జహంగిర్‌పురి హింసపై పోలీసుల దర్యాప్తు ఏకపక్షం: ఒవైసీ

ABN , First Publish Date - 2022-04-19T01:30:48+05:30 IST

వాయవ్య ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో శనివారంనాడు చెలరేగిన మత హింసపై పోలీసులు ఏకపక్ష దర్యాప్తు ..

జహంగిర్‌పురి హింసపై పోలీసుల దర్యాప్తు ఏకపక్షం: ఒవైసీ

న్యూఢిల్లీ: వాయవ్య ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో శనివారంనాడు చెలరేగిన మత హింసపై పోలీసులు ఏకపక్ష దర్యాప్తు జరుపుతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, దర్యాప్తు తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. మసీదుపై కాషాయం జెండా ఎగరవేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హింసకు ప్రభుత్వానిదే బాధ్యతనీ, జహంగీర్‌పురి సీ బ్లాక్‌లో మతపరమైన ఊరేగింపులో పాల్గొన్నవారు ఆయుధాలు ఝలిపించడంపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.


''హింసను మేము ఖండిస్తున్నాం. హింసకు అనుమతి లేదు. చట్ట ప్రక్రియను పాటించాలి. కానీ మీరు (పోలీసులు) ఏకపక్ష (ఒకే కోణం నుంచి) దర్యాప్తు చేస్తున్నారు'' అని ఒవైసీ అన్నారు. వాళ్లు (బీజేపీ) ప్రతిచోటా అధికారంలో ఉన్నారని, బుజ్జగింపులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.  ఊరేగింపునకు పోలీసుల అనుమతి లేదని, పైగా రెచ్చగొట్టే నినాదాలు ఈ ఊరేగింపులో చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. అనుమతి లేకుండానే ఎందుకు ఊరేగింపును జరగనిచ్చారు? రెచ్చగొట్టే నినాదాలు ఎందుకు చేశారు? అంటూ ఒవైసీ వరుస ప్రశ్నలు గుప్పించారు. ఊరేగింపునకు అనుమతి ఇవ్వలేదంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా పేర్కొన్నడానికి ఈ సందర్భంగా ఒవైసీ ప్రస్తావించారు. కాగా, దీనికి ముందు ఆస్థానా మాట్లాడుతూ, ఊరేగింపు సందర్భంగా మసీదుపై ఎలాంటి జెండా ఎగురవేసే ప్రయత్నం జరగలేదని చెప్పారు. హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరనీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-19T01:30:48+05:30 IST