
విశ్వక్సేన్ (Vishwaksen) హీరోగా, చింతా విద్యాసాగర్ తెరకెక్కించిన ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్ ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ (Ashokavanamlo Arjunakalyanam). రుక్సార్ థిల్లాన్ (Ruksar Thillon) కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లోకి వచ్చింది. సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ చెప్పుకోదగ్గ వసూళ్ళనే రాబట్టింది. 30 ఏళ్ళయినా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున్ కుమార్‌కు ఒక ఆంధ్రా అమ్మాయితో పెళ్ళి సెటిల్ అవుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా పెళ్లికూతురు ఇంట్లో చిక్కుకుపోతారు అర్జున్ కుమార్ కుటుంబం. ఆ నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనలతో అతడి పెళ్ళి డైలమాలో పడుతుంది. చవరికి అతడి పెళ్ళి ఎలా జరిగింది? అన్నదే ఈ సినిమా కథాంశం.
వర్తమాన పరిస్థితుల్ని కళ్ళకు కడుతూ పూర్తి కామెడీ ఎంటర్ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. రిత్వికా నాయక్, గోపరాజు రమణ, కాదంబరి కిరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికి 21 రోజులవుతుంది. అప్పుడే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసే సమయం ఆసన్నమైంది.
వచ్చేనెల 3వ తేదీన ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ చిత్రం ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. నిజానికి ఈ సినిమా ఇదే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని ఎప్పుడో వార్తలొచ్చాయి. అయితే చిత్ర బృందం ఈ విషయాన్ని ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ వార్తల్ని మీడియా ముఖంగా ఖండించారు. దయచేసి ఇలాంటి వార్తల్ని స్ప్రెడ్ చేయొద్దని మీడియాను వేడుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా అదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడం గమనార్హం. జూన్ 3వ తేదీన పలు చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేయబోతున్నాయి. మరి అదే రోజు ఓటీటీలో వస్తున్న ఈ సినిమాకి అక్కడ ఏ స్థాయిలో ఆదరణ దక్కుతుందో చూడాలి.