రాజద్రోహం మినహా ఇతర సెక్షన్లపైదర్యాప్తునకు సహకరించాల్సిందే

ABN , First Publish Date - 2022-06-30T10:27:12+05:30 IST

సీఐడీ నమోదు చేసిన కేసులో రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) మినహా ఇతర సెక్షన్ల విషయంలో దర్యాప్తునకు సహకరించాల్సిందేనని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు హైకోర్టు స్పష్టం చేసింది.

రాజద్రోహం మినహా ఇతర సెక్షన్లపైదర్యాప్తునకు సహకరించాల్సిందే

  • వైసీపీ ఎంపీ రఘురామకు హైకోర్టు స్పష్టీకరణ
  • హైదరాబాద్‌ దిల్‌కుషా గెస్ట్‌హౌ్‌సలో ప్రశ్నించండి
  • గది బయట సెక్యూరిటీ సిబ్బందిని అనుమతించాలి
  • లాయర్‌ సమక్షంలోనే విచారణ.. వీడియో తీయాలి
  • దర్యాప్తు ముగిసినా చార్జిషీటు వేయొద్దు
  • ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు.. సీఐడీకి హెచ్చరిక


అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సీఐడీ నమోదు చేసిన కేసులో రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ) మినహా ఇతర సెక్షన్ల విషయంలో దర్యాప్తునకు సహకరించాల్సిందేనని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ పేరుతో పిలిచి సీఐడీ హానితలపెట్టే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని దిల్‌కుషా ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన్ను విచారించేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా కేసులోని ఇతర నిందితులతో కలిపి ఎంపీని ప్రశ్నించాలని సీఐడీ భావిస్తే కనీసం 15 రోజులు ముందు నోటీసులివ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. పిటిషనర్‌ ఎంచుకున్న న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని  స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే మాత్రమే విచారించాలని తేల్చిచెప్పింది. పిటిషనర్‌ హృద్రోగి అయినందున దర్యాప్తు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. పిటిషనర్‌కు వై కేటగిరీ భద్రత ఉన్న నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నించే గది బయట సెక్యూరిటీ సిబ్బందిని అనుమతించాలని.. కేసుకు సంబంధించిన అంశాలు తప్ప ఇతర విషయాల గురించి ప్రశ్నించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 


పిటిషనర్‌ ఎఫ్‌ఐఆర్‌ చెల్లుబాటునే సవాల్‌ చేస్తున్నందున.. ఈ కేసు దర్యాప్తు ముగిసినప్పటికీ చార్జిషీటు దాఖలు చేయొద్దని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని.. సంబంధిత అధికారుల చట్టపరంగా చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాజద్రోహంతో పాటు 153ఏ, 505, 120బీ సెక్షన్ల కింద సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రఘురామరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా.. ఎంపీని ఆన్‌లైన్‌ ద్వారా విచారించడం సాధ్యమేనా.. అలా కుదరని పక్షంలో నేరుగా విచారించేందుకు సురక్షితమైన ప్రదేశం సూచించాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. ఆన్‌లైన్‌ ద్వారా విచారణ జరిపితే దర్యాప్తు ప్రక్రియ దెబ్బతింటుందన్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లి విచారణ జరపడం ఖర్చుతో కూడిన వ్యవహారమని.. సీఐడీ కార్యాలయంలో విచారించేందుకు అనుమతించాలని కోరారు. విచారణ ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తామన్నారు. న్యాయవాది సమక్షంలో విచారించేందుకు అభ్యంతరం లేదని, భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ.. హోటల్లో విచారించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ప్రైవేటు స్థలంలో విచారణ సాధ్యపడదని స్పష్టం చేశారు. పిటిషనర్‌ ఆందోళన దృష్టిలో పెట్టుకునే.. ఉభయపక్షాలకూ ఆమోదయోగ్యమైన సురక్షిత ప్రాంతాన్ని సూచించాలని గత విచారణ సందర్భంగా ఆదేశాలిచ్చామని గుర్తుచేశారు. పిటిషనర్‌ను ప్రశ్నించేందుకు తగిన ప్రాంతాలను సూచించాలని సీఐడీని ఆదేశించారు.


ఆ సెక్షన్లు రఘురామకు వర్తించవు..

ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రాజద్రోహం సెక్షన్‌ అమలును సుప్రీంకోర్టు నిలుపుదల చేసిందన్నారు. సీఐడీ నమోదు చేసిన 153ఏ, 505, 120బీ సెక్షన్లు పిటిషనర్‌కు వర్తించవని తెలిపారు . రెండు మతాలు, కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా పిటిషనర్‌ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని.. ప్రభుత్వం ఒక కులానికి, మతానికి మాత్రమే మేలు చేస్తుందని విమర్శించారని పేర్కొన్నారు. ఈ నేపఽథ్యంలో సీఐడీ నమోదు చేసిన ఇతర సెక్షన్లు పిటిషనర్‌కు వర్తించవన్నారు.  న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ విషయాలను తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. రాజద్రోహం మినహా ఇతర సెక్షన్లపై దర్యాప్తు కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపఽథ్యంలో విచారణ నిమిత్తం ఇరువురికి ఆమోదయోగ్యమైన ప్రదేశాన్ని సూచించాలని సీఐడీకి సూచిస్తూ విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేశారు. తిరిగి విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వ న్యాయవాది వివేకానంద స్పందిస్తూ.. హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌ లేదా మసాబ్‌ ట్యాంక్‌  పోలీస్‌ మెస్‌లో పిటిషనర్‌ను విచారించేందుకు సిద్ధమని తెలిపారు. 


పిటిషనర్ల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గెస్ట్‌ హౌస్‌లో అయితే తమకు అభ్యంతరం లేదన్నారు. పిటిషనర్‌ను గతంలో సీఐడీ అధికారులు విచారణ పేరుతో పిలిపించి చిత్రహింసలకు గురిచేశారని, ఆ విషయాన్ని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు కూడా నిర్ధారించారని న్యాయమూర్తి గుర్తుచేశారు. ‘విచారణ పేరుతో పిలిచి సీఐడీ అధికారులు హాని తలపెట్టవచ్చని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులో నిజాలు రాబట్టాలంటే పిటిషనర్‌తో పాటు ఇతర నిందితులను ప్రత్యక్షంగా విచారించాల్సిందేనని సీఐడీ చెబుతోంది. అందుచేత ఇద్దరికీ ఆమోదయోగ్యమైన సురక్షిత ప్రాంతంలో విచారణ జరగాలని భావిస్తున్నాం. హైదరాబాద్‌లోని దిల్‌కుషా ప్రభుత్వ అతిథిగృహంలో ఎంపీని ప్రశ్నించేందుకు సీఐడీకి అనుమతి ఇస్తున్నాం’ అని తెలిపారు.

Updated Date - 2022-06-30T10:27:12+05:30 IST