ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయటం లేదు?: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2022-01-02T18:52:33+05:30 IST

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. సీఎం జగన్ ‎ఎందుకు అమలు చేయటం లేదని..

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయటం లేదు?: అశోక్‌బాబు

అమరావతి: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. సీఎం జగన్ ‎ఎందుకు అమలు చేయటం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఆనాడు చెప్పి మూడేళ్లు కావొస్తున్నా ఎందుకు రద్దు చేయలేదని నిలదీశారు. పీఆర్సీ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఉద్యోగులను చర్చలకు పిలిచి ప్రతిసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పంపుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి చేతకాని పాలన వల్లే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందన్నారు. టీడీపీ హయాంలో ఆర్ధిక లోటు ఉన్నా.. చంద్రబాబు నాయుడు తెలంగాణా ఉద్యోగులతో సమానంగా 43 శాతం పిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. పిట్ మెంట్ 29 శాతం అడిగితే 43 శాతం పెంచిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. 


ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల  నుంచి 60 ఏళ్లకు పెంచారని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు 20 శాతం పెంపు, సమైక్యాoధ్ర ఉద్యమంలో 81 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లింపు.. 11వ పీఆర్సీ నివేదిక ఆలస్యమైనందుకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన ఘనత  చంద్రబాబుకే దక్కుతుందని అశోక్‌బాబు అన్నారు. ఆనాడు తీవ్రమైన ఆర్ధిక లోటులో ఉండి కూడా చంద్రబాబు ఉద్యోగులకు అన్ని విధాల మేలు చేశారన్నారు. జగన్ రెడ్డి ‎మాత్రం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారని అశోక్‌బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-01-02T18:52:33+05:30 IST