Love Failure: లవ్‌లో ఫెయిలై యువతి ఆత్మహత్యాయత్నం.. అలా చేసినందుకు జరిమానా వేసిన దుబాయ్ కోర్టు

ABN , First Publish Date - 2022-08-10T17:25:59+05:30 IST

ప్రాణాల కన్న మిన్నగా ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.

Love Failure: లవ్‌లో ఫెయిలై యువతి ఆత్మహత్యాయత్నం.. అలా చేసినందుకు జరిమానా వేసిన దుబాయ్ కోర్టు

దుబాయ్: ప్రాణాలకన్న మిన్నగా ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ, భూమిపై నూకలుండడంతో ప్రాణాలతో బయటపడింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ విషయం కాస్తా న్యాయస్థానం వరకు వెళ్లడంతో యువతికి వెయ్యి దిర్హమ్స్( సుమారు రూ. 21వేలు) జరిమానా పడింది. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లో ఉంటున్న ఆసియాకు చెందిన 30 ఏళ్ల యువతి తనతో పాటు కలిసి పనిచేసే ఓ వ్యక్తిని ప్రేమించింది. అలా కొన్నిరోజులు వారిద్దరూ కలిసి బాగానే తిరిగారు. 


ఈ క్రమంలో ఆ వ్యక్తి మరో మహిళతో కలిసి తిరగడం ఆమె చూసింది. తాను ప్రేమించినవాడు మరో మహిళతో కలిసి తిరగడం చూసి మోసపోయానని ఆవేదనకు లోనైంది. ఇలా లవ్‌లో ఫెయిల్ కావడంతో చనిపోవాలనుకుంది. వెంటనే తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగు వాళ్లు హూటాహూటిన ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. గత నెలలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా యువతిని దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో అక్కడి చట్టాల ప్రకారం ఆత్మహత్యాయత్నం నేరమని యువతికి కోర్టు 1000 దిర్హమ్స్ (రూ.21,650) జరిమానా విధించింది.    


Updated Date - 2022-08-10T17:25:59+05:30 IST