అడుగంటిన దద్దనాల

ABN , First Publish Date - 2022-06-24T05:39:28+05:30 IST

దద్దనాల.. బనగానపల్లె నియోజకవర్గంలోని ఒకే ఒక మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు.

అడుగంటిన దద్దనాల

నీరు లేక వెలవెలబోతున్న ప్రాజెక్టు 

రైతులకు అందని సాగు నీరు 


దద్దనాల.. బనగానపల్లె నియోజకవర్గంలోని ఒకే ఒక మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు. మండలంలోని పాతపాడు గ్రామం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని కింద ప్రత్యక్షంగా 1516 ఎకరాలకు, పరోక్షంగా బోర్ల ద్వారా పదివేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 20 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందుతోంది. అయితే గతంలో ఈ ప్రాజెక్టులోకి నీరు రాక ఒట్టిపోయేది. దీంతో అప్పటి  ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఎస్సార్బీసీ నీటి పంపింగ్‌కు నిధులు మంజూరు చేయించారు. 


బనగానపల్లె:


దద్దనాల ప్రాజెక్టుకు అప్పటి ముఖ్య మంత్రి నీలం సంజీవ రెడ్డి హయాంలో 1959లో శంకుస్థాపన చేశారు. పెండే కంటి వెంకటసుబ్బయ్య ఈ ప్రాజెక్టును పూర్తి చేయించారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.02 టీఎంసీలు. 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాంత ప్రజలు దీని నీటితో రెండుకార్లు పంటలు పండించుకొనేవారు. వర్షాభావం వల్ల దద్దనాల ప్రాజెక్టు ఓటి కుండలా మారిపోయేది. దీనికి తోడు ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద కొండలపై వచ్చే వర్షపు నీటికి అడ్డుకట్ట వేస్తూ పెద్ద చెక్‌డ్యాంను నిర్మించారు. దీంతో వర్షం నీరు చేరాల్సిన దద్దనాల ఎండిపోయేది. ఈ నేపథ్యంలో దద్దనాల ప్రాజెక్టుకు ఎస్సార్బీసీ నుంచి నీరు ఎత్తిపోసే పథకం పనులను మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పూర్తి చేయించారు. రూ.21.01 కోట్ల నాబార్దు ద్వారా నిధులతో 2018 మార్చి 3వ తేదీన భూమి పూజ చేసి పైపులైన్‌ పనులు 9నెలల్లో పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు వల్ల బనగానపల్లె, కోవెలకుంట్ల మండలంలోని పాతపాడు, బనగానపల్లె, యాగంటిపల్లె, మీరాపురం, సాధుకొట్టం, చిన్నరాజుపాలెం, పెద్దరాజుపాలెం, పసుపలతండా, యనకండ్ల, ఇల్లూరు కొత్తపేట, కాపులపల్లె, గులాంనబీపేట, అమడాల, బిజనవేముల తదితర 20 గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్య తీరింది. 


నిరుపయోగంగా దద్దనాల


అయితే దద్దనాల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఈ ఎత్తిపోతల పథకాన్ని అప్పగించారు. నిబంధనల ప్రకారం కోయా కంపెనీ మూడు సంవత్సరాల పాటు ఎత్తిపోతల పథకం నిర్వహణ పనులు చూసింది. అనంతరం ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు దద్దనాల ఎత్తిపోతల పథకాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విద్యుత్‌ బిల్లులు అధికంగా రావడం, ఆబిల్లులు సరిగా చెల్లించకపోవడంతో ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు ఈ పథకం నిర్వహణను పట్టించుకోలేదు. గత ఏప్రిల్‌ నెల వరకు గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఎస్సార్బీసీ ద్వారా నీరు పారింది. అయితే ఎత్తిపోతల ద్వారా నీటిని గత సీజన్‌లో ఏనాడు ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు పంపింగ్‌ చేసిన పాపాన పోలేదు. దీంతో దద్దనాల ప్రాజెక్టులో నీరు అడుగంటింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20 అడుగులకు కాగా ప్రస్తుతం కేవలం 9.5 అడుగుల వరకు మాత్రమే ఉంది. దీంతో రోజు రోజుకూ ప్రాజెక్టు చుట్టుపక్కల బోర్లలో భూగర్భ నీరు అడుగంటుతోంది. దీని వల్ల సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లలో నీరు అడుగంటడంతో 20 గ్రామాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిండుకుండలా ఉండాల్సిన దద్దనాల ప్రాజెక్టులో రోజు రోజుకూ అడుగంటిపోతోంది. గతంలో ఎస్సార్బీసీ ప్రవహించే సమయంలో ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాజెక్టుకు నీరు ఎందుకు మళ్లించలేదని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పాతపాడులో జరిగిన టీడీపీ గౌరవసభలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించారు. 


రైౖతులకు అప్పగించని ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు


 నిబంధనల ప్రకారం ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు రైతులకు ఈ ప్రాజెకు నిర్వహణను అప్పగించాలి. కానీ అధికారులు దాన్ని అమలు చేయలేదు. దీంతో ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారిందని విమర్శిస్తున్నారు. 

Updated Date - 2022-06-24T05:39:28+05:30 IST