మాజీ మావోయిస్టు సోదరికి కృత్రిమ కాలు అందజేత

ABN , First Publish Date - 2020-12-04T03:52:58+05:30 IST

మాజీ మావోయిస్టు ఆత్రం శోభన్‌ అలియాస్‌ చార్లెస్‌ సోదరి కోవ లక్ష్మికి గోదావరిఖనికి చెందిన ఆలయ ఫౌండేషన్‌ సహకారంతో తిర్యాణి పోలీసులు జైపూర్‌ కృత్రిమ కాలును ఏర్పాటు చేయించారు.

మాజీ  మావోయిస్టు సోదరికి కృత్రిమ కాలు అందజేత
శోభన్‌ సోదరి లక్ష్మికి కృత్రిమ కాలును ఏర్పాటు చేయిస్తున్న పోలీసులు

తిర్యాణి, డిసెంబరు3: మాజీ మావోయిస్టు ఆత్రం శోభన్‌ అలియాస్‌ చార్లెస్‌ సోదరి కోవ లక్ష్మికి గోదావరిఖనికి చెందిన ఆలయ ఫౌండేషన్‌ సహకారంతో తిర్యాణి పోలీసులు జైపూర్‌ కృత్రిమ కాలును ఏర్పాటు చేయించారు. గురువారం ఎస్పీ పోలీసు కార్యాలయంలో ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ, కోవలక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గత నెల 10వ తేదీన వారి కుటుంబ సభ్యులకు రొంపల్లిలో దీపావళి సందర్భంగా తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను అందజేశారు. ఈసందర్భంగా రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన ఆమెకు త్వరలోనే కృత్రిమ కాళు అందించే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈమేరకు తిర్యాణి ఎస్సై రామారావు ఆలయ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు నరహరిని సంప్ర దించి వారి సహకారంతో జైపూర్‌ కాలును ఆమెకు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ప్రత్యేక చొరవతో ఆదివాసులకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు తిర్యాణి ఎస్సై రామారావును, ముందుకు వచ్చిన ఆలయ ఫౌండేషన్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు, రెబ్బెన సీఐ సతీష్‌కుమార్‌, తిర్యాణి ఎస్సై రామారావు, ఆలయ ఫౌండేషన్‌ సభ్యులు కీర్తి నాగార్జున, జగిరి శ్రీకాంత్‌, గుడికందుల రమేష్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T03:52:58+05:30 IST