viral video: అతడి రిక్వస్ట్‌తో వెనక్కొచ్చి.. వాయిస్‌తో అదరగొట్టిన ఇండియన్
ABN , First Publish Date - 2021-10-03T03:59:21+05:30 IST
చిన్న పాట పాడి ఇరగదీసిన ఇండియన్..తెగ వైరల్ అవుతున్న వీడియో
ఇంటర్నెట్ డెస్క్: రెజినాల్డ్ గియమ్.. ప్రముఖ యూట్యూబర్. సంగీతం అంటే ఆసక్తి ఉన్న వారందరూ ఈ పేరును ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. రెజినాల్డ్(రెజీ) వీధుల్లో నిలబడి గిటార్ వాయిస్తూ..దారిన పోయే వారిని తన పక్కన నిలబడి పాడమని అడుగుతాడు. సంగీతం అంటే ఇష్టమున్నవారు అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతుంటారు. అలా తాను గిటార్ వాయిస్తుండగా అవతలి వారు పాడుతుంటే రికార్డు చేసిన వీడియోలను గియమ్ తన యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేస్తుంటాడు. ఈ తరహా కంటెంట్‌కు లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల రెజినాల్డ్ ఇటువంటి వీడియోనే ఒకటి రికార్డు చేస్తుండగా అతడికి ఓ ప్రవాసీ భారతీయుడు తారసపడ్డాడు. అతడి పేరు గొరాంగ్. తన పక్కన నిలబడి పాడమని గొరాంగ్ను అడగ్గా నాకు ఇంగ్లీషు పాటలు రావంటూ అతడు ముందుకెళ్లిపోయాడు.
ఆ తరువాత.. మళ్లీ వెనకొచ్చి నాకు హిందీ పాటలు మాత్రమే వచ్చని రెజినాల్డ్తో చెప్పాడు. ఇది చాలు.. పర్ఫెక్ట్ అని రెజీ రిప్లై ఇవ్వడంతో గొరాంగ్ ఒక్కసారిగా షాకైపోయాడు. ఆ తరువాత..తనకు ఇష్టమైన పాటను గోరాంగ్ రెజీకి వినిపించాడు. ఒక్క క్షణంలో ఆ పాట ట్యూన్‌ను ఒంటపట్టించుకున్న రెజీ ఆ తరువాత.. పాట ట్యూన్‌కు గిటార్ వాయిస్తుండగా గోరాంగ్ పాట పాడాడు. ఇక్కడే ఉన్నట్టుంది ఓ అద్భుతం జరిగింది. ఏదో సాధారణంగా పాడతాడులే అనుకుంటున్న తరుణంలో ప్రొఫెషనల్ సింగర్‌లా ఆలపించాడు గొరాంగ్. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్యర్యపోతారు. అన్నట్టు.. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ యమా వైరల్ అయిపోతోంది. ఇప్పటివరకూ దాదాపు 20 లక్షల మంది ఈ వీడియోను చూసి రెజినాల్డ్ను , గోరాంగ్పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.