ఆశల సమాధి

ABN , First Publish Date - 2022-09-12T05:50:00+05:30 IST

పాతిల్లు శిథిలమవుతున్నట్టు వయసు పైబడుతున్న శరీరం కుంగిపోతున్నది! బాల్యమంతా బాల్యం లేకుండానే...

ఆశల సమాధి

పాతిల్లు శిథిలమవుతున్నట్టు

వయసు పైబడుతున్న శరీరం కుంగిపోతున్నది!


బాల్యమంతా

బాల్యం లేకుండానే గడిచింది!

యవ్వనమంతా

ఉద్రేకాలు ఆవేశాలు ఆశయాలు లేకుండానే పరిగెత్తింది!

చూస్తూ చూస్తూనే యాభయ్యవ గీత దాటాక

కుదుట పడదాం

కాస్తా ఒడ్డున కూసుద్దాం అనుకున్నామా...

చూపు కాసింత దూరం కూడా ఆనక

తడుముకోవాల్సి వస్తుంది!


అనుకున్నాను

ముసలితనం రాదులే....

ముడతలు పడి పోనులే..

మూడో కాలు మోసుకు తిరగనులే...

ఆలోచనల వాడీ వేడీ చల్లారదులే...

అంతా వొట్టి భ్రమని వర్తమానం వెక్కిరిస్తోంది!


అనుకున్నాను కదా...

ఛాతీ విశాలంగా పరచి

నదీ వాగు చెరువు జలపాతాలల్లో మునకలేయాలని...

కొండగుట్ట పర్వతం కొసవరకెక్కి

కాలి మునివేళ్లమీద నిక్కీ ఆకాశాన్ని చుంబించాలని...

అడవి అరణ్యాలలో కాటగలవాలని...

పొలం పంట వ్యవసాయం బురదమన్నులో పడి 

  లేచి ఒళ్లంతా మట్టికొట్టుకుపోవాలని...

నడకంటూనేర్వని నవజాతశిశువును భుజాలమీద ఎగరేయాలని...

నడకలు నేర్చిన పిల్లలతో దోబూచులాడాలని...

మాటలు నేర్చిన గడుగ్గాయిలతో 

గుక్కతిప్పుకోకుండా అన్ని భాషలు పలికేయాలని...


అయ్యో

అయ్యో అయ్యో...

అన్నీ అనుకున్నానే కానీ...

ఆరోగ్యాన్ని పిడికిటపట్టాలనీ 

మనసు గుర్రాన్ని కట్టెయ్యాలనీ

ఆలోచనలను అదుపుచేసుకోవాలనీ

ఎందుకో అనుకోలేకపోయా?


పిచ్చివాడా?

ఏ ఆశయం లేని ఏమాశలు నమ్ముకున్నావు?

ఈ జనరేషన్‌లో

ఏ జనరేషన్‌ గ్యాప్‌లో వున్నావో తెలుసా?

ఇప్పుడు ఈ నేలమీద వెనకటి మనిషి లెక్క

ఏ శతాబ్దంలో బతుకుతున్నావో ఇంటర్నెట్లో వెతుక్కున్నావా?

తరాలు మారిన అంతరాలు మానవత్వాన్ని 

అవహేళన చేస్తున్నాయి!


రాజకీయాలు చేసినా చేయకపోయినా 

ఇక్కడ నీ అస్తిత్వం రాజకీయమయ్యింది!

సొంత వ్యక్తిత్వం పార్టీల చొక్కాలు తొడుక్కొని 

  మెడచుట్టూ కండువాలను మోస్తున్నది!

బతుకు సంక్షేమ పథకాలకు పిచ్చిపట్టి ఎగబడుతున్నది!

ఉచ్ఛ్వాసనిశ్వాసాల మధ్య వ్యాపారం ఊపిరిపోసుకుంటున్నది!

నీకు తెలవకుండానే బారులు తీరిన

ఈవీఎంల ముందు 

ఓటర్‌వయ్యి రాజకీయఅంగడిలో అమ్ముకోబడ్డ సరుకై నిలబడ్డావు!


చూపు తగ్గినట్టే 

బతుక్కూడా తగ్గీ తగ్గీ ఎంత కుంగిపోతావో...

పోస్ట్‌ కరోనా ఐనా కూడా

మూసుకో

ముక్కు మూతి నోరు చెవులు కూడా!


స్వతంత్ర ఆలోచనల్తో బతికిన

పోరాటాల పిడికిలెత్తిన

జీవితాంతం హక్కులకై పోరాడిన వాళ్లు 

ఇప్పటి ఈ మీడియాలో కనిపిస్తున్నారా ఎక్కడైనా?

ఒక్కసారి పాత పేపర్లనన్నా తిరగేసి చూడు...

నిర్బంధనమై దిగ్బంధనమై ఇప్పుడింకా జైళ్లలో మగ్గుతున్నారు!

తెలుసా...

వాళ్ల వెనకాల పిడికిలెత్తి హోరునినాదాల జనప్రవాహం కనిపించేది!


పిడికిలెత్తిన చేతులకు సంకెళ్లు తొడిగిన రాజ్యంలో

అరుస్తున్న గొంతులపై బూటుకాలు పెట్టిన వ్యవస్థలో 

మనిషి బతుకాశాల్ని బుల్డోజర్లతో పెకిలిస్తూ

సజీవ సమాధి చేస్తున్నరు!


ఇప్పుడు నువ్వు శ్వాసిస్తున్న శ్వాసతోనే

ఊపిరి బిగబట్టి 

సొంతంగా సమాధి కట్టుకోవడమే చెయ్యాలి--

అన్వర్‌

98660 89066


Updated Date - 2022-09-12T05:50:00+05:30 IST