సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-13T08:59:28+05:30 IST

భారత సంతతికి చెందిన వివాదాస్పద నవలా రచయిత సల్మాన్‌ రష్దీపై అమెరికాలో హత్యాయత్నం జరిగింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై న్యూయార్క్‌ సమీపంలోని ఓ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో...

సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం

న్యూయార్క్‌లో కత్తితో దుండగుడి దాడి.. సెకన్ల వ్యవధిలో మెడపై 15 కత్తిపోట్లు

హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలింపు.. పోలీసుల అదుపులో నిందితుడు

1988లో రష్దీ రాసిన శటానిక్‌ వర్సెస్‌ పుస్తకం వివాదాస్పదం.. ఇరాన్‌ ఫత్వా

చంపితే 3మిలియన్‌ డాలర్లు బహుమతి.. 33ఏళ్ల క్రితం ఇరాన్‌ నేత ఖమైనీ ప్రకటన

ఇస్లాంను విమర్శిస్తే దాడులు తప్పవని.. మళ్లీ నిరూపణ అయింది: తస్లీమా నస్రీన్‌


న్యూయార్క్‌, ఆగస్టు 12: భారత సంతతికి చెందిన వివాదాస్పద నవలా రచయిత సల్మాన్‌ రష్దీపై అమెరికాలో హత్యాయత్నం జరిగింది. భావ ప్రకటనా స్వేచ్ఛపై న్యూయార్క్‌ సమీపంలోని ఓ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో... రష్దీ ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా దుండగుడు వేదికపైకి ఎక్కి కత్తితో దాడికి తెగబడ్డాడు. సెకన్ల వ్యవధిలోనే 10-15 కత్తిపోట్లు వేయడంతో రష్దీ అక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడుగులో ఉన్న ఆయనను వెంటనే హెలికాప్టర్‌ సాయంతో ఆసుపత్రికి తరలించారు. రష్దీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ‘ప్రవాస రచయితలకు, కళాకారులకు ఆమెరికా ఆశ్రయం: భావ ప్రకటనా స్వేచ్ఛకు నిలయం’ అన్న అంశంపై జరుగుతున్న సెమినార్‌లోనే రష్దీపై హత్యాయత్నం జరగడం గమనార్హం. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.30గంటల సమయం లో ఈ దాడి జరిగింది. రష్దీ పక్కనే ఉన్న మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వేదికపై ఉన్నవారే ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 


1947లో ముంబైలో జననం

సల్మాన్‌ రష్దీ వయసు 75 ఏళ్లు. 1947లో ముంబైలో జన్మించారు. బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఆయనకు బ్రిటన్‌ పౌరసత్వం ఉంది. 20 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. రష్దీ రాసిన మొదటి నవల గ్రైమస్‌. 1975లో  ప్రచురితమైంది. 1981లో రాసిన మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌ పుస్తకానికి ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ వచ్చింది. ద శటానిక్‌ వర్సెస్‌ ఆయన నాలుగో పుస్తకం. ఆయన మొత్తం 14 నవలలు రాశారు. ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకొన్నారు. 




9 ఏళ్లు అజ్ఞాతంలోకి

సల్మాన్‌ రష్దీ 1988లో రాసిన ‘ద శటానిక్‌ వర్సెస్‌’ పుస్తకం తీవ్ర వివాదాస్పదమైంది. సంచలనం సృష్టించింది. ముస్లిం మతపండితులు ఈ పుస్తకాన్ని దైవ దూషణగా అభివర్ణించారు. ఇది ఆయన మూడో నవల. ఈ పుస్తకాన్ని రాసినందుకు ఆయనను చంపేస్తామని ఎంతో మంది బెదిరించారు. ఇరాన్‌ ప్రభుత్వం 1988లోనే శటానిక్‌ వర్సెస్‌ పుస్తకంపై నిషేధం విధించింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ 1989లో రష్దీపై ఫత్వా జారీ చేశారు. రష్దీని చంపినవాళ్లకు 3 మిలియన్‌ డాలర్లు(ప్రస్తుత విలువ ప్రకారం రూ.23.88 కోట్లు) ఇస్తామని ప్రకటించారు. రష్దీని చంపినవాళ్లకు నగదు బహుమతి ఇస్తామని అప్పట్లో వేరే ముస్లిం మత సంస్థలు కూడా ప్రకటించాయి. ఈ పుస్తకం వల్ల వచ్చిన బెదిరింపులతో ఆయన తొమ్మిదేళ్ల పాటు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.


నాకు ఆందోళనగా ఉంది: తస్లీమా నస్రీన్‌

ఇస్లాంను ఎవరు వ్యతిరేకించినా వాళ్లపై దాడులు జరుగుతాయని ఈ ఘటన నిరూపించిందని బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ అన్నారు. రష్దీ అమెరికాలో ఉంటున్నారని, అందుకే ఆయనపై దాడిని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ‘న్యూయార్క్‌లో సల్మాన్‌ రష్దీపై దాడి జరిగిందని తెలిసింది. షాక్‌ అయ్యాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇస్లాంను ఎవరు విమర్శించినా వాళ్లపై దాడి జరుగుతోంది. నాకు ఆందోళనగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతపై తస్లీమా నస్రీన్‌ ‘లజ్జ’ పేరుతో పుస్తకం రాశారు. దీనిపై బంగ్లాదేశ్‌ నిషేధం విధించింది. ఆమెను దేశం నుంచి బహిష్కరించింది. ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉంటున్నారు.

Updated Date - 2022-08-13T08:59:28+05:30 IST