AP: సీఎంవోనా మజాకానా?

ABN , First Publish Date - 2021-10-07T13:56:40+05:30 IST

అవన్నీ అక్రమ నియామకాలు.. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఇచ్చేసిన పోస్టింగులు. కనీసం కావలసిన చదువు, అర్హత లేకున్నా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఇచ్చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవు.. విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అంగీకారమూ..

AP: సీఎంవోనా మజాకానా?

ఎస్‌కే వర్సిటీలో అక్రమాలన్నీ సక్రమమే!!

నిబంధనలకు తూట్లు పొడిచి నాడు నియామకాలు

తాజాగా పోస్టులన్నీ సక్రమం చేసేయాలని సీఎం కార్యాలయం నిర్ణయం!

చదువు, అర్హతలు లేకున్నా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టింగులు

తప్పుబట్టిన కమిటీ.. నాటి వీసీ కుసుమకుమారి తొలగింపు

కోర్టుకెళ్లిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.. వైఖరి చెప్పని సర్కారు

ఆ పోస్టులన్నీ సక్రమం చేసేయాలని సీఎంవో నిర్ణయం!

ఆర్థిక శాఖ పరిశీలనలో ఫైలు.. నేడో రేపో ఉత్తర్వులు?


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అవన్నీ అక్రమ నియామకాలు.. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఇచ్చేసిన పోస్టింగులు. కనీసం కావలసిన చదువు, అర్హత లేకున్నా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఇచ్చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవు.. విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అంగీకారమూ లేదు. అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని ఫైలు వస్తే.. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) రివర్స్‌ నిర్ణయం తీసుకుంది. వాటన్నిటినీ సక్రమం చేయాలని నిర్ణయించిందని.. నేడో రేపో జీవో కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది.


ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించి 2008లో జీవో 299 ద్వారా 48 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులిచ్చారు. అందులో పేర్కొన్న పోస్టులను వివిధ విశ్వవిద్యాలయాలను నిబంధనల ప్రకారం భర్తీచేయాలి. అయితే ఆ జీవోకు విరుద్ధంగా అనుమతి లేని ఆరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం భర్తీ చేసేసింది. సదరు విశ్వవిద్యాలయానికి నాటి వైస్‌ చాన్స్‌లర్‌గా ఉన్న కుసుమకుమారి నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేసేశారని ఆరోపణలొచ్చాయి. మరోవైపు పోస్టుల భర్తీకి యూనివర్సిటీ ఎగ్యిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) ఆమోదం ఉండాలి. అది కూడా లేకుండా నియామకాలు చేపట్టారు.


పోస్టుల భర్తీకోసం ఏర్పాటుచేసిన సెలెక్షన్‌ కమిటీ విషయంలోను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ కమిటీలో చాన్స్‌లర్‌.. అంటే గవర్నర్‌ నామినేట్‌ చేసిన వ్యక్తి కూడా ఉండాలి. కానీ అలా చేయకుండానే ఇష్టారాజ్యంగా కమిటీ సభ్యలను నియమించారు. ఒక ఉద్యోగానికి ప్రకటన ఇచ్చినప్పుడు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇస్తారు. ఆ తేదీనాటికే వారు ఆ అర్హతలు కలిగి ఉండాలి. కానీ నాటి నియామకాల్లో ఈ నిబంధనను కూడా ఉల్లంఘించారు. అప్పట్లో ఇచ్చిన  పోస్టుల నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసేందుకు 2009 మార్చి 13ని చివరి తేదీగా ప్రకటించారు. కానీ బి.త్రివేణి అనే ఆమెకు ఆ సమయానికి సదరు ఉద్యోగానికి కావలసిన పీహెచ్‌డీ లేదు. ఆమెకు ఆ ఏడాది ఆగస్టు 22న పీహెచ్‌డీ పట్టా వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబరు 16న ఆమెను ఇంటర్వ్యూకు పిలిచి ఎంపికచేసేశారు. వెంకటలక్ష్మమ్మ అనే అభ్యర్థిని విషయంలోనూ ఇలాగే జరిగింది. 


అర్హత లేకున్నా..

పి.దేవరాజు అనే వ్యక్తి ఎంబీఏ ఆర్ట్స్‌ గ్రూపు చదివారు. పీహెచ్‌డీ కూడా చేశారు. అయితే అర్హతలు లేకున్నా ఆయన్ను కంప్యూటర్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఎంపికచేసి ఇచ్చేశారు. ఆ పోస్టు ఇవ్వాలంటే ఎంఎ్‌ససీ కంప్యూటర్‌ సైన్స్‌, ఎంసీఏలలో ఏదో ఒకటి చదివి ఉండాలన్న నిబంధన ను తుంగలో తొక్కారు. సెలెక్షన్‌ కమిటీలో కావలసిన వారినే వేసుకుని.. ఇంతటి దారుణమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అన్నిటినీ మించి.. ఎంపికైనవారికి పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు ఈసీ ఆమోదం తీసుకోవాలి. కానీ అలాంటి ఆమోదం ఏమీ లేకుండానే పోస్టింగ్‌లు ఇచ్చేశారు. ఈసీ ఆమోదం పొందాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే ఈసీ ఆమోదం లేకుండా పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. కానీ ఆ ఉత్తర్వులకు ఈసీ ఆమోదం పొందాల్సి ఉందంటూ చల్లగా చెప్పారు. 


ప్రభుత్వం ఈ వ్యవహారంపై హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ హనుమంతప్పతో కమిటీ వేసింది.  ఉల్లంఘనలు జరిగాయని ఆ కమిటీ తేల్చింది. దీంతో నాటి వీసీ కుసుమకుమారిని తొలగించారు. నాడు అక్రమంగా నియమితులైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల విషయంలో హైకోర్టులో ఇప్పటికీ కేసు నడుస్తోంది. తమ పోస్టింగులు సరైనవేనంటూ తీర్పివ్వాలని వారు హైకోర్టుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం తన వైఖరిని కోర్టుకు వివరించాలి. వారిపై చర్యలు కూడా తీసుకోవాలి.. రిటైర్డ్‌ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికనూ జతపరచాలి. కానీ ఇవేమీ చేయలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం కల్పించుకుని.. సదరు అక్రమ నియామకాలన్నీ సక్రమం చేసేద్దామని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఉన్నత విద్యాశాఖలోని వారే నిర్ఘాంతపోయినట్లు తెలిసింది. సీఎం నేరుగా సంతకం చేసి అక్రమాలను సక్రమం చేయాలంటూ రాసిన ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై పైస్థాయిలోనే నిర్ణయం కావడంతో నేడో రేపో ఉత్తర్వులు కూడా జారీచేసే వీలున్నదని అంటున్నారు.

Updated Date - 2021-10-07T13:56:40+05:30 IST