జీన్స్ ధరించి ఇయర్ ఫోన్స్ కొనేందుకు వచ్చిన యువతి.. దాడి చేసిన దుకాణ యజమాని

ABN , First Publish Date - 2021-11-01T21:22:55+05:30 IST

ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన యువతిపై ఓ సెల్‌ఫోన్ దుకాణదారు దాడిచేశాడు. ఆమెను దుకాణం

జీన్స్ ధరించి ఇయర్ ఫోన్స్ కొనేందుకు వచ్చిన యువతి.. దాడి చేసిన దుకాణ యజమాని

బిశ్వనాథ్ (అస్సాం): ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన యువతిపై ఓ సెల్‌ఫోన్ దుకాణదారు దాడిచేశాడు. ఆమెను దుకాణం నుంచి లాగిపడేసి అక్కడి నుంచి తరిమేశాడు. అస్సాంలోని బిశ్వనాథ్ చరియాలిలో జరిగిందీ ఘటన. దుకాణానికి వచ్చిన యువతి బురఖా కాకుండా జీన్స్ ధరించడమే ఈ ఘటనకు కారణం. ఆమెకు ఇయర్ ఫోన్స్ అమ్మేందుకు నిరాకరించడమే కాకుండా జీన్స్ ధరించినందుకు అవమానించాడు. ఆపై ఆమెను షాపు నుంచి బలవంతంగా బయటకు ఈడ్చి పడేశాడు.  


దుకాణానికి వచ్చిన యువతిని చూసిన యజమాని తొలుత ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. మరోసారి రావొద్దని హెచ్చరిస్తూనే బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇంట్లోనే ఆయన మొబైల్ ఫోన్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డుకోలేదని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. జీన్స్‌లో వస్తే అది తన కుటుంబంపై ప్రభావం చూపుతుందని, తన కోడలు బురఖా కానీ హిజాబ్ కానీ ధరిస్తుందని చెప్పాడని ఆమె తెలిపింది. 


అవమాన భారంతో ఇంటికి చేరుకున్న యువతి జరిగిన ఘటన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇది విన్న ఆమె తండ్రి అతడిని నిలదీసేందుకు వెళ్లగా ఆయనపైనా అతడు దాడిచేశాడు. దుకాణదారు ఇద్దరు కుమారులు తన తండ్రితో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేశారని బాధిత యువతి ఆరోపించింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2021-11-01T21:22:55+05:30 IST