Birthday వేడుకలకు దూరంగా అశోక్ గెహ్లాట్

ABN , First Publish Date - 2022-05-03T19:23:09+05:30 IST

జోథ్‌పూర్‌లో మతఘర్షణలు తలెత్తడం, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాజస్థాన్..

Birthday వేడుకలకు దూరంగా అశోక్ గెహ్లాట్

జోథ్‌పూర్: జోథ్‌పూర్‌లో మతఘర్షణలు తలెత్తడం, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండిపోయారు. మంగళవారంనాడు ఆయన 71వ పడిలోకి అడుగుపెట్టారు. ఈద్‌కు కొద్ది గంటలకు ముందు సోమవారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య జోథ్‌పూర్‌లో మత ఘర్షణలు తలెత్తాయి. అల్లరిమూకలు రాళ్లురువ్వడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ సందర్భంగా ఐదుగుగురు పోలీసులు గాయపడ్డారు.


జోథ్‌పూర్ ఘర్షణలపై రాజస్థాన్ డీజీపీ, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి గెహ్లాట్ మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ప్రజలంతా శాంతి, సామరస్యాలను పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. సాంప్రదాయ ఆప్యాయతలకు, సోదరభావాలకు ప్రతీక జోథ్‌పూర్ అని, దానిని గౌరవించాలని కోరారు. విశ్వసనీయ కథనాల ప్రకారం, ఈద్ పండుగను పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుడు బాల్‌ముకుంద్ బిస్సా విగ్రహం చుట్టూ ఈద్ జెండాలను మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. అయితే పరశురామ జయంతిని పురస్కరించుకుని తాము అక్కడ ఉంచిన కాషాయం జెండాలను తెలగించారంటూ మరో వర్గం ఆరోపించింది. మాటామాటా పెరగడంతో రాళ్లు రువ్వుడు ఘటన చోటుచేసుకుంది. పోలీసులు హుటాహుటిని అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Read more