అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా?.. ఎమ్మెల్యేలకు నచ్చచెబుతున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2022-02-26T22:13:09+05:30 IST

త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా? అనే దానిపై టీడీపీలో చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా?.. ఎమ్మెల్యేలకు నచ్చచెబుతున్న చంద్రబాబు

అమరావతి: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా? అనే దానిపై టీడీపీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చంద్రబాబు ఆధ్వర్యంలో రెండు రోజులుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే తన సతీమణిని అసెంబ్లీలో దూషించడంతో భోరున విలపించడమే కాకుండా తిరిగి సీఎంగానే సభకు వస్తానని, అప్పటివరకు సభలో అడుగుపెట్టనని శపథం చేశారు. చంద్రబాబు బాటలోనే అసెంబ్లీ వెళ్లమని మెజార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని చంద్రబాబు సూచిస్తున్నారు. త్వరలో జరుగనున్న టీడీఎల్పీ సమావేశంలో అసెంబ్లీకి వెళ్లాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా.. ఆయన తరపున పార్టీ అసెంబ్లీలో పోరాడిందని చంద్రబాబు గుర్తుచేశారు. 


కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వివరించారు. సభకు వెళ్లినా మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, పైగా కెమెరాల్లో తమను చూపించడం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వివరించారని చెబుతున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు చంద్రబాబుతో కలిపి మొత్తం 23 మంది ఉన్నారు. అయితే మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పార్టీకి రాజీనామా చేయకపోయినా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఇక మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటీకే చంద్రబాబు అసెంబ్లీకి రానని చెప్పేశారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన షెడ్యూల్‌ను బట్టి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు పోను 16 మంది ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 


ఇప్పటికే టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ కట్ చేయాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సూచించింది. ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం లేదని టీడీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.. 5 నుంచి 10 మంది ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడిన విషయాన్ని అధినేత గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి నివాళి అర్పించిన అనంతరం సభను వాయిదా వేస్తారు. మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అయితే అసెంబ్లీలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడుతారనే దానితో పాటు ఇతర అంశాలపై ఇంకా షెడ్యూల్ ఖారారు కాలేదు. సమావేశాల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి రాలేదు. ఒకవేళ 7వ తేదీ నుంచి ప్రారంభిస్తే.. నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. 

Updated Date - 2022-02-26T22:13:09+05:30 IST