Jayalalithaa death: అర్ముగస్వామి నివేదికపై చర్చించనున్న తమిళనాడు కేబినెట్

ABN , First Publish Date - 2022-08-28T00:22:59+05:30 IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ ఎ. అర్ముగస్వామి కమిషన్

Jayalalithaa death: అర్ముగస్వామి నివేదికపై చర్చించనున్న తమిళనాడు కేబినెట్

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత (J.jayalalithaa) మృతిపై విచారణ జరిపిన జస్టిస్ ఎ. అర్ముగస్వామి కమిషన్ (Arumugasamy Commission) తుది నివేదికను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (Stalin)కు అందజేసింది. మూడు వాల్యూములలో ఈ నివేదికను అందించింది. ఇంగ్లిష్‌లో 500 పేజీలు, తమిళంలో 608 పేజీలు ఉంది. ఈ నెల 29న జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై చర్చించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అర్ముగస్వామి ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందించిన కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ఎస్.రఘుపతి, చీఫ్ సెక్రటరీ వి.ఇరై అన్బు కూడా ఉన్నారు. 


అప్పటి డీఎంకే ప్రభుత్వం అర్ముగస్వామి కమిషన్‌ను 25 సెప్టెంబరు 2017లో ఏర్పాటు చేసింది. కమిషన్ కాలపరిమితి ఈ నెల 24తో ముగిసింది. అంతకుముందు పలుమార్లు ప్రభుత్వం ఈ కమిషన్ కాలపరిమితిని పొడిగించింది. విచారణ కోసం గత ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించిందని అర్ముగస్వామి తెలిపారు. అలాగే, ఎలాంటి జోక్యం కూడా చేసుకోలేదని పేర్కొన్నారు. తానైతే రిపోర్టును అందజేశానని, దానిని విడుదల చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. 


13 నెలల్లోనే విచారణ పూర్తచేశామన్న కమిషన్.. మొత్తం 149 మంది సాక్షులను విచారించింది. విచారణలో జాప్యం జరిగిందన్న ఆరోపణలు కొట్టిపడేసిన జస్టిస్ అర్ముగస్వామి.. విచారణలో అపోలో ఆసుపత్రితోపాటు జయలలిత నెచ్చెలి వీకే శశికళ కూడా పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. విచారణ సమయంలో జయలలిత నివాసాన్ని ఎందుకకు సందర్శించలేదన్న విమర్శలపై అర్ముగస్వామి స్పందిస్తూ.. జయను ఆసుపత్రికి తరలించే సమయంలో అనామానాస్పదంగా ఏదీ లేదని స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం, అలవాట్లు, తన ఆరోగ్యం ఆమె తీసుకునే శ్రద్ధ, ఆమె బాగోగులు ఎవరు చూసుకునేవారు వంటివాటిపైనా దర్యాప్తు చేసినట్టు చెప్పారు. 




Updated Date - 2022-08-28T00:22:59+05:30 IST