Twitter ట్రెండింగ్‌లో ‘#AskKTR’.. ప్రశ్నలడిగిన ప్రముఖులు

ABN , First Publish Date - 2022-05-08T22:09:37+05:30 IST

కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ప్రశ్నల్లోనే కొందరు ప్రభుత్వంపై టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణక్యం ఠాగూర్, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌లతో పాటు పులువురు కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు..

Twitter ట్రెండింగ్‌లో ‘#AskKTR’.. ప్రశ్నలడిగిన ప్రముఖులు

హైదరాబాద్: తెలంగాణ IT & Muncipal మంత్రి కేటీఆర్ ‘#AskKTR’ అనే పేరుతో నెటిజెన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటారు. ట్విట్టర్ వేదికగా కొనసాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంటుంది. తెలంగాణ అంశాలతో పాటు ఇతర విషయాలపై నెటిజెన్లు ప్రశ్నలు అడుగుతుంటారు. తాజాగా ఆదివారం మరోసారి ‘#AskKTR’ తో ముందుకు వచ్చారు మంత్రి కేటీఆర్. కాగా ఇది ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్‌లో టాప్‌లో కొనసాగుతోంది. సాధారణ నెటిజెన్లతో పాటు పలువురు ప్రముఖులు సైతం కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగారు.


కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ప్రశ్నల్లోనే కొందరు ప్రభుత్వంపై టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణక్యం ఠాగూర్, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌లతో పాటు పులువురు కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు.

‘‘మిస్టర్ రామారావు.. మీ ఆస్తులు 2014 నుంచి 2018 మధ్య ఏడు కోట్ల రూపాయల నుంచి 41 కోట్ల రూపాయలకు పెరిగాయి. నాలుగేళ్లలో 400 శాతం మేర ఆస్తులు పెరిగాయి. ఆ సీక్రెట్ ఏంటో కాస్త చెప్పండి. అలాగే 2018 నుంచి 2023 వరకు ఎంత పెరగోచ్చో కాస్త చెప్పండి’’ అంటూ మాణిక్యం ఠాకూర్ ట్వీట్ చేశారు. దీనికి ‘లూట్ బై కోడూరు’ అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.

ఇక బీజేపీ నేత అరవింద్ స్పందిస్తూ.. ‘‘పీఎం ఫసల్ బీమా యోజనలో టీఎస్ ప్రభుత్వం తన వాటాను ఎందుకు చెల్లించడం లేదు? నాగరాజుకు టీఎస్ పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేదు?’’ అనే రెండు ప్రశ్నల్ని సంధించారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నయంటూ వచ్చిన వార్తా కథనాన్ని పోస్ట్ చేసి తెలంగాణ కాంగ్రెస్.. ‘‘మీ తండ్రి కేసీఆర్ మాట్లాడే అసభ్య భాషపై మీరేలా స్పందిస్తారు?’’ అని ప్రశ్నించారు.

ఇక తెలంగాణ అంశాలు.. క్రెకెట్, సినిమాల గురించి కేటీఆర్‌ను అనేక మంది ప్రశ్నిస్తున్నారు.


కొన్ని ట్వీట్లకు కేటీఆర్ స్పందిస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు. అందులో కొన్ని..

- గ్రూప్ వన్, పరీక్షలు ఉర్దూల కూడా రాయొచ్చంట ! ఉర్దూలో రాసేదెవరో, ఉర్దూని కరెక్షన్ చేశేదెవరో?

KTR: తెలుగు భాషలాగే ఉర్దూని అధికార భాషగా భారత రాజ్యాంగం గుర్తించింది. చాలా రాష్ట్రాలు ఉర్దూలో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి? దీంతో మీకు వచ్చిన సమస్య ఏంటి? దయచేసి తప్పుడు ప్రచారంలో పడొద్దు.

- తెలుగు సినిమా పరిశ్రమ కోసం హైదరాబాద్‌లో ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం అవసరం. దీనివల్ల హైదరాబాద్‌ భారతీయ సినిమా హడ్‌గా మారుతుంది. దీని కోసం ప్లాన్ చేయండి.

KTR: సీఎం ఆ పనిలో ఉన్నారు. కొవిడ్ వల్ల ఆ ప్లాన్లు ఆలసమయ్యాయి.

- గత ఎన్నికల్లో 10 లక్షల ఓట్లు మిస్సయ్యాయి. ప్రభుత్వం తరపున దీనిమీదేమైనా చర్యలు తీసుకుంటున్నారా?

KTR: ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులతో పని చేస్తాం.

- రాహుల్ గాంధీకి మీరిచ్చే సలహా ఏంటి?

KTR: ముందు ఆయనను తన ఇంట్లో (అమేథి) గెలవమనండి.

- హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించడం లేదు?

KTR: ఆ విషయాన్ని గంగూలీ, జై షాలను అడగాలి.

Read more