
గౌహతి : అసోం రాష్ట్రంతోపాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడంతో అసోం పోలీసులు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. అసోం రాష్ట్రంతోపాటు దేశంలోని పలు ఇతర ప్రాంతాల్లో పాకిస్తాన్ గూఢచారి ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఉగ్ర దాడులకు ప్రణాళిక రూపొందించినట్లు కేంద్ర నిఘావర్గాలు రహస్య సమాచారం అందించాయి.ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల సమావేశాలు, సైనిక ప్రాంతాలు, సామూహిక సమావేశాలు, మతపరమైన ప్రదేశాలను ఐఎస్‌ఐ లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి.
దీంతో అస్సాం పోలీసు ప్రధాన కార్యాలయం అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముందస్తు హెచ్చరిక సర్క్యులర్ జారీ చేశారు.పాక్ ఐఎస్ఐ బాంబులు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశముందని నిఘా సంస్థలు తెలిపాయి. కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని జమ్మూ కశ్మీరులో దాడులకు ప్లాన్ చేయడానికి పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలతో రహస్య సమావేశం నిర్వహించిందని నిఘావర్గాలకు సమాచారం అందింది. అల్ ఖైదా వీడియో సందేశంలో అసోంలో జిహాద్ కోసం పిలుపునిచ్చింది.గౌహతి నగరంతోపాటు అసోంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉగ్రదాడులను తిప్పికొట్టాలని అసోం డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అసోం రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించిన డీజీపీ పోలీసులను సమాయత్తం చేశారు.