దేశభక్తి గీతంతో మోదీని సమ్మోహన పరిచిన భారత సంతతి బాలుడు

ABN , First Publish Date - 2022-05-02T20:30:13+05:30 IST

మూడు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీలో..

దేశభక్తి గీతంతో మోదీని సమ్మోహన పరిచిన భారత సంతతి బాలుడు

బెర్లిన్: మూడు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత జర్మనీలో కాలు పెట్టగానే ఆయనకు ఇండియన్ కమ్యూనిటీ నుంచి సాదర స్వాగతం లభించింది. బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం మోదీ చేరుకున్నారు. అనంతరం ఆయన హోటల్ అడ్లోన్ కెంపిన్‌స్కీ చేరుకున్నారు. ఈ సందర్భగా భారత సంతతి ప్రజలతో ఆయన కొద్దిసేపు ఉల్లాసంగా గడిపారు. 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' నినాదాలు హోరెత్తాయి. తమ తల్లిదండ్రులతో పాటు వచ్చిన చిన్నారులను మోదీ ఆప్యాయంగా పలకరించారు.


మోదీ చిత్తరువును ఒక చిన్నారి ఆయనకు బహుకరించగా, చిత్రలేఖనానికి ఎంత సమయం పట్టిందని మోదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలికతో ఫోటో దిగారు. ఆ చిత్తరువుపై మోదీ సంతకం చేసి తిరిగి ఆమెకు అందజేశారు. అనంతరం భారత సంతతి బాలుడొకరు దేశభక్తి గీతంతో మోదీకి అభివాదాలు తెలియజేశాడు. ఆ గీతం పాడుతున్నంత సేపు మోదీ ఆసక్తిగా వింటూ పాటకు తగినట్టుగా చిటికెలు వేస్తూ, గీతాలాపన పూర్తి కాగానే బాలుడి బుగ్గలు నిమిరి, ఆప్యాయంగా తలను తడిమారు. పలువురు చేతులు ఊపుతూ మోదీకి అభివాదాలు తెలియజేయగా, మరికొందరు మోదీ పాదాలకు నమస్కరిస్తూ ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

Updated Date - 2022-05-02T20:30:13+05:30 IST