదనంతర కాలంలో రాష్ర్టీయ సేవా సమితిగా మార్పు చేసి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒరిస్సా, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలకు తమ సంస్థ సేవలను విస్తరించారు. బాలల సంక్షేమం కోసం బాల వికాస కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, అనియత విద్యా కేంద్రాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, మహిళాభివృద్ధి, పశుగణాభివృద్ధి కోసం వీరు చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గుర్తించబడ్డాయి. భారత ప్రభుత్వ ‘పద్మశ్రీ’ పురస్కారం, ‘జమనలాల్‌ బజాజ్‌’ అవార్డు, ‘రాజీవ్‌ మానవ సేవ’ అవార్డులతో పాటు రాష్ర్టీయ సేవా సమితి తరఫున భారత ప్రభుత్వ జాతీయ అవార్డులు నాలుగుసార్లు అందుకున్నారు.


50 లక్షలకు పైగా పేద కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా సహాయపడిన మునిరత్నం సలహాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేవి. ప్రణాళిక సంఘంలోని ప్రజ్ఞావంతుల మండలిలో ఆయన సభ్యులుగా వ్యవహరించారు. రాష్ట్రీయ మహిళా కోష్‌, సాక్షర భారత్‌లకు వారు సలహాలందించేవారు. అఖిల భారత రచనాత్మక సంఘంలో నిర్మలా దేశ పాండేతో కలిసి పని చేశారు. గాంధేయ నిర్మాణ కార్యకర్తగా దేశవ్యాప్త గుర్తింపు పొందారు. 1936లో తిరుత్తణిలోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన మునిరత్నం తన 14వ ఏట బాలానంద సంఘాల స్థాపన ద్వారా సేవా రంగంలో అడుగు పెట్టారు. 1976లో అప్పటి విద్యాశాఖ మంత్రి, మా నాన్నగారు మండలి వెంకట కృష్ణారావు అధ్యక్షతన ‘ఆంధ్రప్రదేశ బాలల అకాడెమీ’ ఏర్పడినప్పుడు మునిరత్నంని పాలక మండలి సభ్యులుగా నియమించారు. అప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయమేర్పడింది. వారిది నిర్మల మనస్తత్వం. 1977 దివిసీమ ఉప్పెన- సమయంలో వారు ఎన్నో సేవలందించారు. తిరుపతి వెళ్లినప్పుడల్లా ‘రాస్‌’ సంస్థ కార్యక్రమాలను చూసి ఉత్తేజితుడనవుతూ ఉండేవాడిని. అనేక రాష్ట్రాలలో స్వచ్చంద సేవా సంస్థలను చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంత పెద్ద సేవా సంస్థలు ఎప్పుడు రూపు దాలుస్తాయని అనుకునేవాడిని. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా భారతదేశంలోనే అత్యున్నత సేవా సంస్థను స్థాపించి, పెంపొందించిన ధన్యజీవి మునిరత్నం.  


-డా. మండలి బుద్ధప్రసాద్‌

మాజీ ఉపసభాపతి

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.