సినిమా రివ్యూ: అశోకవనంలో అర్జున కల్యాణం

Published: Fri, 06 May 2022 16:24:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ: అశోకవనంలో అర్జున కల్యాణం

 రివ్యూ: అశోకవనంలో అర్జున కల్యాణం


నటీనటులు: విశ్వక్‌సేన్‌, రుక్సార్‌ థిల్లాన్‌, రితికా నాయక్‌, కాదంబరి కిరణ్‌, వెన్నెల కిశోర్‌, గోపరాజు రమణ తదితరులు. 

కెమెరా: పవి.కె.పవన్‌

ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషదం

సంగీతం: జై క్రిష్‌

నిర్మాతలు:  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌–సుధీర్‌ ఈదర

దర్శకత్వం: విద్యాసాగర్‌ చింతా


‘ఫలక్‌నుమా దాస్‌’. ‘పాగల్‌’ చిత్రాలతో పాపులర్‌ అయ్యారు విశ్వక్‌సేన్‌. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఆయన తాజాగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రంలో నటించారు. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: 

33 ఏళ్ల అల్లం అర్జున్‌(విశ్వక్‌సేన్‌) సూర్యపేట్‌లో వడ్డీ వ్యాపారం చేసుకునే యువకుడు. వయసు ముదురు తుండడంతో పెళ్లి సంబంధాలు చూస్తారు పెద్దలు. తమ కులంలో అమ్మాయిలు లేరని ఆంధ్రాలో ఏలేశ్వరం గ్రామంలో మాధవి(రుక్సార్‌ థిల్లాన్‌)తో అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడానికి కుటుంబ సమేతంగా వెళతారు. ఆ తంతు నచ్చని బంధువులు అయిష్టంగానే నిశ్చితార్థానికి బయలుదేరతారు. తీరా అక్కడికి వెళ్లాక కరోనా కారణంగా జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ లాంటి నిబంధనలు అమలు కావడంతో వెళ్లిన వారంతా కొన్ని రోజులు అక్కడే ఉండిపోవల్సి వస్తుంది. అర్జున్‌కు, మాధవికి నిశ్చితార్థం తర్వాత ఏం జరిగింది. పెళ్లవుతుందా లేదా? సడెన్‌గా మాధవి కనిపించకపోవడానికి కారణాలేంటి? అన్నది మిగతా కథ. 

విశ్లేషణ: 

తమ కులంలో అమ్మాయిల కొరతతో ఇతర ప్రాంతంలో వేరే కులంలో సంబంధం కుదుర్చుకునే నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రస్తుతం సమాజంలో అదొక సమస్య అని దర్శకుడు చెప్పాలనుకున్నారు. దానికి చిన్న ఎమోషనల్‌డ్రామా అల్లి తెరకెక్కించారు. పెళ్లి చేసుకోవడానికి కులం అంతరం కాదు.. వధూవరుల మనసు, వారి జీవిత లక్ష్యాలు ముఖ్యం అని ఈ చిత్రంలో చెప్పారు. అయితే పెళ్లికి కులమే సమస్య అనుకున్నప్పుడు వేరే రాష్ట్రం వెళ్లి  ఇతర క్యాస్ట్‌ అమ్మాయిని చేసుకోబోతున్నట్లు చూపించారు. అదే పని తమ ప్రాంతంలో కూడా చేయవచ్చు. అలా చేయడానికి కారణం ఏంటనేది చూపించలేదు. సమాజంలో అమ్మాయిలు తగ్గిపోతున్నారని వారిని కాపాడుకోవాలని చెప్పడం బావుంది. అలాగే ఆడబిడ్డ పుడితే నేరం అన్నట్లు చూసే సమాజానికి మంచి సందేశం కూడా ఇచ్చారు. పెళ్లి అనేది సమాజం, బంధువులు, చుట్టు పక్కలవారి కోసం కాదని తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడానికి ఎంత కాలమైనా వేచి చూడవచ్చిని దర్శకుడు చెప్పారు. కథ థీమ్‌ బావున్నా... దానిని నడిపించిన తీరు ఆసక్తికరంగా లేదు. ఏం జరగబోతుందో వీక్షకుడి ఊహకు అందేలా ఉండడం, సన్నివేశాలు పేలవంగా ఉండడంతో  కథ తేలిపోయినట్లు అనిపిస్తుంది. ప్రారంభం నుంచి సాగదీతగా అనిపించింది. సెకెండాఫ్‌లో కాస్త వేగం అందుకొంది. ఇరు ప్రాంతాల భాష, యాసతో మొదలైన సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసరికి యాసను పక్కన పెట్టేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యం ఆకట్టుకున్నప్పటి ఇంతకుముందు విడుదలైన పలు చిత్రాల్లో సన్నివేశాలను గుర్తు చేశాయి. 


నటీనటుల పని తీరుకు వస్తే.. విశ్వక్‌సేన్‌ నటన సినిమాకు ప్లస్‌ అని చెప్పాలి. ఇప్పటి వరకూ తను చేసిన పాత్రలకు భిన్నంగా ఎంచుకున్నాడు. తన నటన, యాటిట్యూడ్‌ ఆకట్టుకున్నాయి. హీరోయిన్‌ రుక్సార్‌ థిల్లాన్‌ పాత్ర స్లోగా సాగింది. పరిధి మేరకు నటించింది. రితికా నాయక్‌ చలాకీతనంతో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ అంతా రితిక చుట్టూనే తిరిగింది. ఇతర పాత్రధారులు కేదార్‌ శంకర్‌, గోపరాజు రమణ, కాదంబరి కిరణ్‌ అలరించారు. అశోక్‌ సెల్వన్‌ అతిథిగా కనిపించారు. వెన్నెల కిశోర్‌ ఎమ్మెల్యేగా నవ్వించే ప్రయత్నం చేసినా వర్కవుట్‌ కాలేదు. దర్శకుడు రాసుకున్న కథతో కొత్తదనం లేదు.అక్కడక్కడా ఎమోషన్స్‌ ఆకట్టుకున్నాయి. కథలో బలం లేనప్పుడు, పాటలు, సినిమాకు కీలకమైన సన్నివేశాల మీదైనా దర్శకుడు దృష్టి పెట్టి ఉంటే సినిమా ఆసక్తికరంగా సాగేది.  కెమెరా పనితనం బావుంది. రెండు పాటలు ఆకట్టున్నాయి. కొన్ని చోట్ల బీజీఎమ్‌ బావుంది. ఎడిటర్‌ ఇంకాస్త వర్క్‌ చేసి ఉంటే సినిమా క్రిస్ప్‌గా ఉండేది. లాక్‌డౌన్‌కి ముందు రావలసిన చిత్రం ఇంత లేట్‌గా రావడం జనాలకు చూసిన సినిమాలాగే ఉందనే భావన కలగకపోదు. విశ్వక్‌సేన్‌ కొత్తగా కనిపించడం.. కొన్ని ఎమోషన్స్‌ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి కాబట్టి కాస్త ఓపికగా కూర్చుని చూడొచ్చు. 


ట్యాగ్‌లైన్‌: అశోక్‌ వనంలో.. సోసో అంతే!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International