అటకెక్కిన భూసార పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-10T04:20:55+05:30 IST

రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలన్నా.. పైరుకు సమపాళ్లలో పోషకాలు అందజేయాలన్నా భూసార పరీక్షలు తప్పనిసరి.

అటకెక్కిన భూసార పరీక్షలు
పూర్తి కానున్న నియోజకవర్గ స్థాయి ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ భవనం

 ఏ మందు వాడాలో... ఏ ఎరువులు వాడాలో తెలియని వైనం

ప్రారంభం కాని ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ 


పొదలకూరు, మే 9 : రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలన్నా.. పైరుకు సమపాళ్లలో పోషకాలు అందజేయాలన్నా భూసార పరీక్షలు తప్పనిసరి. ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించి ఫలితాలను వెల్లడిస్తారు. నేలలో తక్కువగా ఉన్న పోషకాలను వివరించి, దిగుబడులు పెంచుకునేందుకు ఎలాంటి ఎరువులు వాడాలో సూచిస్తారు. ఈ ప్రక్రియ రెండేళ్లుగా నిలిచింది. దీంతో దిగుబడులపై ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో నమూనా పరీక్షలు, మినీ భూసార టెస్టింగ్‌ కిట్‌ ద్వారా కూడా చేసేవారు. గ్రామాల వారీగా సేకరించిన మట్టిని ప్రయోగశాలల్లో పరీక్షించి నెలలోపు ఫలితాలు ఇచ్చేవారు. ఆ మేరకు బీడు, తుంపర్ల భూముల్లో లోపించిన పోషకాలను రైతులు తెలుసుకుని అనవసర ఎరువుల వాడకం తగ్గించేవారు. ఖర్చు తగ్గడంతోపాటు సేంద్రియ ఎరువులను వాడుకునేందుకు అవకాశం ఉండేది. భూమిలో సారం తెలియడంలో ఏ తరహా పంటలు వేసుకోవచ్చు? ఎలాంటి విత్తనం ఎంపిక చేసుకోవాలి? అన్నది రైతులు తెలుసుకునేవారు. ప్రస్తుతం భూసార పరీక్షలు చేయకపోవడంతో అధికారులు పాత విధానంలోనే లెక్కలు కట్టి అంచనాగా చెప్పడంతో అన్నదాతలు వాటిని పాటిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మే నెలలో ప్రారంభం కావాల్సిన పొదలకూరు పట్టణంలోని లెమన్‌ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలో నూతనంగా రూ.55లక్షలతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ పూర్తి కావాల్సిన అవసరం  ఉంది. దీంతో మండలంతో పాటు, నియోజక వర్గంలోని రైతులకు నాణ్యమైన విత్తన సేకరణకు భూపరీక్షల ఆవశ్యకత ఎంతైనా ఉంది. 


ఈ ఖరీఫ్‌ సీజన్‌ కల్లా ల్యాబొరేటరీ సిద్ధం 

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే మట్టి నమూనాలు సేకరిస్తాం. గతంలో స్కీం ప్రకారం మ్యాపింగ్‌ జరిగిన అన్ని గ్రామాల్లో భూసార పరీక్షలు చేశాం. త్వరలో నియోజకవర్గ స్థాయి ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ సిద్ధం కానుంది. ఇందులో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తాం. కరోనా వల్ల కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవం. 

-  నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏడీఏ, పొదలకూరు.

 

Updated Date - 2021-05-10T04:20:55+05:30 IST