అసైన్డ్‌.. అన్యాక్రాంతం..!

ABN , First Publish Date - 2021-05-10T05:35:08+05:30 IST

అసైన్డ్‌.. అన్యాక్రాంతం..!

అసైన్డ్‌.. అన్యాక్రాంతం..!

చేతులు మారిన వేలాది ఎకరాల భూమి 

2018లో జీవోతో హక్కులు పొందిన భూస్వాములు

నిబంధనలు గాలికొదిలేసిన రెవెన్యూ యంత్రాంగం

సత్తుపల్లి, మే 9:ప్రస్తుతం రాష్ట్రంలో అసైన్మెంట్‌ భూము ల ఆక్రమణ, కొనుగోళ్లు అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదే అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూముల వ్యవహారాన్ని మాత్రం ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.గతంలో ఉన్న పలు ప్రభుత్వాలు భూమి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకునేందుకు భూములను పంపిణీ చేసింది.కానీ కాలక్రమంలో ఆ అసైన్డ్‌ భూము లన్నీ ప్రస్తుతం ఇతరుల చేతుల్లోకి మారిపోయాయి. రెవె న్యూ చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని కొందరు అడ్డంగా భూములను సొంతం చేసుకున్నారు. దీనికి కొంద రు రెవెన్యూ అధికారులు కూడా తమవంతు సహకారం అందించటంతో అసైన్మెంట్‌ భూములు పరాధీనమయ్యా యి. అసైన్మెంట్‌ భూములు ఆక్రమించారంటూ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్న క్రమంలో అన్నిజిల్లాల్లో ఈ దిశగా చర్యలు ఉంటా యా? లేదా? అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. 

ఆ భూముల క్రయ విక్రయాలు నిషేధం..

భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన వ్యవసాయ భూముల క్రయ విక్రయాలను మొదట్లో ప్రభుత్వం నిషేధించింది. దీనికోసం ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్టు -1977 చట్టాన్ని కూడా రూపొందించింది. ఈ చట్టం మేరకు గతంతో భూ క్రయ విక్రయాలు, ఆక్రమణలు జరిగినా కొనుగోలు చేసిన వారి పేరుతో రికార్డుల్లో అమలయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఎవరైనా అసైన్డ్‌ భూములు అమ్మినట్లు రెవెన్యూ అధికారులు దృష్టికి వస్తే  కొనుగోలు చేసిన వారు నిబంధనల మేరకు భూమి లేని నిరుపేదలు అయి ఉంటే వారి పేరుతో మార్పు చేసే అవకాశం ఉండేది. లేకుంటే సదరు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.

యంత్రాంగానిది ప్రేక్షక పాత్రే..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాలను ప్రభుత్వం పేదలకు వ్యవసాయ భూములను పంపిణీ చేసింది. కొన్ని మండలాల్లో పేదల భూములు అభివద్ది చేసుకునేందుకు రుణ సదుపాయం అప్పట్లో కల్పించారు. సాగునీటి వసతి కల్పనలో భాగంగా సాగునీటి బావులు తవ్వించారు. వ్యవసాయ బోర్లు కూడా తవ్వి విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. మొదట్లో కొన్నేళ్ల వరకూ అంతా సవ్యంగా సాగినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన వ్యవసాయ భూములు చేతులు మారుతూ వచ్చాయి. అయినా రెవెన్యూ యంత్రాంగం మాత్రం ప్రేక్షక పాత్ర పోషించిందనే విమర్శలున్నాయి. 1977కు పూర్వం చట్టం అమల్లోకి రాకముందు అస్సైన్‌మెంట్‌ భూములు క్రయ,విక్రయాలు జరిగేవి. వీటిని అప్పట్లో అనుమతించారు. దీనిని ఆసరా చేసుకొని కొందరు రైతులు ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో అస్సైన్‌మెంట్‌ భూములు 1977కు పూర్వం కొనుగోలు చేసినట్లు చూపి బదలాయింపులు చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. 

2018 జీవోతో అంతా గందరగోళం....

అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారి పేరుతో భూ బదలాయింపులు చేయాలంటూ ప్రభుత్వం మెమోను 4233 నెంబరుతో ప్రభుత్వం 2018 మార్చి 19న జారీ చేసింది. అప్పట్లో జారీ చేసిన మోమోను అడ్డం పెట్టుకొని కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా భూస్వాములు, అర్హత లేని వారికి కూడా వేలాది ఎకరాలు బదలాయించారని ఆరోపణలున్నాయి. వారికి హక్కులు కల్పించారు. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారు నిబంధనలకు లోబడి నిరుపేదలై ఉంటే కొనుగోల చేసిన వారికి రీ అసైన్‌ చేయాలని మోమోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో అసైన్డ్‌ రివ్యూ కమిటీల ముందు ఉంచి అమోదం పొంది రీ అసైన్‌ చేయాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అసైన్‌మెంట్‌ కమిటీల నియామకం జరగలేదు. దీంతో జిల్లా కలెక్టర్ల అమోదంతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 2018లో జారీ అయిన మోమోను ఖమ్మం జిల్లాలో మాత్రమే అమలు చేసి వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములు రీ అసైన్‌ చేసినట్టు ఆరోపణలున్నాయి.

భూ స్వాములకు అసైన్డ్‌ భూములు.. 

అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన భూస్వాములు, రాజకీయ నాయకులు రీ అసైన్‌ చేయించుకున్నారనే ఆరోపణలు న్నా దీనిపై యంత్రాంగం ఇప్పటివరకూ స్పందించిన దాఖలాలు లేవు. సాధారణంగా భూమిలేని నిరుపేదలు అసైన్డ్‌ భూములు కొనుగోలు చేస్తే వారికి మాత్రమే రీ అసైన్‌ చేసే అవకాశం ఉన్నా మోమోలో ప్రభుత్వం గుడ్‌ ఫెయిత్‌తో చేయాలనే పదం వాడటంతో దీనిని అడ్డం పెట్టుకొని రెవె న్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. కొందరికి ఐదు నుంచి పదెకరాల భూమి ఉన్నా ఆయా కుటుంబాల వారికి అసైన్డ్‌ భూములు రీ అసైన్‌ చేసిన సంఘటనలు సత్తుపల్లి, వేంసూరు ఇతర మండలాల్లో జరిగాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. సత్తుపల్లి మండలం కొమ్మేపల్లిలో పెద్ద మొత్తంలో భూములు కలిగిన వారికి అసైన్‌మెంట్‌ భూములను హక్కులు కల్పించారనే ఆరోపణలున్నాయి. ఇదే రెవెన్యూలో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి పదవీ విరమణ చేసిన కుటుంబాలకు అసైన్‌మెంట్‌ భూములు కట్టబెట్టారనే ఆరోపణలు, ఫిర్యాదులున్నా పట్టించుకునే దిక్కే లేదు. 

ఆంధ్రా వారికి రీ అసైన్‌..

అసైన్‌మెంట్‌ భూములను రీ అసైన్‌ చేయవచ్చంటూ 2018లో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన క్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఆంఽధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఇక్కడి అసైన్‌మెంట్‌ భూములు హక్కులు పొందారనే విమర్శలున్నాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో అసైన్డ్‌ భూములకు సంబంధించి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతంపల్లికి చెందిన వారికి నిబంధనలకు విరుద్ధంగా హక్కులు కల్పించారు. వాస్తవంగా సదరు వ్యక్తులకు పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ భూములున్నాయని చెబుతున్నారు. అక్కడి వారికి అసైన్‌మెంట్‌ భూములపై హక్కులు కల్పించటం చూస్తూ రెవెన్యూ యంత్రాంగం ఎంత ‘గుడ్‌ఫెయిత్‌’తో పని చేసిందో స్పష్టమవుతోంది. 

విచారణ జరిపితే వెలుగులోకి అక్రమాలు..

అసైన్డ్‌ భూములకు సంబంధించి ప్రతీ రెవెన్యూ గ్రామంలో ఎంత భూమి పంపిణీ జరిగింది. వాస్తవంగా ఆ భూములు అర్హులే అనుభవిస్తున్నారా? కొనుగోలు చేసిన వారు భూమి లేని వారా? అనే విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సి ఉంది. 2018లో జారీ అయిన మోమో ప్రకారం పలు చోట్ల జరిగి రీ అసైన్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అసైన్‌మెంట్‌ భూముల వ్యవహారంపై ప్రస్తుతం ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసైన్‌మెంట్‌ భూముల బదలాయింపులపై చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-05-10T05:35:08+05:30 IST