గీత గీస్తాం.. వేటు వేస్తాం!

ABN , First Publish Date - 2022-03-08T08:18:50+05:30 IST

గీత’ దాటితే బయటికే! ‘నోరు’ జారితే జాగ్రత్త!.... విపక్ష సభ్యులకు సభాపతి తమ్మినేని సీతారాం, సభానాయకుడు వైఎస్‌ జగన్‌ జారీ చేసిన హెచ్చరికలివి!...

గీత గీస్తాం.. వేటు వేస్తాం!

బెదిరింపులతో మొదలైన ‘సభా పర్వం’.. బీఏసీలో స్పీకర్‌, సీఎం హెచ్చరికలు

దీటుగా బదులిచ్చిన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్న

3 గీతలు గీయిస్తున్నా.. మూడో గీత దాటితే సస్పెన్షన్‌: స్పీకర్‌

ప్రజా సమస్యలకోసం అవసరమైతే దాటుతాం: అచ్చెన్న

అసెంబ్లీలో మీరు అవాస్తవాలు చెబితే బయటికే: జగన్‌

ఆ ఐదేళ్లపై ఆత్మవిమర్శ చేసుకోండి: అచ్చెన్నాయుడు

సభలో గవర్నర్‌ను దూషిస్తారా?

వయసుకైనా గౌరవం ఇవ్వొద్దా!

మీకు సభ్యత, సంస్కారం లేవు: సీఎం

మేమేం గవర్నర్‌ను తిట్టలేదు

బాబు వయసును గౌరవించారా?

నిరసనలు ఇప్పుడే కొత్తా?: అచ్చెన్న


అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘గీత’ దాటితే బయటికే! ‘నోరు’ జారితే జాగ్రత్త!.... విపక్ష సభ్యులకు సభాపతి తమ్మినేని సీతారాం, సభానాయకుడు వైఎస్‌ జగన్‌ జారీ చేసిన హెచ్చరికలివి! సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజే... విపక్షం పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో అధికారపక్షం సూటిగా స్పష్టం చేసింది. సభను ఎన్ని రోజులు, ఎలా, ఏ అజెండాతో నిర్వహించాలో నిర్ణయించే సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)లో బెదిరింపు స్వరం వినిపించింది. ఈ భేటీకి ముందే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. ఈ సమయంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేయడంపై సీఎం ఆగ్రహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... తన స్థానం ముందు మూడు గీతలు గీయిస్తున్నానని, మూడో గీత దాటితే ఆటోమేటిగ్గా సస్పెండైపోతారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. పదే పదే స్పీకర్‌ స్థానం ముందుకు వచ్చి ధర్నా చేయడం టీడీపీ ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందని, దీనిని అనుమతించబోమని సీఎం జగన్‌ అన్నారు.


విపక్షం తరఫున బీఏసీ భేటీకి హాజరైన టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు దీనికి దీటుగా బదులిచ్చారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యేలే మొదటిసారి ధర్నా చేస్తున్నట్లు మీరు  మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకసార్లు ఏకంగా స్పీకర్‌ సీటు వరకూ వెళ్లి ఆయన్ను చుట్టుముట్టి కాగితాలు చించి ఆయనపై పోశారు. ఎన్నిసార్లు పోడియం వద్ద ధర్నాలు చేశారో లెక్కే లేదు. అయినా మేమెప్పుడూ ఇలాంటి గీతలు గీయలేదు. మీరు మాకు మైక్‌ ఇవ్వనప్పుడు.. మా వాణిని వినిపించే అవకాశం ఇవ్వనప్పుడు నిరసన తెలిపే హక్కు మాకుంది. ఇప్పుడు ఉన్న స్పీకర్‌ గత సభలో ఎమ్మెల్యే కాదు. అప్పుడేం జరిగిందో ఆయనకు తెలియదు’ అని తెలిపారు. తాను సభలో లేకపోయినా అప్పుడేం జరిగిందో ఎప్పటికప్పుడు తెలుసుకొనేవాడినని తమ్మినేని బదులిచ్చారు. ఎన్ని గీతలు గీసినా ప్రజా సమస్యల కోసం వాటిని దాటాల్సి వచ్చినప్పుడు దాటుతామని, సస్పెండ్‌ చేసినా ఫర్వాలేదని అచ్చెన్న అన్నారు. సస్పెన్షన్‌ కోసమే టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.


గవర్నర్‌ను అవమానించారంటూ...

గవర్నర్‌ ప్రసంగం సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలియజేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ను దూషించారని.. ప్రసంగ పాఠం ప్రతులను చించి ఆయనపైకి విసిరేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచిది కాదన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదని చెప్పారు. ‘‘మీకు సభ్యత, సంస్కారం లేవు. ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకపోతే ఎలా? సభ అంటే మీ ఇష్టం వచ్చినట్లు చేయడం అనుకుంటున్నారా’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అచ్చెన్నాయుడు దీనికి దీటుగా బదులిచ్చారు. ‘ప్రతిపక్షం రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుంది. మేమేమీ గవర్నర్‌ను కొట్టలేదు.. తిట్టలేదు. మా నిరసన వ్యక్తం చేశాం. గవర్నర్‌ ప్రసంగం సమయంలో గతంలో అప్పటి ప్రతిపక్షాలు అనేకసార్లు నిరసన వ్యక్తం చేశాయి. ఇదేదో కొత్తయినట్లు మాట్లాడడం సరికాదు. మీరు గవర్నర్‌ వయసు గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు వయసుకు మీ పార్టీ ఎమ్మెల్యేలు గౌరవం ఇచ్చారా’ అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తానెప్పుడూ గవర్నర్‌ పట్ల ఇలా నిరసన తెలుపలేదని, అలా చేసినట్లు నిరూపిస్తే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి వెళ్లిపోతానని జగన్‌ వ్యాఖ్యానించారు. ‘మీరు’ అంటే జగన్‌ కాదని, ఆయన పార్టీలో ఉన్నవారు కొందరు గతంలో గవర్నర్‌ ప్రసంగం సమయంలో నిరసన తెలిపారని.. ఈ విషయం అందరికీ తెలుసని అచ్చెన్న బదులిచ్చారు. ఇకపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలెవరైనా అబద్ధం మాట్లాడితే తక్షణం సభా హక్కుల కమిటీకి పంపించి వెంటనే సస్పెండ్‌ చేయిస్తామని, ఊరుకునే సమస్య లేదని సీఎం హెచ్చరించారు. ‘‘సభను తప్పుదోవ పట్టించేలా.. తప్పుడు లెక్కలు, గణాంకాలను పదే పదే చెబితే క్షమించేది లేదు. వాటిని సరిదిద్దిన తర్వాత కూడా అలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగైతేనే తప్పుడు లెక్కలు చెప్పకుండా ఉంటారు’’ అని సీఎం అన్నారు. తాము సభలో ఏనాడూ అబద్ధాలు చెప్పలేదని, ఆ విషయం టీడీపీ గుర్తించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. ‘‘అంతకుముందు ఐదేళ్లూ మీరేం మాట్లాడారో ఇంటికి వెళ్లి పడుకునే సమయంలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎన్ని అబద్ధాలు మాట్లాడారో మీకే తెలుస్తుంది’’ అని అచ్చెన్నాయుడు చెప్పారు.


Updated Date - 2022-03-08T08:18:50+05:30 IST