యూపీలో పొత్తులు ప్రకటించిన ఒవైసీ

ABN , First Publish Date - 2022-01-22T21:34:28+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులను ఏఐఎంఐఎం ఖరారు చేసింది. బాబు సింగ్ కుష్వాహ, భారత్ ముక్తి మోర్చాతో..

యూపీలో పొత్తులు ప్రకటించిన ఒవైసీ

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులను ఏఐఎంఐఎం ఖరారు చేసింది. బాబు సింగ్ కుష్వాహ, భారత్ ముక్తి మోర్చాతో తమ పార్టీ పొత్తు కుదుర్చుకుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారంనాడు ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రులలో ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు, మరొకరు దళిత వర్గానికి చెందిన వారు ఉంటారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రుల్లో ముస్లిం వర్గానికి చెందిన వారు ఒకరు ఉంటారని వివరించారు.


కాగా, ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు ఉంటుందని ఒవైసీ ఇంతకుముందు ప్రకటించారు. అయితే, కూటమి నుంచి రాజ్‌భర్ తప్పుకుని సమాజ్‌వాదీ పార్టీతో జతకట్టారు. ఎస్‌బీఎస్‌పీ సొంత నిర్ణయం తీసుకుని కూటమి నుంచి వైదొలిగిందని, అయితే ఎంఐఎం పటిష్టంగా ఉన్నందున 100 సీట్లలో పోటీ చేస్తామని ఒవైసీ చెప్పారు. ముస్లింల అభివృద్ధికి ఏ ఒక్క పార్టీ పని చేయలేదని ఆరోపించారు. ముస్లింలను అన్ని పార్టీలు ఓటు బ్యాంకుగానే చూశాయని, ఇదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని, ప్రజలే ఏ పార్టీతో వెళ్లాలనేది నిర్ణయించుకుంటున్నారని చెప్పారు. కాగా, యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 10వ తేదీతో మొదలై మార్చి 7న జరిగే ఏడో విడత పోలింగ్‌తో ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2022-01-22T21:34:28+05:30 IST