ముమ్మాటికీ విమోచన దినమే!

ABN , First Publish Date - 2022-09-17T07:24:24+05:30 IST

తుగ్లక్‌ వంశంలో రెండో రాజైన సుల్తాన్‌ మొహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ (1325–51)ను ‘పిచ్చి తుగ్లక్‌’ అనేవారు. ఏ మాత్రం నిలకడలేని మనస్తత్వం, ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుస్తూ ఉండటమే అందుకు కారణం.

ముమ్మాటికీ విమోచన దినమే!

తుగ్లక్‌ వంశంలో రెండో రాజైన సుల్తాన్‌ మొహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ (1325–51)ను ‘పిచ్చి తుగ్లక్‌’ అనేవారు. ఏ మాత్రం నిలకడలేని మనస్తత్వం, ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుస్తూ ఉండటమే అందుకు కారణం. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుదీ అదే తరహా. అప్పటికప్పుడు తోచిన నిర్ణయాలు తీసుకోవడం, అంతే వేగంగా వెనక్కుపోవడం, పచ్చి అబద్ధాలతో బురిడీ కొట్టించడం ఆయనకు అలవాటు. ఇందుకు తాజా ఉదాహరణ తెలంగాణ విమోచన దినోత్సవాల నిర్వహణ అంశం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర విభజనకు ముందు కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, తరువాత తన మిత్రపక్షమైన ఆలిండియా మజ్లీస్‌ ఇత్తె హదుల్‌ ముస్లిమీన్‌ (ఎఐఎంఐఎం)ను ఖుషీ చేయడానికి మాట మార్చారు.


నిజాం పాలనలో తెలంగాణలో దారుణ మారణ హోమాలకు తెగబడి, అరాచకం సృష్టించిన మజ్లీస్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌ రూపాంతరమైన పార్టీ కోసమని, ఉద్యమకారులకు ఇచ్చిన మాటను అయన తుంగలో తొక్కారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లామిక్‌ దేశంగా మార్చడం లేదా పాకిస్థాన్‌లో చేరిపోవడం లక్ష్యంగా పనిచేసిన సంస్థపై ఉన్న ప్రేమ కేసీఆర్‌కు రాష్ట్రప్రజలపై లేకుండాపోయింది. తమను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరి మీద ఎంఐఎం సాయుధ వలంటీర్ల దళానికి చెందిన రజాకార్లు పగబట్టి మారణ హోమం సృష్టించడాన్ని మన ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రయోజనాల కోసం మరిచిపోవడం ఘోరమైన విడ్డూరం. రజాకార్ల నాయకుడైన ఖాసీం రజ్వీ పాకిస్థాన్‌కు పరారయ్యే ముందు ఎంఐఎం పగ్గాలను ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తాతగారైన అబ్దుల్‌ వహిద్‌ ఓవైసీకి అప్పగించారు. ఎంఐఎం పేరును ఆయన ఎఐఎంఐఎంగా మార్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తామని, అమర వీరులకు నివాళులు అర్పిస్తామని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించడంతో  కేసీఆర్‌, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ కూడబలుక్కుని చరిత్రను వక్రీకరించే కుళ్లు రాజకీయాలకు తెరదీశారు. నిజాం చాలా గొప్ప రాజు అని అసెంబ్లీ వేదికగా పొగిడిన కేసీఆర్‌, హఠాత్తుగా తన వైఖరిని ఈ విధంగా మార్చుకోవడం, నిజాం ఫ్యూడల్‌, నిరంకుశ రాజు అన్న అసదుద్దీన్‌ అభిప్రాయంతో ఏకీభవించడం విశేషం, విచిత్రం.


మాటిమాటికీ మాట మార్చే కేసీఆర్‌ వైఖరి ప్రజలకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ఆయనా, అసదుద్దీన్‌ కలిసి చారిత్రాత్మక విమోచన పోరాటానికి వక్రభాష్యాలు చెబుతున్న తీరే ప్రజానీకానికి బాధ కలిగిస్తోంది. విమోచన దినాన్ని ఒక్క దస్తఖతుతో ఉన్నఫళాన సమైక్యత దినంగా మార్చేయడం ద్వారా తెలంగాణ ప్రజల స్పూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను వారిద్దరూ కించపరుస్తున్న తీరును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అది కేవలం రాజకీయ ప్రేరిత దుశ్చర్యేనని భారత చరిత్ర పట్ల కనీస అవగాహన ఉన్న వారెవరికైనా అర్థమవుతుంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2014 సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా బీజేపీ కార్యకర్తల్ని అడ్డుకొన్నప్పుడే ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి కేసీఆర్‌ ఎంతగా తాపత్రయపడుతున్నారో స్పష్టమైంది. దేశంలోని 560కి పైగా సంస్థానాలు విలీన ఒప్పందం కుదుర్చుకొని భారత యూనియన్‌లో చేరాయి. కానీ, హైదరాబాద్‌ సంస్థానం మాత్రం శాంతియుతంగా భారత్‌లో విలీనం కాలేదు. సైన్యం విమోచన కల్పించాల్సి వచ్చింది. ఏ విధంగా చూసినా, ఎవరికైనా అర్థమయ్యే చారిత్రక సత్యం ఇదే.


టీఆర్‌ఎస్‌ – ఎంఐఎం చెబుతున్నట్లుగా సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యత దినంగా జరిపేటట్లయితే – కశ్మీరు పాలకుడు తనంతటతానుగా తన సంస్థానాన్ని భారతలో విలీనం చేసిన అక్టోబరు 27 (1947)ను ఏ రోజుగా జరపాలి? జునాఘడ్‌ పాలకుడు పాకిస్థాన్‌కు పరారయ్యాక, ప్రజాభిప్రాయ సేకరణ జరిపినప్పుడు 99.5 శాతం మంది ఇండియన్‌ యూనియన్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తపరచిన ఫిబ్రవరి 20 (1948) సంగతేమిటి? పోర్చుగీసువారు లొంగిపోయి, గోవా విముక్తి జరిగిన డిసెంబరు 19 (1961)ను ఏ పేరుతో జరపాలి? పాండిచ్చేరి మీద పెత్తనాన్ని ఫ్రాన్స్‌ భారత ప్రభుత్వానికి అప్పగించి వెనుదిరిగిన ఆగస్టు 16 (1962) సంగతేమిటి? ప్రజాభిప్రాయం మేరకు సిక్కింలో రాజరికం అంతమయినట్లు, సిక్కింని భారత్‌లో కలిపేస్తున్నట్లు సిక్కిం పార్లమెంటు ప్రకటించిన ఏప్రిల్‌ 9 (1975)ను ఏమని పిలవాలి? వేర్వేరు రోజుల్లో ఇండియన్‌ యూనియన్‌లో చేరిన 565 సంస్థానాలు ఏ ఏ పేర్లతో సంబురాలు జరుపుకోవాలి? ప్రజల మనోభావాలు ముడిపడివున్న వీరోచిత విలీన దినోత్సవంపై ఏమిటీ తుగ్లక్‌ వాదనలు? చారిత్రక సత్యాన్ని కాదనకుండా, సెప్టెంబరు 17 (1948)ను హైదరాబాద్‌ విమోచన దినంగా జరుపుకోవడమే సమంజసం, సమర్ధనీయం.


– కిషోర్‌ పోరెడ్డి

బీజేపీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి

Updated Date - 2022-09-17T07:24:24+05:30 IST