
మనసులు ఒక్కటైన క్షణంతో మొదలు జంటగా వేసే ప్రతి అడుగూ మధుర జ్ఞాపకంలా ఉండాలి. మీ ప్రేమ బంధం విరజాజుల పరిమళంలా ఎప్పటికీ తాజాగా ఉండాలంటే ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ, నమ్మకం ఉండాలి. మీ అనుబంధం సంతోషాల నెలవుగా, ప్రేమకు చిహ్నంగా నిలిచేందుకు ఏం చేయాలో చెబుతున్నారు లవ్‌గురూలు. అవేమిటంటే...
నెగటివ్‌గా మాట్లాడవద్దు: మీ భాగస్వామి గురించి ఎప్పుడు కూడా తక్కువగా, తప్పుగా మాట్లాడకూడదు. కొత్తగా మొదలైన మీ ప్రయాణంలో అలకలు, కోపతాపాలు రావడం సహజమే. అంతమాత్రాన ఒకరి మీద ఒకరు లేనిపోనివి కల్పించి ఇతరులతో చెప్పవద్దు.
పోలిక వద్దు: ఎవరితోనూ పోల్చుకోవద్దు. మీ బంధాన్ని సంతోషాల చెట్టుగా మలచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అన్యోన్యత, అనురాగం అనేవి ఇద్దరి మధ్య ఉండే అవగాహన, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొనే గౌరవం మీద ఆధారపడి ఉంటాయనే విషయం తెలుసుకోవాలి.
నవ్వుతూ నవ్విస్తూ: మీ తోడుతో సమయం కుదిరినప్పుడల్లా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా గడపడం మీ అనుబంధాన్ని దృఢంగా చేస్తుంది. దాంతో మీ అనుబంధంలో అరమరికలు, మనస్ఫర్థలకు చోటుండదు.
బాధపెట్టే మాటలొద్దు: ఏదైనా పొరపాటు జరగితే వెంటనే కోపం తెచ్చుకొని వారు బాధ పడేలా మాట్లాడవద్దు. అలా చేయడం వల్ల పరిస్థితి మరింత చేయిదాటిపోతుందనే విషయం గమనించాలి. విమర్శను కూడా సానుకూలంగా తీసుకోవాలి తప్ప ఎదుటివారి మనసును ముక్కలు చేసేలా మాట్లాడకూడదు.
వెన్ను తట్టే ధైర్యంగా: ఇద్దరూ ఒకరి ఇష్టాలు, అలవాట్లను ప్రోత్సహించుకోవాలి. మీ భాగస్వామి లక్ష్యాలను తెలుసుకొని ఆ దిశగా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించాలి. వారి భవిష్యత్తు కలలకు మీ వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
సరదా కబుర్లు: స్మార్ట్‌ఫోన్‌లో సందేశాలతో సరిపుచ్చవద్దు. వీలు కుదిరినప్పుడల్లా మీ అడుగుల జతతో సరదాగా కబుర్లు చెబుతూ కొంత సమయం గడపాలి. ఇలాచేస్తే మీ ఇద్దరి మధ్య ఆకర్షణ, ప్రేమ రోజు రోజుకు పెరుగుతుంది. బలమైన అనుబంధానికి ఇదొక మెట్టని ఇద్దరూ గ్రహించాలి.