జిల్లాలో కుండపోత వర్షం

ABN , First Publish Date - 2021-11-20T06:50:38+05:30 IST

భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది.

జిల్లాలో కుండపోత వర్షం
కణేకల్లులో నేలకొరిగిన వరి పంటను చూపుతున్న రైతు

అతలాకుతలం..

పొంగిపొర్లిన వాగులు, వంకలు

పరవళ్లు తొక్కిన చిత్రావతి నది

పలుచోట్ల వాహనాల రాకపోకలు బంద్‌ 

ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తం 

 భారీగా పంట నష్టం 

సీకేపల్లి మండలం వెల్దుర్తి వద్ద నదిలోచిక్కుకున్న 10 మంది

 హెలికాప్టర్‌ ద్వారా రక్షించిన ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది 

అనంతపురం వ్యవసాయం, నవంబరు 19: భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. ఎడతెరపి లేని వానతో జనజీవనం స్తంభించింది. వరద నీటితో చిత్రావతి నది పరవళ్లు తొక్కింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం కాగా, పలు ఇళ్లు కూలిపోయాయి. చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది  ఉధృతి ప్రకోపాన్ని చూపింది. గురువారం తెల్లవారుజామున వెల్దుర్తి మీదుగా గండికోటకు కారులో వెళుతున్న తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు చిత్రావతి నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి నది మధ్యలో ఉండిపోయింది. నలుగురు వ్యక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డయల్‌-100కు ఫోన చేశారు. స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు స్థానికులు, ఇద్దరు అగ్నిమాపక శాఖ సిబ్బంది, జేసీబీ డ్రైవర్‌తో కలసి జేసీబీ ద్వారా వారిని కాపాడేందుకు నదిలోకి పంపించారు. అంతలోనే ఒక్కసారిగా నదిలో నీటి ప్రవాహం మరింత ఉగ్రరూపం దాల్చింది. వారంతా బయటకు రాలేక  నది మధ్యలో జేసీబీపైనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. జిల్లా యంత్రాంగం స్పందించి ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఇండియన ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మధ్యాహ్నం సమయానికి చేరుకొని నదిలో చిక్కుకుపోయిన పది మందిని రక్షించారు.

భారీ వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువులు నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిలమత్తూరులో చిత్రావతి, కుషావతి నదులు పరవళ్లు తొక్కాయి. పుట్టపర్తిలో చిత్రావతి నది పొంగిపొర్లడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. పుట్టపర్తి పట్టణ వీధులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి జనం ఇబ్బందుల పాలయ్యారు. స్థానిక సాయినగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించారు. చెట్టు కూలి ఒక గేదె మృతి చెందింది. బ్రహ్మసముద్రం మండలం వెస్ట్‌ కోడిపల్లిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. ఆయా కుటుంబసభ్యులు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కుందుర్పి మండలం రుద్రంపల్లిలో ఒక ఇల్లు కూలింది. అదే మండలంలో ఎడతెరిపిలేని వర్షానికి తడిసి ఏడు గొర్రెలు మృతి చెందాయి. శెట్టూరు మండలం అనుంపల్లిలో ఇంటిగోడ కూలడంతో ములకలేటప్పకు తీవ్ర గాయాలయాయ్యయి. యల్లనూరులో ఓ ఇంటిపైకి కప్పు కూలింది. కదిరి పట్టణం కోనేరు సమీపంలోని వర్షపు నీటి ఉధృతితో శ్మశానంలోని శవం కాలనీలోకి కొట్టుకొచ్చింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. అదే మండలం ఎర్రదొడ్డి వద్ద మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. తనకల్లు మండలంలో పాపాగ్ని నదిలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు (సీజీపీ) గేట్లను ఎత్తేశారు. నార్పల మండల కేంద్రంలోని కూతలేరు బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగింది. దీంతో అటుగా ఉదయం నుంచి రాత్రి దాకా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. హిందూపురంలో మూడు దశాబ్దాల తర్వాత శ్రీకంఠాపురం చెరువు మరువ పారింది. నల్లమాడలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయు. అగళి చెరువుకు నీరు చేరుతున్న సమయంలో బొమ్మరసనపల్లి వద్ద కాలువ తెగడంతో వరద నీరు వృథాగా పోతోంది. రాప్తాడు మండలంలో పండమేరు వంక ఉధృతంగా పారింది. ఉరవకొండలోని శివరామిరెడ్డి కాలనీ ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెనుకొండలో ముత్యాల చెరువు నుంచి వర్షపు నీరు అధికంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి కోనాపురంలోని ఆంజనేయస్వామి కోట గోడ కూలింది. తలుపుల మండలం బండ్లపల్లి బీసీకాలనీలోకి వర్షపు నీరు చేరింది. తలుపుల మండల కేంద్రం నుంచి గంజివారిపల్లి, ఇతర గ్రామాలకు వెళ్లే బ్రిడ్జిపై వర్షపు నీరు ప్రవహించడంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదే మండలం కుర్లి గ్రామ రహదారి వద్ద కల్వర్టు వర్షానికి కొట్టుకుపోయింది. కణేకల్లు మండలం హనకనహాళ్‌ వద్ద వంక ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. పామిడి పెన్నానదిలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు రక్షించారు. బత్తలపల్లి మండలం సంగాల వద్ద బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. యల్లనూరు మండలంలోని ఆరవీడు, లక్షుంపల్లి, మల్లాగుండ్ల, పెద్దమల్లేపల్లి, మేడికుర్తి తదితర గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. తాడిమర్రి మండలంలో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ దిగువ భాగంలో వరద నీరు ప్రవహించింది. ఓబుళదేవరచెరువులోని మిట్టపల్లి వంతెన దెబ్బతినడంతో రాకపోకలు ఆగిపోయాయి. బెళుగుప్ప శివారులోని పెద్ద వంక ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అదే మండల పరిధిలోని శిర్పి సమీపంలోని హంద్రీనీవా కాలువకు గండిపడటంతో 20 ఎకరాల్లో మిరప పంట నీటమునిగింది. 


నంబులపూలకుంటలో అత్యధికంగా 237.2 మి.మీ. వర్షపాతం

జిల్లాలో అత్యధికంగా నంబులపూలకుంటలో 237.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. నల్లచెరువు 185.2, ఓబుళదేవరచెరువు 146.4, కదిరి 138.6, గాండ్లపెంట 137, నల్లమాడ 135.2, పుట్టపర్తి 130.2, అమడగూరు 125.0, ముదిగుబ్బ 124.6, పెనుకొండ 122.8, ధర్మవరం 122.4, యల్లనూరు 120.4, కనగానపల్లి 117.4, పుట్లూరు 111.8, తనకల్లు, బుక్కపట్నం 110.4, గోరంట్ల 110.2, కొత్తచెరువు 106.2, నార్పల 100.2, శింగనమల 98.6, రాప్తాడు 98.4, బుక్కరాయసముద్రం 96.4, తలుపుల 96.2, ఆత్మకూరు 92.8, చిలమత్తూరు 91.6, రామగిరి, రొద్దం 90.8, ఉరవకొండ 89.6, చెన్నేకొత్తపల్లి 86.4, గార్లదిన్నె 85, కంబదూరు 84.2, హిందూపురం 83.6, లేపాక్షి 80.4, సోమందేపల్లి 76.8, పెద్దపప్పూరు 74.8, పరిగి 74.6, కూడేరు 74.2, గుడిబండ 71.2, కళ్యాణదుర్గం 70.6, మడకశిర 70.2, అనంతపురం 66.8, బత్తలపల్లి 64.8, పెద్దవడుగూరు 63.2, రాయదుర్గం 62.4, విడపనకల్లు 60.4, బ్రహ్మసముద్రం 56.2, పామిడి 55.4, వజ్రకరూరు 54.2, రొళ్ల 53.4, అమరాపురం 52.8, గుత్తి 51.2, గుంతకల్లు, కుందుర్పిలో 50.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో 48.6 మి.మీ.లోపు వర్షపాతం నమోదైంది. 


రూ.110.53 కోట్ల విలువైన పంటనష్టం 

జిల్లాలో కురిసిన వర్షాలకు భారీగా పంటనష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 54 మండలాల్లో 74871 ఎకరాల్లో రూ.110.53 కోట్ల విలువైన పప్పుశనగ, వరి, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, కంది, పొద్దుతిరుగుడు తదితర పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 178 ఎకరాల్లో రూ.2.87 కోట్ల విలువైన ఉద్యాన పంటలు  అరటి, మామిడి, బీన్స, ఉల్లి, బొప్పాయి, టమోటా, కర్బూజ పంటలు దెబ్బతిన్నాయి. 





















Updated Date - 2021-11-20T06:50:38+05:30 IST