Assam: పెరుగుతున్న ధరలపై నిరసన... శివుని పాత్రధారి అరెస్ట్...

ABN , First Publish Date - 2022-07-10T21:52:37+05:30 IST

ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేసేందుకు శివపార్వతుల (Lord Shiva and

Assam: పెరుగుతున్న ధరలపై నిరసన... శివుని పాత్రధారి అరెస్ట్...

న్యూఢిల్లీ : ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేసేందుకు శివపార్వతుల (Lord Shiva and Goddess Parvati Devi) పాత్రలు ధరించిన వ్యక్తులపై అస్సాంలోని నాగావూన్ పట్టణంలో కేసు నమోదైంది. మహా శివుని పాత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ (Bajrang Dal) ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. 


సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనోజ్ రాజ్‌వంశ్ మాట్లాడుతూ, మహా శివుని పాత్ర ధరించి, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. పార్వతీ దేవి పాత్రను ధరించిన వ్యక్తితోపాటు మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 


నిరుద్యోగం (Unemployment), ధరల పెరుగుదల (Rising Price) వల్ల ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులను తెలియజేస్తూ, నిరసన తెలిపేందుకు వీరు పార్వతీ దేవి, మహాశివుని పాత్రలను ధరించారు. వీరిద్దరూ శనివారం రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిల్‌పై నాగావూన్ పట్టణంలో తిరిగారు. వీరు పార్వతీపరమేశ్వరులను కించపరిచారని, ఇటువంటి పనులు చేయడానికి ఎవరికీ స్వేచ్ఛ లేదని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నేతలతోపాటు మరికొందరు సాధారణ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


విశ్వహిందూ పరిషత్ నాగావూన్ శాఖ కార్యదర్శి ప్రదీప్ శర్మ (Pradeep Sharma) మాట్లాడుతూ, తాము ఉదారంగా వ్యవహరిస్తామన్నారు. అయితే తమ స్వభావాన్ని ఎవరూ తమకు అనుకూలంగా మలచుకోరాదని చెప్పారు. నిరసన తెలియజేయడాన్ని తాము వ్యతిరేకించబోమన్నారు. కానీ తమ దేవీదేవతల పేర్లను ఎందుకు వాడుకోవాలని, వారిని ఎందుకు కించపరచాలని ప్రశ్నించారు. 


నాగావూన్ పోలీసు సూపరింటెండెంట్ లీనా డోలే మాట్లాడుతూ, అరెస్టయిన నిందితునికి కోర్టు బెయిలు మంజూరు చేసిందని చెప్పారు. 


Updated Date - 2022-07-10T21:52:37+05:30 IST