India vs Hong Kong: హాంకాంగ్ జట్టుపై టీమిండియా అలవోక విజయం.. వాళ్లిద్దరి వల్లే..

ABN , First Publish Date - 2022-09-01T04:47:15+05:30 IST

ఆసియా కప్‌లో టీమిండియా మరోసారి విజయ ఢంకా మోగించింది. పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత పసికూన హాంకాంగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో..

India vs Hong Kong: హాంకాంగ్ జట్టుపై టీమిండియా అలవోక విజయం.. వాళ్లిద్దరి వల్లే..

దుబాయ్: ఆసియా కప్‌లో టీమిండియా మరోసారి విజయ ఢంకా మోగించింది. పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత పసికూన హాంకాంగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హాంకాంగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో హాంకాంగ్ బౌలర్లకు చుక్కలు చూపించి 26 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ కూడా 44 బంతుల్లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు. 193 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది. బాబర్ హయత్ 41 పరుగులు, కించింత్ షా 30 పరుగులు, మెకెనీ 16 పరుగులు, జీషన్‌ అలీ 26 పరుగులు చేశారు.



టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, అవీష్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. హాంకాంగ్ జట్టు కెప్టెన్ నిజాకత్‌ ఖాన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌ సూపర్‌-4కు చేరింది. దాదాపుగా భారత్‌, పాక్‌ జాతీయులతో నిండి ఉన్న హాంకాంగ్‌ జట్టు రోహిత్‌సేనకు ఏవిధంగానూ పోటీ ఇవ్వలేకపోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ 98 పరుగుల భాగస్వామ్యం టీమిండియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

Updated Date - 2022-09-01T04:47:15+05:30 IST