కీలక దశకు చేరుకున్న సెలా టన్నెల్ ప్రాజెక్టు: రక్షణ శాఖ

ABN , First Publish Date - 2022-01-23T17:34:14+05:30 IST

చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వెస్ట్ కమింగ్ జిల్లాలో..

కీలక దశకు చేరుకున్న సెలా టన్నెల్ ప్రాజెక్టు: రక్షణ శాఖ

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వెస్ట్ కమింగ్ జిల్లాలో బోర్డర్ రోడ్స్ ఆర్గనేజేషన్ (బీఆర్ఓ) చేపట్టిన సెలా టన్నెల్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. తవ్వకం పని శనివారంతో పూర్తయింది. 980 మీటర్ల పొడవైన సొరంగం (టన్నెల్-1) కోసం బీఆర్ఓ డైరెక్టర్ జనరల్..లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి చివరి పేలుడును న్యూఢిల్లీ నుంచి నిర్వహించారు. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం మధ్య ఈ అరుదైన ఫీట్ సాధించినట్టు ఆయన చెప్పారు. తవాంగ్‌కు అనుసంధానించే ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే  ఇదొక లైఫ్‌లైన్ అవుతుందని అన్నారు. 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన పొడవైన సొరంగాలలో ఇది కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ లో బిసిటి రోడ్ నుండి బయలుదేరే టన్నెల్ 1కి ఏడు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు, టన్నెల్ 1 నుండి టన్నెల్ 2ని కలిపే 1.3 కిలోమీటర్ల లింక్ రోడ్డు నిర్మాణం కూడా ఉంది. సెలా టన్నెల్ ప్రాజెక్టులో టన్నెల్-1తో పాటు 1,555 మీటర్ల టన్నెల్-2 కూడా ఉంది.


సెలా టన్నెల్ ప్రాజెక్టును రూ.700 కోట్లతో చేపడుతున్నట్టు 2018లో ప్రభుత్వం ప్రకటించింది.  ప్రధాని నరేంద్ర మోదీ 2019లో ఈ టన్నెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది జనవరి 15న తొలి పేలుడు జరిపి టన్నెల్-1 తవ్వకాలు ప్రారంభించారు. గత అక్టోబర్ 14న టన్నెల్-2కు సంబంధించిన పేలుడును ఇండియా గేట్ నుంచి వర్చువల్‌గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వహించారు. కాగా, 2022 జూన్ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-01-23T17:34:14+05:30 IST