'సూమె'లోనే 700 మంది భారతీయులు.. ఒక్కరోజే స్వదేశానికి 145మంది తెలుగు విద్యార్థులు

ABN , First Publish Date - 2022-03-06T13:19:36+05:30 IST

కాల్పుల మోత, క్షిపణి దాడులతో తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా సరిహద్దుకు దగ్గర్లో ఉన్న సూమె నగరంతో పాటు పిసోచిన్‌ నగరంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి.

'సూమె'లోనే 700 మంది భారతీయులు.. ఒక్కరోజే స్వదేశానికి 145మంది తెలుగు విద్యార్థులు

దాడులతో కల్లోలంగా ఉత్తర ఉక్రెయిన్‌ నగరం 

ఆవాసాల్లోనే ఉండండి.. రిస్క్‌ చేయొద్దన్న భారత్‌

తరలింపునకు మార్గాలు అన్వేషిస్తున్నామన్న కేంద్రం

‘తరలింపు’పై ప్రధాని మోదీ అత్యున్నతస్థాయి సమీక్ష

ఇంకా 700 మంది భారతీయులు ఉక్రెయిన్‌లోనే

ఆవాసాల్లోనే ఉండండి.. రిస్క్‌ చేయొద్దు: భారత్‌

సూమె: కాల్పుల మోత, క్షిపణి దాడులతో తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా సరిహద్దుకు దగ్గర్లో ఉన్న సూమె నగరంతో పాటు పిసోచిన్‌ నగరంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. అక్కడ వందల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఎప్పుడేం జరుగుతుందోనని భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతోంది. అత్యంత కల్లోలంగా మారిన సూమె నగరంలో ఇరుక్కుపోయిన వారి గురించి మరింత కలవరపడుతోంది. ఈ రెండు నగరాల్లోని భారతీయులను అక్కడి నుంచి తరలించేందుకుగాను సేఫ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని రష్యా, ఉక్రెయిన్‌పై పలు మార్గాల ద్వారా ‘తీవ్ర ఒత్తిడి’ తెస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి  శనివారం వెల్లడించారు.


సూమెలో 700 మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు బాగ్చి చెప్పారు. అయితే ఆ నగరంలో చిక్కుకుపోయిన భారతీయుల సంఖ్య భారీ సంఖ్యలో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకుంటే సూమెలోని సూమె స్టేట్‌ యూనివర్సిటీలోనే 800 మంది విద్యార్థులు చిక్కుకుపోయినట్లు బాధితులే చెబుతున్నారు. వీరంతా బాంబులు, కాల్పులు, వీధి పోరాటల శబ్దాలతోనే నిద్రలేస్తున్నారు. బంకర్ల నుంచి బయటకొచ్చి కాల్పులు, బాంబుల మోత మధ్యే రష్యా సరిహద్దు దిశగా కాలి నడకన బయలుదేరుతామని ఓ సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించారు.


ఈ వీడియో వైరల్‌ కావడంతో కేంద్రం అప్రమత్తమై ఓ ప్రకటన విడుదల చేసింది. సూమెలో ఉన్న భారతీయులంతా ఆవాసాల్లోనే తగిన జాగ్రత్తలు పాటించి భద్రంగా ఉండాలని.. అనవసరంగా రిస్క్‌ తీసుకోవొద్దంటూ బాగ్చి పేర్కొన్నారు.  కాగా ఈ రెండు నగరాల నుంచి మనవాళ్లను సురక్షితంగా తరలించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. 


మరోవైపు ఆదివారం ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి 11 విమానాల్లో 2,200 మంది భారత్‌కు బయలుదేరతారని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. శనివారం 15 విమానాల్లో దాదాపు 3వేల మంది బయలుదేరానని వెల్లడించింది.  వీటిలో భారత వాయుసేనకు చెందిన మూడు విమానాల్లోనే 629 మంది స్వదేశానికి చేరుకున్నారు. ఈ విమానాలు భారత్‌ నుంచి వెళ్లేటప్పుడు బాధితుల సహాయార్థం 16.5 టన్నుల వివిధ రకాలైన వస్తువులను తీసుకెళ్లాయి. కాగా సాధారణ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు వీలుగా జపోరిషియా, మరియుపల్‌ రెండు నగరాల్లో తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటిస్తామని రష్యా ప్రకటించింది.


అయితే ఆ దేశ సేనలు మాత్రం మరియుపల్‌ నగరంలో కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నాయని ఉక్రెయిన్‌ ఆరోపించింది. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు అంశాన్ని సమీక్షించేందుకు ప్రధాని మోదీ శనివారం సాయంత్రం అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఉక్రెయిన్‌ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని అక్కడ చిక్కుకుపోయిన విదేశీయులు అనుకుంటూ ఉంటే  భారత్‌కు చెందిన ఆ వైద్యుడు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాడు.  మన దేశానికి చెందిన అందరు విద్యార్థులను సురక్షితంగా సరిహద్దులకు తరలించేదాకా తాను ఉక్రెయిన్‌ను వీడేదని లేదని స్పష్టంచేస్తున్నాడు 37 ఏళ్ల పృథ్వీరాజ్‌ ఘోష్‌. తాను ఇప్పటిదాకా నా విద్యార్థులైన 350 మంది భారతీయులను కీవ్‌ నుంచి సురక్షితంగా బయటపడేలా చేశానని ఘోష్‌ చెప్పారు. ఇక ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో శనివారం ఒక్కరోజే 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.


బంకర్లలో 4 రోజులు నిద్రలేని రాత్రులు 

మా స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని బోగో మోలెట్స్‌ వర్సిటీలో ఎంబీబీఎస్‌ థర్డియర్‌ చదువుతున్నాను. యుద్ధం మొదలైన రోజు విద్యార్థులమంతా నాలుగు రోజులు బంకర్లలో గడిపాం. భారత ఎంబసీ అధికారుల సూచనతో 28న హాస్టల్‌కు దగ్గరలోని రైల్వేస్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి రైల్లో 22 గంటలు ప్రయాణించి 1న రాకీవ్‌ నగరానికి చేరుకున్నాం. అక్కడి నుంచి స్లోవేకియా సరిహద్దులకు చేరుకుని భారత ఎంబసీ అధికారులను కలుసుకున్నాం. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నాం. -సుప్రజ

Updated Date - 2022-03-06T13:19:36+05:30 IST