యువతితో స్నేహంగా ఉంటూనే లక్షలు కొట్టేశారు..!

ABN , First Publish Date - 2021-04-05T14:57:45+05:30 IST

ఆమెతో స్నేహంగా మెలిగారు. డబ్బులు కావాలంటే ఏటీఎం కార్డు ఎక్కడుందో

యువతితో స్నేహంగా ఉంటూనే లక్షలు కొట్టేశారు..!

  • ఏటీఎం కార్డు కొట్టేసి.. జల్సాలు
  • రూ. 3.10 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
  • ఇద్దరిని అరెస్ట్‌  చేసిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ : ఆమెతో స్నేహంగా మెలిగారు. డబ్బులు కావాలంటే ఏటీఎం కార్డు ఎక్కడుందో, దాని పిన్‌ నంబర్‌ ఏమిటో కూడా చెప్పేసింది. తర్వాత దానిని కొట్టేసి రూ. 3.10 లక్షలు కొల్లగొట్టి గోవాలో జల్సా చేశారు. రాచకొండ పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ కథనం ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన పూలకుంట శ్రీనివాస్‌, కర్నూలు జిల్లాకు చెందిన ఉదయ్‌ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో ఇద్దరికీ పరిచయమైంది. శ్రీనివాస్‌ మేస్త్రీ కాగా, ఉదయ్‌ హెల్త్‌కేర్‌ టేకర్‌. వీరికి గణేష్‌ అనే మరో యువకుడు పరిచయం అయ్యాడు. ఓ రోజు గణేష్‌ తన స్నేహితురాలైన ఓ యువతిని వీరికి పరిచయం చేశాడు. అప్పటి నుంచి వారంతా తరచూ ఆ యువతి ఇంటికి వెళ్తుండేవారు. ఈ క్రమంలో యువతి ఇంట్లో ఉన్న కుక్కపిల్ల ముద్దుగా ఉందని, తమకు బాగా నచ్చిందని శ్రీనివాస్‌, ఉదయ్‌ చెప్పారు. కావాలంటే తీసుకెళ్లి పెంచుకోవాలని ఆమె వారితో చెప్పింది.


ఫిబ్రవరిలో ఓ రోజు వారు ఆ యువతి ఇంటికి వెళ్లారు. ఆ సయమంలో యువతి ఇంట్లో లేకపోవడంతో ఫోన్‌ చేసి, కుక్కపిల్లను తీసుకెళ్లడానికి వచ్చామని చెప్పారు. తమ వద్ద ఆటో చార్జిలకూ డబ్బులు లేవని, రూ. 500 కావాలని అడిగారు. దీంతో ఆ యువతి ఇంట్లో ఫలానా చోట ఏటీఎం కార్డు ఉందని, పిన్‌ నంబర్‌ చెప్పింది. వారు రూ. 500 డ్రా చేసుకుని, బ్యాలెన్స్‌ చెక్‌ చేశారు. లక్షల్లో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎలాగైనా కార్డు కొట్టేయాలని పథకం వేశారు. గతంలో వెళ్లినట్లుగా కొద్ది రోజులు యువతి ఇంటికి వెళ్లేవారు. అదును చూసి ఆమె బ్యాగ్‌లో ఉన్న ఏటీఎం కార్డును కొట్టేశారు. కొద్దిరోజులపాటు ఎక్కడా ఉపయోగించలేదు. కార్డు ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించిన యువతి దాని గురించి మరిచిపోయింది.


తర్వాత నిందితులిద్దరూ గోవాకు వెళ్లి, అక్కడ పబ్‌ల్లో ఎంజాయ్‌ చేశారు. యువతి నుంచి చోరీ చేసిన ఏటీ ఎం కార్డుతో డబ్బులు చెల్లించేవారు. ఇలా యువతి ఖాతాలో నుంచి రూ. 3.10 లక్షలు ఖర్చు చేశారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న యువతి రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. శ్రీనివాస్‌, ఉదయ్‌లను నిందితులుగా గుర్తించి, అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-04-05T14:57:45+05:30 IST