ఖదిరారిష్ట

ABN , First Publish Date - 2021-01-26T06:34:03+05:30 IST

భారతీయ వైద్యశాస్త్రంలో, చర్మరోగ చికిత్సలో వాడే ఔషధాలలో ముఖ్యమైనది ఖదిరారిష్ట. దీని తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్రగ్రంధాలైన శార్జగర సంహిత, సహస్రయోగ, బైషజ్యరత్నావళిలలో వివరంగా చెప్పబడింది.

ఖదిరారిష్ట

భారతీయ వైద్యశాస్త్రంలో, చర్మరోగ చికిత్సలో వాడే ఔషధాలలో ముఖ్యమైనది ఖదిరారిష్ట. దీని తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్రగ్రంధాలైన శార్జగర సంహిత, సహస్రయోగ, బైషజ్యరత్నావళిలలో వివరంగా చెప్పబడింది.


ఖదిరారిష్ట తయారీలో ముఖ్యంగా ఉపయోగించే మూలిక చండ్ర చెట్టు చెక్క (హార్ట్‌ ఉడ్‌). చండ్ర చెట్టుకు సంస్కృతంలో ఖదిర, ఖదిలరసార అనే పేర్లున్నాయి. ఖదిరారిష్టను చండ్ర చెక్క, దేవదారు బెరడు, ఖావంచాలు, మానిపసుపు, త్రిఫలములు, ఆరెపూలు, తక్కోలములు, నాగకేసరములు, జాజికాయలు, లవంగములు, యేలకులు, లవంగపట్ట, లవంగపత్రి, పిప్పలి మొదలైన మూలికలతో అరిష్ట విధానంలో తయారుచేస్తారు.


ఖదిరారిష్టను ముఖ్యంగా మహా కుష్ఠువులు చికిత్సలో, హృద్రోగము, పాండు, అర్బుదము (మాలిగ్నెంట్‌ ట్యూమర్‌), గుల్మము, ఉబ్బసము, దగ్గు, ప్లీహోదరము (స్ల్పీనోమెగలీ) మొదలైన రోగాల చికిత్సలలో ఉపయోగకరము. మా అనుభవంలో తెలిసిన మరికొన్ని ఉపయోగాలు... జీర్ణవ్యవస్థలో సమస్యలతో అనగా ఆహారాన్ని సరిగా అరిగించుకోలేని సమస్యతో కలిపి వచ్చే దీర్ఘకాలిక చర్మ రోగాలలో ఖదిరారిష్టతో కలిపి జీర్ణవ్యవస్థ వృద్ధి చేసే ఔషధం వాడడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా శ్వాస సంబంధమైన సమస్యలతో కలిపి వచ్చే చర్మ రోగాలలో మహా సుదర్శనతో ఖదిరారిష్టను కలిపి వాడడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని మా అనుభవంలో తెలిసింది.

ఉపయోగించే మోతాదు: దీనిని పెద్దలు 10 మి.లీటర్లు, పిల్లలు 5 మి.లీటర్ల చొప్పున ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచన ప్రకారం వాడవలెను. ప్రస్తుతం ధూత్‌ పాపేశ్వర్‌, జైద్యనాధ్‌, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీనిని తయారు చేస్తున్నాయి.


 శశిధర్‌

అనువంశిక వైద్య నిపుణులు, 

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, కొత్తపేట, చీరాల

Updated Date - 2021-01-26T06:34:03+05:30 IST