ఏటీఎం డబ్బులను లూటీ చేసేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-03-11T20:32:34+05:30 IST

ఏటీఎం యంత్రాల్లో చేరాల్సిన డబ్బు కొందరు కస్టోడియన్ల చేతుల్లోకి వెళ్తోంది.

ఏటీఎం డబ్బులను లూటీ చేసేస్తున్నారు!

  • విడతల వారీగా రూ.1.13కోట్లు చోరీ
  • ఏటీఎంలల్లో నింపాల్సిన డబ్బు చోరీ 
  • బ్యాంకుల అలసత్వం.. ఏజెన్సీల నిర్లక్ష్యం..  
  • పోలీసులకు చిక్కినా మార్పురాని వైనం..  

హైదరాబాద్‌ :  ఏటీఎం యంత్రాల్లో చేరాల్సిన డబ్బు కొందరు కస్టోడియన్ల చేతుల్లోకి వెళ్తోంది. కంచే చేను మేసిన చందాన తప్పుడు ఆధారాలతో రూ.లక్షలు లూటీ చేస్తున్నారు. ఎప్పుడో ఆడిటింగ్‌ జరిగినప్పుడు తేడా రావడంతో ఇలాంటి మోసాలు వెలుగు చూస్తున్నాయి. నగరంలో సీసీఎస్‌ పోలీసులకు ఇలాంటి కేసుల తాకిడి పెరుగు తూనే ఉంది. గత ఏడాది కాలంలో ఓ బ్యాంకుకు సంబంధించి ఇద్దరు కస్టోడియన్లపై కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు రెండో సారి కేసు నమోదై అరెస్టు కావడం గమనార్హం.


ఇంటి దొంగలే..

బ్యాంకు అధికారుల అలసత్వం, కస్టోడియన్లను నియమించే ఏజన్సీల నిర్లక్ష్యంతో నేరస్థులు రెచ్చిపోతున్నారు. జంటనగరాల్లో ఇటీవల వెలుగు చూస్తున్న ఇలాంటి మోసాలు కేవలం బ్యాంకు అధికారులనే కాదు... పోలీసులను సైతం నివ్వెర పరుస్తున్నాయి. సీసీఎస్‌ డిటెక్టివ్‌ విభాగంలో నమోదైన కేసు విచారణ చేపట్టగా, ఓ సంస్థలోని ఇంటి దొంగల నిర్వాకం వెలుగు చూసింది. రూ. 1.3కోట్లు కొల్లగొట్టిన ఘరానా దొంగలు ఏడాదిగా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు గతంలోనూ ఇదే నేరంపై జైలుకెళ్లి వచ్చాడు.  ప్రస్తుతం కస్టోడియన్‌గా ఉన్న వ్యక్తిని అదే ట్రాప్‌లోకి లాగి ఇద్దరు కలిసి రూ. 1.3కోట్లు కాజేశారు.


రూ.కోట్ల లావాదేవీలు 

నగరంలో వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 5వేలకు పైగా ఏటీఏం కేంద్రాలు ఉన్నాయి. నిత్యం రూ.100 కోట్లకు పైగా ఏటీఎంల నుంచి డ్రా చేసుకుంటారని అంచనా. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు యంత్రాల్లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఆయా ఏటీఏంలలో డబ్బులు నింపేందుకు బ్యాంకులు ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి. ఆయా ఏజెన్సీలకు ఇచ్చే రూట్‌ ఆధారంగా డబ్బులు నింపాల్సి ఉంటుంది. దానికోసం ఏజెన్సీలు తమ అధీనంలో ఉండే ఉద్యోగులను నియమించుకుని డబ్బులు  నింపే పనిని అప్పగిస్తాయి. సుమారు 20 ఏటీఎంలకు ఓ ఏజెన్సీ పని చేస్తుంది. ప్రతి ఏటీఎం లో సుమారు రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు డబ్బు నింపే అవకాశాలుంటాయి. ప్రాంతాన్ని బట్టి ఏ ఏటీఎంలో ఎంత డబ్బు నింపాలనే విషయాన్ని ఏజెన్సీకి బ్యాంకు అధికారులు చెబుతారు. డబ్బులు నింపే వాహనంలో ఇద్దరు కస్టోడియన్లు, ఒక భద్రతా సిబ్బంది, వాహన డైవ్రర్‌ ఉంటారు. ఏటీఎంలో రూ. 20లక్షల నుంచి దాదాపు రూ. 50లక్షల వరకు కరెన్సీని నింపుతారు. ఈ బృందాలకు నేతృత్యం వహించే కస్టోడియన్లు తమకు అప్పగించిన డబ్బును ఏటీఎంలో నింపిన తర్వాత అక్కడే ఉండే స్విచ్‌ను ఆన్‌చేసి వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలు బ్యాంకులకు, వాటి ప్రధాన కార్యాలయాలకు చేరుతాయి.


అన్నీ లొసుగులే..

ఏజెన్సీల ఆడిటింగ్‌లో ఉన్న లోపాలు, వాటి నమోదులో ఉన్న లొసుగులు నేరస్థులకు కలిసి వస్తున్నాయి.  ఏటీఎంలలో డబ్బులు నింపే విషయంలో కొందరు కస్టోడియన్లు నింపాల్సిన డబ్బును రోజూ కొంత కాజేసి, అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉదాహరణకు ఓ ఏటీఎంలో రూ. 20లక్షలు నింపాల్సి ఉండగా, రూ. 19లక్షలు లేదా రూ. 19.5లక్షలు మాత్రమే నింపుతున్నారు. మరో ఏటీఎంలో రూ.50లక్షలు నింపాల్సి ఉండగా.. రూ. 48లక్షలు లేదా రూ. 49లక్షలు మాత్రమే నింపుతున్నారు. ఇలా ప్రతి ఏటీఎం నుంచి కొంత కాజేసి రోజూ లక్షల్లో చోరీ చేస్తున్నారు. స్విచ్‌లో మాత్రం పూర్తిగా నింపినట్లు నమోదు చేస్తారు. ఏటీఎంలో ఎంత డబ్బు నింపారనే విషయంలో ఏజెన్సీలో కానీ.., బ్యాంకులో కానీ నేరుగా తెలిసే అవకాశం లేదు. కస్టోడియన్లు ఎంట్రీ చేసిన అమౌంట్‌ ఆధారంగానే వ్యవహారం సాగిపోతోంది. పుణ్యకాలం గడిచిన తర్వాత ఎప్పుడో ఆడిటింగ్‌ జరిగితే ఇలాంటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆడిటింగ్‌ సమాచారం ముందస్తుగానే లీక్‌ కావడంతో ఇతర రూట్‌లో నింపాల్సిన డబ్బులు తీసుకొచ్చి ఆ రూట్‌లో నింపినట్టు కూడా ఆరోపణలున్నాయి. డబ్బులు నింపే అవకాశం లేనప్పుడు మాత్రమే వారి మోసం వెలుగులోకి వస్తోంది.


కోట్లల్లో కొల్లగొడుతున్నారు..

కస్టోడియన్ల నియామాకాల్లోనూ ఏజెన్సీలు సరైన నిబంధనలు పాటించడం లేదనే వాదన కూడా ఉంది. నియమిస్తున్న వ్యక్తి గురించి పూర్తి సమాచారం, అతని నేర చరిత్ర, అతని గురించి విచారణ చేయకుండానే నియమిస్తున్నారు. తీరా అలాంటి వారి గురించి కేసులు నమోదైన తర్వాత ఆందోళన చెందుతున్నారు. రూ. కోట్లలో కాజేసిన తర్వాత కేసులు నమోదు చేసి పోలీసులు వారిని అరెస్టు చేస్తే రూ. లక్షలు కూడా వసూలు కావడం లేదు. ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నందున ఇప్పటికైనా బ్యాంకులు.. ఏజెన్సీలు తగిన  జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-03-11T20:32:34+05:30 IST