‘అతడు ఆమె ప్రియుడు’ మూవీ రివ్యూ

Published: Fri, 04 Feb 2022 21:21:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అతడు ఆమె ప్రియుడు మూవీ రివ్యూ

యండమూరి వీరేంద్రనాథ్ పరిచయం అక్కరలేని పేరు. ఆయన రాసిన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చాయి. అంతేకాదు ‘అగ్నిప్రవేశం’, ‘స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్’ వంటి చిత్రాలతో దర్శకుడిగానూ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చిన ఆయన మళ్లీ ఇన్నాళ్లకు ‘అతడు ఆమె ప్రియుడు’ అంటూ దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. యండమూరి రచించిన ‘అతడు ఆమె ప్రియుడు’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు(శుక్రవారం) థియేటర్లలో విడుదలైంది. బెనర్జీ, సునీల్, కౌషల్ వంటివారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో తెలుసుకుందాం.   


కథ: 

బెనర్జీ, సునీల్, కౌషల్ పాత్రల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని ప్రళయం రాబోతున్నట్లు వార్తలు వస్తాయి. ఆ వార్తల అనంతరం ఉరుములు మెరుపులతో భయంకరమైన గాలి వాన మొదలవుతుంది. ఆ సమయంలో కౌషల్, సునీల్.. ఆస్ట్రానోమర్ బెనర్జీ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. మరికొన్ని గంటల్లో యుగాంతం కాబోతోందని, ఆ ఇంట్లో ఉండే ముగ్గురికి మాత్రమే బతికే అవకాశం ఉందని బెనర్జీ చెబుతాడు. అయితే మానవ జాతి అంతం కాకుండా ఉండాలంటే.. అక్కడున్న ముగ్గురిలో ఒకరు ప్రాణ త్యాగం చేసి, వారి స్ధానంలో ఒక స్త్రీకి బతికే అవకాశం ఇవ్వాలని బెనర్జీ చెప్పిన మాటలు విని.. కౌషల్, సునీల్ ఆలోచనలో పడతారు. అసలు ఆ ప్రకృతి విపత్తు రావడానికి కారణం ఏంటి? బెనర్జీకి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటి? సునీల్, కౌశల్‌లో ఎవరు ప్రాణత్యాగం చేశారు? ఆ ఇంట్లో అడుగుపెట్టిన స్త్రీ ఎవరు? బెనర్జీ చెప్పినట్లు యుగాంతం అవుతుందా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.


విశ్లేషణ:

ప్రొఫెసర్ పాత్రలో బెనర్జీ తన సీనియారిటీని ప్రదర్శించగా.. ప్రవర పాత్రలో సునీల్ నవ్వులు పూయిస్తాడు. ఓ వైపు ప్రళయం వస్తోందని తెలిసి భయపడుతూనే ఆయన చేసే కామెడీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇక స్త్రీమూర్తి ఔన్నత్యం గురించి కౌషల్ చెప్పే డైలాగ్స్, అతని నటన ఆకట్టుకుంటాయి. ఇంకా ఇతర పాత్రలలో నటించిన మహేశ్వరి, జెన్ని, దియా.. వారి పాత్రల పరిధిమేర నటించగా.. ప్రముఖ నటుడు నాగభూషణం మనవడు భూషణ్‌కు మంచి పాత్ర పడింది. బెనర్జీ, సునీల్, కౌషల్‌.. ఈ ముగ్గురి జీవితాలకు ముడిపెడుతూ.. యండమూరి అల్లిన కథ, కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా.. సినిమాగా కూడా ఇది ఒక నవల చదువుతున్న అనుభూతినే ఇస్తుంది. నేపథ్య సంగీతం ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. చివరిగా, యండమూరి తన మార్క్‌ చూపిస్తూ.. ప్రేమ, స్నేహం, ద్రోహం వంటి వాటితో యూత్‌కి ఓ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు.


ట్యాగ్‌లైన్: యువతకి ‘ప్రేమ’ సందేశం

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International