నాతో కలిసి విజయనగరంలో ప్రచారం చేశానని పవన్ అన్నారు.. అది అబద్ధం

Published: Fri, 07 Feb 2020 11:16:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నాతో కలిసి విజయనగరంలో ప్రచారం చేశానని పవన్ అన్నారు.. అది అబద్ధం

ఎన్టీఆర్ సినిమాలే నేను చూడలేదు.. ఇక పవన్ ఎవరో ఎలా తెలుస్తుంది

మళ్లీ మోదీనే వచ్చినా.. మా పోరాటం ఆగదు

సీరియస్‌నెస్ లేక చిరంజీవి పార్టీ పెట్టి నిలబెట్టలేకపోయారు

1995లో ఎన్టీఆర్‌తో విభేదించాల్సి వచ్చింది.. ఏ రోజూ ఆయన కోప్పడలేదు

వైఎస్ నా కొలీగ్.. ఆయన కుమారుడిగా జగన్ బాగుండాలని కోరుకుంటా..

మళ్లీ లోక్‌సభకే వెళ్తా.. నాకు రాజకీయ వారసులు ఉండరు

తెలంగాణ స్పందించలేదని.. ఆంధ్రాకు కూడా ఆపేశారు

మా రాజీనామాలను 24గంటల్లో ఆమోదింపజేసుకున్నాం.. వైసీపీ చేయలేకపోయింది

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు


ఆయన విజయనగరం మహారాజా వారసుడు.. అయినా ఇసుమంతైనా దర్పం.. గర్వం ఉండదు.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉన్నా ఎంతో నిరాడంబరత.. ఎన్టీఆర్‌, చంద్రబాబులకు ఆయనపై అమిత గౌరవం.. ఆయనకూ వారంటే గౌరవం.. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తారు. చంద్రబాబు ఆదేశించగానే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని పార్లమెంటు లోపలా బయటా పోరాడారు. ఆయనే విజయనగరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు. ప్రధాని మోదీ మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారని.. టీమ్‌ లీడర్‌గా నడిపించలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ మోదీ ప్రభుత్వమే వచ్చినా రాష్ట్రానికి న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్న పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 13-08-2018న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో అశోక్‌ గజపతిరాజు మాట్లాడారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. విశేషాలివీ..

 

అశోక్‌గజపతి రాజుగారు.. నమస్కారమండి. వెల్కం టూ ఓపెన్‌ హార్ట్‌

నమస్కారం. హైదరాబాద్‌ రావడమే తగ్గించాను. ఇక్కడ పెద్దగా పనే లేదు.


రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లయింది కదా..! అయినా అప్పటిలానే ఎంతో సింపుల్‌గా ఎలా ఉండగలుగుతున్నారు?

నా కేరెక్టర్‌ అలాంటిది. విలువలకు కట్టుబడి ఉంటాం. అందుకే అలాగే ఉంటాం. 


విజయనగర సామ్రాజ్యం ఏలిన రాజుల కుటుంబం నుంచి వచ్చారు కదా?

దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చాడు. ఆ గౌరవం ఉంది. 1794నుంచి బ్రిటిష్‌ వాళ్ల నియంత్రణలో ఉన్నాం. జమీందారీ విధానాన్ని కొనసాగించాం. ఇప్పటితో పోల్చుకుంటే ఆ సమాజం కొంత ఫ్యూడల్‌. తల్లిదండ్రులు విజయనగరం నుంచి బయటకు పంపి చదవించడంతో ఈ రోజున ఇలా ఉండగలుగుతున్నాం. 


మీ తండ్రికి ముందు రాజకీయాల్లో ఎవరూ లేరు కదా?

మా తండ్రి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా కూడా చేశారు. విజయ్‌ అని మా గ్రాండ్‌ అంకుల్‌.. ఆయన కంటే ముందే ఎంపీగా చేశారు. మా అన్నయ్య కూడా చేశారు. నేను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏడుసార్లు గెలిచాను. తొలిసారి ఎంపీగా గెలవగానే మంత్రినయ్యాను.


మొన్నటి వరకూ మంత్రిగా ఉండి ఇప్పుడు అదే ప్రభుత్వంపై పోరాడడం ఎలా అనిపిస్తోంది?

ప్రభుత్వంలో.. రూలింగ్‌ పార్టీ ఎంపీగా.. ఇప్పుడు అప్పోజిషన్‌లో.. ఒకే టర్మ్‌లో ఉంటున్నాం. ప్రభుత్వంలో ఉండడం వల్ల పని చేసే అవకాశం వస్తుంది. మంచి టీమ్‌ దొరకడంతో విమానయాన రంగంలో ఎన్నో మార్పులు చేశాం. మోదీ తనకు వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారని అనిపిస్తోంది. సింపుల్‌గా ఉండే వ్యక్తిగా మోదీని వేలెత్తి చూపలేం. కానీ టీమ్‌ని నడిపించడంలో ఆయన సరిగా వ్యవహరించలేకపోతున్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నాం. 


ప్రధానితో ఎప్పుడైనా వ్యక్తిగతంగా మాట్లాడారా?

నమస్కారం అంటే నమస్కారం అన్నట్లు ఉండేది. వ్యక్తిగతంగా మాట్లాడినా పూర్తిగా పాలనకు సంబంధించిన విషయాలు వచ్చేవి. వేరే మాట్లాడడానికి ఆయన వద్ద అవకాశం ఉండదు. 


1978లో జనతా పార్టీ నుంచి గెలిచారు కదా? టీడీపీలోకి ఎలా వచ్చారు?

ఎన్టీఆర్‌ ఒక సీరియస్‌ పొలిటీషియన్‌. తిరుపతిలో మహానాడు పెట్టిన సందర్భంలో వచ్చేవాళ్లంతా రాజీనామాలు చేసి రమ్మన్నారు. దాంతో ఒక్క నాదెండ్ల భాస్కరరావు తప్ప అందరూ పారిపోయారు. ఎన్నికలలో పోటీ చేసేప్పుడే ఒక నిర్ణయానికి రావాలి. అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షంలో ఉన్నా తమ బాధ్యతలు నిర్వర్తించాలి. ఓడిపోతే ఇంటికి పోతాం. అయితే అసలు ఏ పాత్ర పోషించం అనే మాట కొత్తగా అక్కడక్కడా వినిపిస్తోంది.

నాతో కలిసి విజయనగరంలో ప్రచారం చేశానని పవన్ అన్నారు.. అది అబద్ధం

ఇది జగన్‌ను దృష్టిలో పెట్టుకుని అంటున్నారా?

జగన్‌ ఒక భాగం. చిరంజీవి ఉన్నారు. మంచి స్టార్‌. పార్టీ పెట్టారు. కానీ నిలబెట్టలేకపోయారు. సీరియస్‌నెస్‌ లేకుంటే మొత్తం వ్యవస్థ దెబ్బ తింటుంది.


రాజీనామా చేసి ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లారా?

అవును.. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీడీపీలో చేరాను. మూడోసారి ఎమ్మెల్యే అయ్యాక మంత్రినయ్యాను. 2004లో ఓడిపోయి ఇంటికి వెళ్లిపోయాను. ఆ తర్వాత మళ్లీ గెలిచాను.

 

టీడీపీలో చంద్రబాబు కంటే మీరు సీనియర్‌ కదా?

అవును. చంద్రబాబు కూడా మాతో పాటే 1978లో ఎమ్మెల్యేగా గెలిచారు.


ఎన్టీఆర్‌ మీకు ఎంతో గౌరవం ఇచ్చేవారు? 1995లో విభేదించాల్సి వచ్చినప్పుడు మీరెలా ఫీలయ్యారు?

వ్యక్తిగా ఆయన సమున్నతుడు. తెలుగుకు గుర్తింపు ఆయన వల్లే వచ్చింది. ఆ రోజున కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వాటిని సరిచేయడానికి ప్రయత్నించాం. కుదరలేదు. దాంతో బయటకు వచ్చాం. కానీ ఆయనంటే ఎప్పటికీ గౌరవమే.

 

మీరు మధ్యవర్తిత్వం చేసినప్పుడు ఎలా స్పందించారు?

ఏ రోజూ ఆయన కోప్పడలేదు.

 

చంద్రబాబులో ప్లస్‌ ఏమిటి.. మైనస్‌ ఏమిటి?

ఆయన ఎక్కువగా విశ్లేషణ చేస్తుంటారు. దాని ప్రభావం పనిమీద ఉంటుంది. విశ్లేషణ, పని సమానంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.

 

ఎన్డీఏ నుంచి బయటకు రావడం మంచి నిర్ణయమేనా?

ఇంతకు మించిన మార్గం లేదు. ఆంధ్రా గురించి చర్చిద్దామన్నాం. ఒప్పుకోలేదు. దాంతో గౌరవంగా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. అవిశ్వాసానికి వెళ్లాం. దానివల్ల రాష్ట్రం పరిస్థితిని దేశం దృష్టికి తీసుకెళ్లాం. ప్రజలు కూడా మేం చేసిన పనిని అర్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు త్యాగం చేస్తారు. కష్టపడతారు. రాష్ట్రాన్ని విభజించి చెప్పినవి చేయకుంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారు?

 

బీజేపీ హోదా ఇవ్వనని చెప్పింది. కాంగ్రెస్‌ ఇస్తానంటోంది

హోదా అడిగింది.. హామీ ఇచ్చింది జాతీయ పార్టీలే. ఇవ్వాల్సిన బాధ్యత వాళ్లది.

 

మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తే..!

ఇదే పోరాటం కొనసాగిస్తాం. సంక్షేమం ఆపం. అభివృద్ధిలో అత్యుత్తమంగా ఉన్నాం. దానిని కొనసాగిస్తూనే పోరాడతాం.


వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందా?

ఇప్పటికైతే కచ్చితంగా గెలుస్తాం. ప్రజల్లో సంతృప్తస్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఒక్క విభజన సమస్యలే ఇబ్బంది.


నాతో కలిసి విజయనగరంలో ప్రచారం చేశానని పవన్ అన్నారు.. అది అబద్ధం

జగన్‌ మీద ఫుల్‌ క్లారిటీ ఉందా?

ఆయన కుర్రాడు. ఆయన తండ్రి, మేమూ అంతా కలిసి ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టాం. కొలీగ్‌ కుమారుడిగా ఆయన బావుండాలని కోరుకుంటాను. ఇక ఆయన వెళ్లే దారి దేశానికి మంచిది కాదు. ఆయన వైఖరి రాజకీయానికి మంచి చేయదు. వ్యక్తిగతంగా ఆయనకూ మంచి చేయదు.

 

పవన్‌ సినిమాలు నేను చూడను అన్నారెందుకు?

ఎవరో అడిగారు.. దానికి నేను.. మనిషి నాకు తెలియదన్నాను. ఎన్టీఆర్‌ సినిమాలే నేను చూడలేదు. విజయనగరంలో ప్రచారం చేశానని ఆయన చెబుతున్నారు. నేను, ఆయనా కలిసి ప్రచారం చేయలేదు.

 

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకా, లోక్‌సభకా?

లోక్‌సభకు వెళ్తారా అని అప్పట్లోనే ఎన్టీఆర్‌ అడిగారు. కానీ కొద్దిగా అనుభవం వచ్చాక వెళ్తే బావుంటుందని చెప్పాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. మళ్లీ లోక్‌సభకే ప్రయత్నిస్తా.

 

మీకు రాజకీయ వారసులు ఎవరు?

రాజకీయ వారసులు ఉండరు. ఆస్తులకు ఉంటారు. ఇప్పటికైతే వారసత్వం గురించి చెప్పను. రాజకీయం గురించి ఆసక్తి ఉంటే నిలబడతారు. లేకుంటే లేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒకామె డాక్టరు. మరొకామె టీచర్‌. ఆమె విడాకులు తీసుకుని మాతోనే ఉంటూ.. మా సంస్థలకు సాయం చేస్తుంటారు. ఆమెకు రాజకీయాలు ఇష్టమని నాతో అయితే చెప్పలేదు.


సోము వీర్రాజు (బీజేపీ ఎమ్మెల్సీ): మీరు ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు టీడీపీలో చేరారు. ఎన్టీఆర్‌, చంద్రబాబుల్లో ఎవరితో సౌకర్యవంతంగా ఉన్నారు? కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి 3 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులను మంజూరు చేయించారు. వాటి టెండర్లలో ఏఏఐ పాల్గొనకుండా చేయడం వెనుక మీపై ఎవరి ఒత్తిడైనా ఉందా?

అశోక్‌ గజపతిరాజు: ఎన్టీఆర్‌ మాకంటే చాలా పెద్దవారు. చంద్రబాబు, మేమూ సమకాలికులం. ఎన్టీఆర్‌ మీద ఎంత గౌరవం ఉందో చంద్రబాబు మీదా అంతే గౌరవం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో నేను మంత్రిగా చేశాను. కానీ ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ఎన్డీఏ సమావేశం కాలేదు. అలా సమావేశమై ఉంటే మాలాంటి వారికి పని చేయడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. ఇక గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు ఒక్క ఏపీకే కాదు.. దేశంలో ఏ రాష్ట్రం అడిగినా ఇచ్చాం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఆ టెండర్లు వద్దని చెప్పింది నేనే. కార్గో పెట్టండి, ఎంఆర్‌వో పెట్టండని సూచనలు చేసింది నిజమే. అందుకే మళ్లీ టెండర్లు పిలవాలని సూచించాను. ప్రయాణికుల కోసమే విమానాలు నడుపుతామనుకుంటే ఇక వృద్ధి ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ చూడకుండా నిందలు వేస్తామంటే కాదనేదేమీ లేదు. అన్ని రకాల సౌలభ్యాలు ఉండాలన్నదే నా వాదన. ఆ టెండర్ల విషయంలో మేం చేసింది సరైందే.

 

తులసిరెడ్డి (కాంగ్రెస్‌): 2014 సార్వత్రిక ఎన్నికల్లో బాబు-మోదీ జోడీ బావుంటుందని ప్రజలు నమ్మి మీకు అధికారం ఇచ్చారు. నాలుగేళ్లు రాష్ట్రం, కేంద్రంలో అధికారం పంచుకున్నారు. కానీ రాష్ట్రానికి ఈ నాలుగేళ్లలో ఏమీ రాలేదు. ఈ వైఫల్యాన్ని మీరు ఒప్పుకొని ఆ తర్వాత కేంద్రంపై విమర్శలు చేస్తే బావుంటుంది. అందుకు ముందు మీరు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.

అశోక్‌ గజపతిరాజు: మొదట క్షమాపణలు చెప్పాల్సింది వారే. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన వారే క్షమాపణలు చెప్పాలి. కేంద్రాన్ని నమ్మాం. కేంద్ర ప్రాయోజిత పథకాలు బీజేపీ రాష్ట్రాలతో పోల్చుకున్నా ఆంధ్రప్రదేశ్‌లోనే బాగా అమలవుతున్నాయి. ఈ నాలుగేళ్లు చేయాల్సినంత చేశాం. మేం పనిచేయకుంటే విద్యా సంస్థల ఏర్పాటు ఇంత వేగంగా జరిగేదా? తెలంగాణలో గిరిజన వర్సిటీ ప్రతిపాదన ఇంకా అక్కడే ఉంది. వాళ్లు భూమి కూడా చూపించలేదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సింది కూడా ఆపి కూర్చున్నారు. అలాగే 11 సంస్థలకు అనుమతులు వచ్చాయి. విజయాలతో పాటు వైఫల్యాలకూ బాధ్యత వహిస్తాం. బీజేపీ వాళ్లు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేక పోయారో అర్థమే కాదు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఆ రోజు చెప్పిన లెక్కే కదా! దానిని కూడా ఇప్పుడు అంగీకరించడం లేదు.

 

కె.సంజీవయ్య (వైసీపీ ఎమ్మెల్యే): పార్లమెంటులో టీడీపీ పెట్టిన అవిశ్వాసంతో సాధించింది ఏమైనా ఉందా? ఇది టీడీపీ, బీజేపీ ఆడిన డ్రామా కాదా? ముఖ్యమంత్రి హోదా వద్దని చెప్పి మళ్లీ ఇప్పుడు కావాలనడంలో ఔచిత్యం ఏమిటి?

అశోక్‌ గజపతిరాజు: కొందరికి రాజకీయ విజ్ఞత ఎలా ఉంటుందో మనమెలా చెప్పగలం? ఆంధ్రపై చర్చ కావాలని మేం అడిగితే ఆ రోజున అవిశ్వాసం కావాలన్నది ఈ వైసీపీ వాళ్లే. అంటే ఆ రోజున బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందా? ప్రజలు అవకాశం ఇచ్చినా అవిశ్వాసంలో ఓటు వేయకూడదని పారిపోయింది ఎవరో చూశాం. లోక్‌సభలో రాజీనామాలు చేస్తారు.. రాజ్యసభలో వద్దంటారు. ఇదంతా గమ్మత్తుగా ఉంది. రాజకీయాలు వ్యాపారం కాదు. కేంద్రంతో మేం పని చేయించలేకపోయాం. వెంటనే రాజీనామా చేసి 24 గంటల్లో ఆమోదింపజేసుకున్నాం. రాజీనామాలంటూ కాలం గడిపిందెవరు?

 

విజయ్‌బాబు (జనసేన): మీరు రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, హుందాతనానికి ప్రతీకగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి కేంద్ర మంత్రిగా ఉండి సరైన సమయంలో ఎందుకు ప్రశ్నించలేదు? మోదీ, చంద్రబాబుతో కలిసి.. పోయిన ఎన్నికల్లో ప్రచారం చేసిన హీరో పవన్‌ నాకు తెలియదనడం కావాలనేనా?

అశోక్‌ గజపతిరాజు: గెలుపోటములకు అనేక కారణాలు ఉంటాయి. సీరియస్‌గా రాజకీయాలు చేసేవారి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. అది లేకుంటే పట్టించుకోం. నేను కేంద్ర మంత్రిగా ఉన్నా నా గురించి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. మేం సినిమాలు చూసేది చాలా తక్కువ. తెలుగు సినిమాలు ఇంకా తక్కువ.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

రాజకీయ నేతలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.