ఆభరణాలు అపహరించిన మహిళల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-27T04:42:07+05:30 IST

ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలిని మాటల్లో పెట్టి బ్యాగుల్లో ఉన్న సుమారు రూ.10 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

ఆభరణాలు అపహరించిన మహిళల అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ చౌడేశ్వరి

రూ.10 లక్షల సొత్తు స్వాధీనం

నెల్లూరు(క్రైం), మే 26 : ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలిని మాటల్లో పెట్టి బ్యాగుల్లో ఉన్న సుమారు రూ.10 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏఎస్పీ (క్రైమ్‌) చౌడేశ్వరి గురువారం విలేకర్లకు నిందితుల వివరాలు వెల్లడించారు. సీతారామపురంకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీదేవి దంపతులు ఈ నెల 13వ తేదీన నెల్లూరుకు వచ్చి తిరిగి సీతారామపురం వెళ్లేందుకు ఉదయగిరికి చేరుకున్నారు. అక్కడి నుంచి సీతారామపురం బస్సు ఎక్కి డ్రైవర్‌ వెనుక సీటులో కూర్చున్నారు. ఈ క్రమంలో వాటర్‌ బాటిల్‌ కోసం వెంటేశ్వర్లు బస్సు దిగాడు. దీనిని గమనించిన అదే బస్సుల్లో ఉన్న ప్రకాశం జిల్లా ఈపురుపాలెంకు చెందిన సాతుపాటి నాగమ్మ, సునీతలు శ్రీదేవితో మాటలు కలిపి బ్యాగులో ఉన్న 200 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు. అది తెలియని బాధిత దంపతులు సీతారామపురంలో బస్సు దిగి చూసుకోగా బంగారం లేకపోవడంతో అక్కడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశాలతో అదనపు ఎస్పీ (క్రైమ్‌) చౌడేశ్వరి ఆధ్వర్యంలో ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్‌ఐ సిబ్బంది సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు మహిళలు గురువారం కావలి బస్టాండులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసింది తామేనని అంగీకరించడంతో వారి నుంచి రూ.10లక్షల విలువైన  ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను జిల్లా ఎస్పీ విజయరావు అభినందించారని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఉదయగిరి ఇన్‌స్పెక్టర్‌ గిరిబాబు, పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T04:42:07+05:30 IST